దేవుని మనస్ఫూర్తిగా నమ్మాలి
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు.
దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు.భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి 'నా దగ్గర ఏమీ లేదు ' అని అన్నారు. దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు.
మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి' అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, "బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో, పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు" అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు.
దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ.బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ,
'ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ' అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది.అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు. ఆనందబాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు.
అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?" అని బాధపడ్డాడు. అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ' నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు.
అపార నమ్మకం, సమర్పణ, "శరణాగతి" ఉన్న చోటే నేను ఉంటాను." (అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ) మనం చేసే ధ్యానం అయినా అంతే మనస్ఫూర్తిగా సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఫలితాన్ని పొందగలం!
సర్వేజనా సుఖినోభవంతు!
- వెలగ శ్రీనివాస్ ప్రసాద్