Online Puja Services

అనంతపద్మనాభస్వామి,అనంతగిరి,తెలంగాణా.

18.191.156.36
అనంతపద్మనాభస్వామి,అనంతగిరి,తెలంగాణా.

దేవాలయం తెరచు వేళ
లు
:

ఉదయం 7:30 గంటల నుండి రాత్రి 8:00 వరకు

అనంతపద్మనాభస్వామి అనగానే మనకు ఎక్కడో కేరళలో ఉన్న ఆలయమే గుర్తుకువస్తుంది. కానీ మన హైదరాబాదుకి వందకిలోమీటర్లలోపు దూరంలోనే అనంతగిరి కొండల మీద వెలసిన స్వామి గురించి చాలామందికి తెలియదు. చుట్టూ కొండలూ, దట్టమైన చెట్లు, నీడనిచ్చే మబ్బుల మధ్య స్వామి సైతం సేద తీరుతున్నాడా అన్నట్లుగా ఉండే ఈ అనంతగిరి విశేషాలు తెలుసుకొని తీరాల్సిందే.
మార్కండేయుని తపస్సుకి మెచ్చి
ఈ కొండ మీద వెలసిన అనంతపద్మనాభస్వామి పేరుమీదుగానే అనంతగిరి అన్న పేరు వచ్చింది. ఇక్కడ స్వామి గురించి రెండు కథలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఒకటి మార్కండేయ మహర్షికి సంబంధించినది కాగా రెండో కథలో ముచికుందుడనే రాజర్షిది ప్రధాన పాత్ర. ఒకప్పుడు మార్కండేయ రుషి ప్రశాంతమైన ఈ కొండప్రాంతంలో తపస్సు చేసుకుంటూ గడిపేవాడట. తన తపోబలంతో రోజూ ఆయన కాశికి వెళ్లి గంగలో స్నానమాచరించి తిరిగి ఇక్కడకు చేరుకునేవాడట.
కానీ ఒకరోజు వేళ మించిపోవడంతో మార్కండేయుడు గంగను చేరుకోలేకపోయాడు. అప్పుడు సాక్షాత్తూ ఆ గంగాధరుడైన ఈశ్వరుడే మార్కండేయుని ఆశ్రమం వద్ద గంగాజలం లభ్యమయ్యేట్ల అనుగ్రహించాడట. అంతటి తపోనిష్టుడైన మార్కండేయుని తపస్సుకి మెచ్చి అనంతపద్మనాభస్వామి సాలగ్రామ రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడని స్థలపురాణం చెబుతోంది. ఆ సాలగ్రామాన్ని ప్రతిష్టిస్తూ మార్కండేయ మహర్షి నిర్మించిన ఆలయమే ఈనాటి ఆలయానికి తొలిరూపమని పేర్కొటారు. ప్రస్తుత ఆలయాన్ని మాత్రం నాలుగు వందల ఏళ్ల క్రితం నిజాం నవాబులు కట్టించరనేందుకు దాఖలాలు ఉన్నాయి.
ఆనాటి ముచికుంద నదే ఇప్పటి మూసీ
అనంతగిరి కొండలకు సంబంధించి మరో కథ కూడా ఆసక్తిగానే సాగుతుంది. ముచికుందుడనే రాజు మాంధాత కుమారుడు. దేవదానవులకు మధ్య జరిగిన యుద్ధంలో ఆయన దేవతల పక్షాన నిలచి అరివీరభయంకరంగా పోరాడాడు. ముచికుందుని శౌర్యంతో దేవతలకు విజయం లభించినప్పటికీ, సుదీర్ఘకాలం పోరు సల్పిన కారణంగా ముచికుందుడు అలసిపోయాడు. దాంతో తనకు సుదీర్ఘమైన నిద్ర కావాలనీ... ఒకవేళ ఎవరన్నా తనకు నిద్రాభంగం కలిగిస్తే వారు తన చూపులతో భస్మం కావాలనీ ఇంద్రుని నుంచి వరాన్ని కోరుకున్నాడు ముచికుందుడు. ఆ వరంతోనే అనంతగిరి కొండల మీద గాఢనిద్రలో మునిగిపోయాడు.
ఈలోగా కాలయవనుడనే రాక్షసుడు ప్రజలను పీడించడం మొదలుపెట్టాడు. రాజుల మొదలుకొని రుషుల వరకూ అందరినీ పీడిస్తున్న కాలయవనుడి కన్ను కృష్ణుని మీద పడింది. కృష్ణుని కనుక ఓడించగలిగితే ఇక ముల్లోకాలలోనూ తనకు తిరుగు ఉండదనుకున్నాడు కాలయవనుడు. అందుకని ఏకంగా కృష్ణుని రాజ్యంగా మీదకే దండెత్తాడు. కానీ కృష్ణుడు సామాన్యమైనవాడా! తన చేతికి మట్టి అంటుకోకుండా, ఇటు ముచికుందుని శాపానికి సామాన్యలు భస్మం కాకుండా ఆయన ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.
కాలయవనుడు తన మీదకు దండెత్తి రాగానే పారిపోతున్నట్లుగా నటిస్తూ, ఆ రాక్షసుని అనంతగిరి కొండ మీదకు రప్పించాడు. ఆపై ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి చేరి మాయమయ్యాడు. గుహలోకి ప్రవేశించిన కాలయవనుడు, శ్రీకృష్ణుడనుకుని ముచికుందుని మీదకు ఎగబడ్డాడు. ఇంకేముంది! ముచికుందుడు కళ్లు తెరవగానే కాలయవనుడు కాస్తా బూడిదైపోయాడు. ఆపై ముచికుందునికి అనంతపద్మనాభస్వామి రూపంలో సాక్షాత్కరించిన శ్రీకృష్ణుడు, ముచికుందుకు ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఒక నది రూపంలో అక్కడి నుంచి ప్రవహిస్తాడని అనుగ్రహిస్తాడు. ఆ ముచికుంద నదే క్రమేపీ మూసీ నదిగా మారింది.
చూసి తీరవలసిన క్షేత్రం
వేల సంవత్సరాల చరిత్ర, మహిమాన్వితమైన స్థలపురాణం, ఆహ్లాదకరమైన వాతావరణం... ఒక పుణ్యక్షేత్రాన్ని చూసేందుకు మరేం కావాలి. అందుకే అనంతగిరికి భక్తుల తాకిడి నానాటికీ పెరుగుతోంది. అనంతపద్మనాభస్వామి ఆలయం, బగీరథ గుండం, మార్కండేయులవారు తపస్సు ఆచరించిన ప్రదేశం, మూసీ నది ప్రవాహం... ఇలా అనంతగిరి కొండల మీద చూసేందుకు చాలా ప్రదేశాలే ఉన్నాయి.

సర్వేజనా సుఖినోభవంతు

రామకృష్ణంరాజు గాదిరాజు

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba