Online Puja Services

లక్షాధికారి కొడుకు

18.117.229.168

పూర్వం ఓ గ్రామంలో ఒక లక్షాధికారి ఉండేవాడు. అతడికి ఒక్కగానొక్క కొడుకు. గారాబంగా పెరిగాడు. చెడు సావాసాలతో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. కొడుకు బుద్ధి మార్చాలని తండ్రి ఎంతో ప్రయత్నించాడు. అయినా అతడి తీరు మారలేదు. రోజులు గడుస్తున్నాయి. లక్షాధికారికి ముసలితనం వచ్చింది. కొడుకేమో ఆస్తిని నాశనం చేయసాగాడు. కొడుకును దారిలో పెట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు తండ్రి. 

తన ఆస్తినంతటినీ అమ్మి.. బంగారం, వజ్రాల రూపంలోకి మార్చాడు. వాటిని రెండు రాగి బిందెల్లో ఉంచి.. ఎవరికీ తెలియకుండా పెరట్లో ఒక చోట గోతి తవ్వి అందులో దాచిపెట్టాడు. కొన్నాళ్లకు లక్షాధికారి మరణించాడు.

రోజులు గడుస్తున్నా కొద్దీ కొడుకు పరిస్థితి దీనంగా తయారైంది. తిండి లేక పస్తులుండే పరిస్థితి దాపురించింది. తనకు ఎవరూ సాయం చేయరని అర్థమైంది. చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. ‘నాన్న మాట విని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా!’ అని బాధపడేవాడు. 

జీవితం నేర్పిన పాఠాలతో మనిషి పూర్తిగా మారిపోయాడు. కష్టపడి పని చేయసాగాడు. నలుగురిలో మంచివాడు అన్న గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా, ఒకరోజు.. లక్షాధికారి స్నేహితుడు ఒకరు వీళ్లింటికి వచ్చాడు. ‘నాయనా! మీ తండ్రి గొప్పవాడు. ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాడు. నువ్వు ఇలా కష్టపడటం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ ఇల్లు అమ్మివేసి ఏదైనా వ్యాపారం చేసుకో!’ అన్నాడు. 

దానికి అతడు.. ‘అయ్యా! మా నాన్న సంపాదించిందంతా నేను నాశనం చేశాను. ఈ ఇల్లు ఒక్కటే మిగిలింది. ఇది వారి జ్ఞాపకం. ఇల్లు అమ్మలేను. ఇకమీదట నా కష్టం మీద నేను బతుకుతాను’ అని బదులిచ్చాడు. ఆ మాటలు విన్న పెద్ద మనిషి ఎంతో సంతోషించాడు. 

‘బాబూ! ఈ రోజు కోసమే మీ నాన్న ఎదురు చూశాడు. ఇక నీకు కష్టాలు ఉండవు. మీ పెరట్లో ఫలానా చోట మీ నాన్న బంగారం, వజ్రాలు దాచి పెట్టాడు. వాటిని వెలికి తీసి.. ఏదైనా వ్యాపారం మొదలుపెట్టు. వృద్ధిలోకి రా!’ అని దీవించి వెళ్లిపోయాడు.

ఆ స్నేహితుడు చెప్పిన చోట తవ్వాడు. రెండు బిందెల బంగారం, వంద వజ్రాలు దొరికాయి. ఎంతో సంతోషించాడు. కొంత బంగారం అమ్మి వ్యాపారం మొదలుపెట్టాడు. నిబద్ధతతో పని చేసి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు.

ఈ కథ మనుషులందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కలిమి (ఆత్మ) అందరికీ ఉంటుంది. అది గుర్తించకుండా... దారిద్య్రం (దుఃఖం) అనుభవిస్తుంటాం. ఆ కలిమి
ఉనికిని కనుగొన్న నాడు.. దారిద్ర్యాన్ని అధిగమించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలుగుతాం

బి. సునీత 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba