భూమి గొప్పదనం
*మట్టి - మనిషిమనం రోజూ భూమిని తింటున్నాం’ అన్నారు ఒక ఆధ్యాత్మిక గురువు. సామాన్యంగా ఆలోచిస్తే ఆ మాటకు అర్థం ఏమిటో ఓ పట్టాన బోధపడదు. తాత్విక లోతుల్లోకి దిగి గమనిస్తే దాని అంతరార్థాన్ని సులువుగా గ్రహించవచ్చు. పంచభూతాల్లో ఒకటైన భూమి మిగతావాటికన్నా ప్రత్యేకమైనది. ఈ భూమ్మీద పుట్టిన జీవులు సేవించే ఆహారం మట్టి రూపాంతరం. నేల లోంచి అంకురం పొడుచుకొని వస్తుంది. అందులోంచి మొక్క, తరవాత దానికో పువ్వు, ఆ పుష్పం- పిందె, కాయ, పండుగా మారుతుంది. అదే జీవరాశి ఆకలి తీర్చుతుంది.
అన్నంతో ప్రాణుల దేహాలు తయారవుతాయి. ఆ అన్నం వచ్చేది మట్టిలోంచే! అందువల్ల మనిషి మట్టేనన్నది వేదాంతం. మట్టి- ఒక్క ఆహారంగానే కాదు... ధరించే దుస్తులు, నివసించేందుకు గృహాలు, ప్రయాణించేందుకు వాహనాలు... ఇలా ఒకటేమిటి- మనిషి మనుగడకు కావాల్సినవి అన్నీ మట్టి రూపాలే!
మన్నుతిన్న చిన్నికృష్ణుణ్ని నోరు తెరవమన్న యశోదమ్మకు మట్టికి బదులు ‘భువన భాండం’ దర్శనమిచ్చింది. శ్రీమహావిష్ణువు బాలగోపాలుడిగా చేసిన అల్లరి పనుల్లోనూ అనేక ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉన్నాయి. అంతా మట్టేనని, అన్నీ తానై (చైతన్యం) ఉన్నాననీ చెప్పడమే ఆ దృగ్విషయం పరమార్థం. అదీకాక ‘సర్వం శక్తిమయం’ అన్న ఆధ్యాత్మిక అంశాన్ని ఆధునిక భౌతిక శాస్త్రమూ ని=్ఝ‘2 ప్రతిపాదనతో రూఢి చేసింది.
‘కావడి కొయ్యేనోయ్... కుండలు మన్నేనోయ్... కనుగొంటే సత్యమింతే నోయి’ అన్నారు సినీకవి సముద్రాల. ‘మట్టి, మనిషి, ఆకాశం’ శీర్షికతో కవిత్వం రాశారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె. సమాజ హితం కోరేదే సాహిత్యం. అలాంటి సృజనాత్మక సాహిత్యంలోనూ మట్టి చోటుచేసుకుంది. ఇలా మట్టికి మనిషికి మధ్య విడదీయలేని బంధం ఉంది. మట్టి లేకుండా మనిషి జీవితం ముందుకు సాగదు.
మనిషిని మనిషి మోసం చేస్తాడేమోగాని, మట్టి ద్రోహం చెయ్యదు. అణువణువూ చైతన్యం నిండిన మట్టి- దాన్ని నమ్మి సాగుచేసిన రైతన్నకు పంటల రాశిని ఇస్తుందేగాని వంచన చెయ్యదు. ఎలాంటి హానీ తలపెట్టదు. మట్టిని ఎవరైనా కొడితే అది తిరిగి కొట్టదు. ఏ రూపంలోనూ ప్రతీకారం తీర్చుకోదు. దానికున్నంత సహనం దేనికీ లేదు. అది అనేకానేక ఔషధ మొక్కల్ని అందించి మానవాళిని సేవిస్తూనే ఉంటుంది. అందుకే భూమిని తల్లిలా భావిస్తారు.
విశ్వం మొత్తంలో భూమి ఒక్కటే మానవ జాతి జీవనానికి అత్యంత అనుకూలమైన గ్రహం. అది లేకపోతే మనిషి మనుగడే ప్రశ్నార్థకం! ప్రళయ కాలంలో భూమి మునిగిపోతుంటే శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి భూమిని కాపాడినట్లు పురాణాల్లో చదువుతాం.
నవగ్రహాల్లోకెల్లా భూమి అందమైన గ్రహం. నీలి రంగులో అగుపడే అది, నారాయణుడి రూపానికి ప్రతిరూపం. హిమగిరుల్లో బోళాశంకరుడు కాపురముంటే, ఏడు కొండలపైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. శ్రీరామచంద్రులవారు అయోధ్యలో పుట్టి పెరిగి, సీతాసమేతుడై, తమ్ముడు లక్ష్మణుడితో గోదావరి తీరమంతా నడయాడారు. మునులు, ఋషులు ఈ భూమ్మీదనే తపోధ్యానాలు గావించి మోక్ష ప్రాప్తి పొందారు.
చైతన్య స్రవంతి తెచ్చే అనేక మార్పులకు లోనవుతూ, నిత్యనూతనమైన ప్రాకృతిక పాఠాలతో మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతున్న భూమాతకు వందన సమర్పయామి.
- భానుమతి అక్కిశెట్టి