Online Puja Services

తలుపులమ్మ తల్లి దేవాలయం, లోవ, తుని ‘

3.133.122.6
తలుపులమ్మ లోవ దర్శన సమయం ఉదయం 7:00 నుండి సాయంత్రం 6:00 వరకు అమ్మవారు 'తలుపులమ్మ' గా ఆవిర్భవించిన క్షేత్రమే 'లోవ'. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని 'ధారకొండ' గానూ మరొక దానిని 'తీగకొండ' గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య 'తలుపులమ్మ' అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.

పురాణ గాథ
కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

పూజ మరియు పండగలు
ప్రతి ఏటా చైత్ర మాసం (ఏప్రియల్/ మార్చ్), ఆషాఢ మాసం (జూన్/జులై) లో దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బహుళ విదియ, తదియ రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడ వేడుకలు సుమారు 15 రోజులపాటు వైభవంగా జరుగుతాయి. సందర్శించు సమయం : సాయంత్రం ఆరు గంటల వరకే గుడి తెరుస్తారు.

వసతి తలుపులమ్మ తల్లి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ సుమారు 28 కాటేజీలు కలవు . నామమాత్రపు ధరల్లో ఇవి లభిస్తాయి. ఉత్సవాలు, పండుగల సీజన్లో గదులు దొరకడం కష్టం. గెస్ట్ హౌస్ లు లేవు కనుక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఉదయాన్నే వచ్చి సాయంత్రం తిరుగుప్రయాణం అవుతారు.

తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి.

తలుపులమ్మ లోవ ఆలయానికి ఎలా చేరుకోవాలి ? తలుపులమ్మ లోవ గుడి కాకినాడకు 70 కి. మీ ల దూరంలో, రాజమండ్రి కి 106 కి. మీ ల దూరంలో, అమలాపురానికి 176 కి. మీ ల దూరంలో తుని కి కేవలం 8 కి. మీ ల దూరంలో కలదు. ఈ గుడి జాతీయ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో, తుని రైల్వే స్టేషన్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

సమీప విమానాశ్రయం : రాజమండ్రి
సమీప రైల్వే స్టేషన్ : తుని
బస్సు మార్గం : తుని వరకు బస్సులో ప్రయాణించి... అక్కడి నుంచి జీపులలో లేదా షేర్ ఆటోలలో ప్రయాణించి తలుపులమ్మ తల్లి దేవస్థానం చేరుకోవచ్చు. తలుపులమ్మ లోవ కొత్తూరు సమీప గ్రామం అక్కడి వరకూ బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుండి దేవాలయం వరకూ ఆటోలు, జీపులు, టాక్సీల సౌకర్యం కలదు

సర్వేజనా సుఖినోభవంతు

- రామకృష్ణంరాజు గాదిరాజు

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya