పంచకేదార్ శివలింగ క్షేత్రములు
పంచకేదార్ హిమాలయ పర్వతములలో నున్న పంచకేదార్ శివలింగ క్షేత్రములు శివలింగ క్షేత్రములలో ప్రశస్తమైనవి.
ఈ పంచ కేదార్ క్షేత్రములు కేదారేశ్వర్ నుండి బదరీనాధ్ వరకు విస్తరించి యున్నవి.
అవి 1. కేదారేశ్వర్ 2. మధ్యమహేశ్వర్ 3. తుంగనాధ్ 4. రుద్రనాధ్ 5. కల్పెశ్వర్.
అనేక యాత్రా స్థలాలు కాలినడకనే వెళ్ళవలసి వుంటుంది . శారిరిక అలసట తెలియకుండా ఉండేందుకా అన్నట్లు అక్కడి వాతావరణం ఆహ్లాద కరంగా వుంటుంది . నడవలేని వారికోసం గుఱ్ఱాలు , డోలీలు దొరుకుతాయి. చాలా చోట్ల చాలా ఎత్తు (స్టీప్) ఎక్కవలసి రావడంతో కాస్త ఆయాసం ఎక్కువగా అనిపిస్తుంది.
శివుడు నంది (ఎద్దు) రూపములో అదృశ్యమై అయిదు భాగములుగా మూపుర భాగము కేదారేశ్వర్ నందు, నాభి మరియు ఉదర భాగము మధ్యమహేశ్వర్ లోనూ, చేతులు తుంగనాధ్ లోనూ, ముఖము రుద్రనాధ్ లోనూ, తల మరియు కురులు కల్పెశ్వర్ నందు వ్యాప్తి చెందినవి.
పురాణముల ప్రకారము ఈ ఎద్దు (నంది) ముందు భాగము నేపాల్ లోని పశుపతినాధునిగా దర్శనము ఇచ్చినాడు. శివుని (నంది) మూపురము కొలువబడు చున్న కేదార్నాధ్ నకు ముందుగా శివుని ముందుభాగము పూజింపబడు చున్న పశుపతినాధ్ దేవాలయమునుండి ఈ యాత్ర ప్రారంభము అవుతుంది. కేదార్నాధ్ చిహ్నము పశుపతినాధ్ ఆలయగోపురము నందు దర్శనముఇచ్చును.
పంచకేదార్ లలో శివ దర్శనము అయి యాత్ర పూర్తి అయిన పిమ్మట చివరిగా విష్ణు భగవానుడు వెలసి యున్న బదరీనాధ్ దర్శించి అచట కూడా శివుని దీవనలు పొందవలసి ఉంటుంది. తుంగనాధ్ నందు తప్ప మిగిలిన క్షేత్రములలో పూజారులు దక్షణ భారతము నుండి వలస వెళ్ళిన వారే.
బదరీనాధ్ ఆలయము నందలి పూజారులు కేరళ రాష్ట్రమునందలి మలబార్ నుండి వలస వెళ్ళినవారు. మధ్య మహేశ్వర్ ఆలయ పూజారులు జంగమ లేదా వీర శైవ లింగాయుతులు. రుద్రనాధ్ నందు మరియు కల్పెశ్వర్ ఆలయము లందు ఆది శంకరాచార్యులచే నియమించ యాడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వర్తించెదరు. తుంగనాధ్ నందు కాశీ బ్రహ్మలు సేవ చేయదురు.
కేదారనాధ్ తీర్ధములో పురోహితులు లేదా పండాలు హిమాలయ ప్రాంతములో పూర్వకాలమునుండి అనగా కృత యుగము ఆఖరునుండి ప్రస్తుత కలియుగ ప్రారంభము కాలమునుండి ఉన్నటు వంటి బ్రాహ్మణులు. పాండవులు మోక్షము పొందుటకు మహాప్రస్థానము నకు వెళ్లినప్పుడు వారి ముని మనుమడు అయిన జనమే జయుడు కేదారనాధ్ వచ్చి ఆలయనందు పూజాధికములు నిర్వర్తించు అధికారము ఈబ్రాహ్మణ కుటుంబీకు లకు ఇచ్చినట్లు ఈ ప్రాంత వాసులు తెలుపుతారు. ఈ ఆలయ పూజారులు గుప్తాక్షి నందు నివాసముండేదరు.
యాత్రికులు యాత్ర ప్రారంభమునకు ముందుగా 6 నెలలు ముందు నుండి రోజువారీ నడక అలవాటు చేసుకొనవలెను.
స్థానిక స్థల పురాణము ప్రకారము మహాభారత కాలమునందు పాండవులు తమ దాయాదులు కౌరవులను కురుక్షేత్ర సంగ్రామమునందు ఓడించి చంపినారు. పాండవులు యుద్ధము నందు చేసిన పాపములైన గోత్రీకుల హత్య మరియు గోహత్యల నుండి విముక్తులు కావలెనని తలంచి తమ రాజ్య భారమును తమ వంశీకులకు వప్పగించి శివుని వెదకి దీవెనలు పొందవలేనని వెతుకుచూ బయలుదేరినారు. వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్యక్షేత్రమును చేరగా శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామమునందు వారివలన కలిగిన ప్రాణనష్టమునకు కోపగించి వారిప్రార్ధనలను వినిపించు కోకుండా వారినుండి తప్పించు కొనవలెనని తలచి ఎద్దు (నంది) రూపముపొంది హిమాలయ ప్రాంతమునకు అద్దృశ్యమైనాడు.
వారణాశినందు శివుని కనుగొనలేక పాండవులు హిమాలయములకు వెళ్ళినారు. భీముడు రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా నంది రూపములో శివుడు గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించినాడు. భీముడు నంది తోకపట్టుకొని ఆపుటకు ప్రయత్నించగా ఆచటి నుండిఅదృశ్యమై తరువాతప్రత్యక్షమై అయిదుభాగములుగా విడిపోయినది. మూపుర భాగము కేదార్నాధ్, చేతులు తుంగనాధ్, బొడ్డు మరియు ఉదరభాగము మధ్య మహేశ్వర్, ముఖ భాగము రుద్రనాధ్ మరియు తల మరియు జుట్టు కల్పెశ్వర్ నందు పడినవి. పాండవులు శివుని కొలుచుటకు గాను ఈ అయిదు స్తలములలోనూ ఆలయములు నిర్మించి వారి పాపములనుండి విముక్తి పొందినారు. శివుని ముందు భాగము పడిన ప్రదేశమునందు నేపాల్ లోని ధోలేశ్వర్ ఆలయము ఉన్నది అని చెపుతారు. పాండవులు ఈ పంచకేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట కేదార్నాధ్ నందు తపస్సు చేసి యజ్ణము చేసి వారు స్వర్గలోకము పొందినారు.
కేదారనాధ్ (1వ కేదారి) కేదార్నాథ్ జ్యోతిర్లింగము పంచ కేదార్ లలో మొదటిది కేదార్క్షేత్రము. కేదార్నాధ్ యాత్ర చేయుటకుగాను రుద్రప్రయాగ అచ్చటినుండి యాత్ర కొన సాగించవలెను కేదార్నాధ్ యాత్రకుగాను రుద్రప్రయాగ నుండి గౌరీకుంద్ వరకు ఆగశ్యముని,గుప్తాక్షి, పాత, సీతాపూర్ మరియు సొనప్రయాగ (పంచ ప్రయాగల లోనిది కాదు) ద్వారా రోడ్డుమార్గముద్వారా టెంపోలో లేదా వేసవి కాలమైన బస్సులో చేరి ఆచటి నుండి 14 కి.మీ గుర్రముపై గాని, నడచిగాని, పల్లకీపై గాని కేదార్నాధ్ చేరవలయును. అట్లు ప్రయాణము చేయలేని వారు
గుప్తకాశి వరకు రోడ్డు ప్రయాణము చేసి అచట విశ్రమించి పాత హెలీపాడ్ నుండి హెలీకోప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళి రావచ్చును.
హేలీ కొప్టర్ సౌకర్యము ఉదయమునుండి సాయంత్రం వరకు మాత్రమే లభించును. సముద్ర మట్టమునకు సుమారు 12000 అడుగుల ఎత్తులో ఉన్న యీ పవిత్ర శైవ పుణ్య క్షేత్రము నందు ఆక్సిజన్ అందుట కొంచెము కస్టతరము. కావున హుద్రోగులు దర్శనము చేసుకొనుటకు వెల్లునప్పుడు ఆక్సిజన్ సిలిండరు అందుబాటులో నుంచుకొన వలయును. కేదార్నాథ్ యాత్ర పెద్దవారికి పుణ్యము చిన్నవారికి ఆహ్లాదకరము. మొత్తముపై అన్నీ వయస్సుల వారిని ఆకర్షింప చేసేది హిమాలయన్ యాత్ర. శాస్త్రవచనం ప్రకారం శ్రీహరియొక్క రెండు అంశలైన నర నారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరునిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరుమార్గమని ముని వాక్యం.
మధ్య మహేశ్వర్ (2వ కేదార్)
మధ్య మహేశ్వర్ పంచ కేదార్ లలో రెండవ ఆలయము. కేదారేశ్వర్ దర్శనము పిమ్మట తిరిగి కేదార్నాధ్ నుండి గౌరికుంద్ 14 కి.మీ. కాలినడక/పల్లకి/గుర్రముపై చేరి ఆచటినుండి 40 కి.మీ రోడ్డు మార్గము ద్వారా గుప్తకాశి ద్వారా కుండ్ చేరవరసి ఉంటుంది. కుండ్ నుండి ఉకీమఠ్ 6 కి.మీ. అచటినుండి మాంసునా, రాసు సరస్సు ఆచటి నుండి ఉనియన మొత్తము 16 కి.మీ. రోడ్డు ప్రయాణము చేయవలసి ఉంటుడి. ఉనియన ద్వారా రాంసి 4 కి.మే. రాన్సీ నుండి 16 లేదా 9 కి.మీ(అంచనా కరెక్టు గా నాకు తెలియదు) కాలినడకన ప్రయాణించి మద్య మహేశ్వర్ చేరుకోనవలసి ఉంటుంది. మధ్యమహేశ్వర్ నందు రాత్రికి బస చేయవలెను. మధ్య మహేశ్వర్ నందు మాత్రము బస చేయుటకు లభ్యతను బట్టి వసతి గృహము కేటాయించ బడును.
తుంగనాథ్ (3 వ కేదార్) పంచ కేదారాలలో మూడవ కేదార్ అని చెప్పబడే తుంగనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లా లో సుమారు ముప్పై ముప్పైయైదు కిమీ ల దూరంలో రుద్రప్రయాగ నుంచి అగస్త్యముని వెళ్ళేదారిలో ఓఖిమఠ్ కి సుమారు అయిదు కిమీ దూరంలో చోప్త అనే వూరు నుంచి కొండ యెక్క వలసి వుంటుంది . అతి యత్తైన పర్వతం పైన వున్న శివకోవెలగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినది యీ తుంగనాధ్ . సముద్ర మట్టానికి సుమారు 12500 అడుగుల ఎత్తులో వున్న చంద్రశిల అనే పర్వతం మీద వున్న కోవెల యిది . ఈకోవెల గోపురం కనీసం వెయ్యి సంవత్సరాలకు పూర్వం నిర్మించబడిందని పురావస్తు పరిశోధకులు నిర్దారించేరు. నంది రూపములో నున్న శివుని శరీరము భాగములై పడినప్పుడు చేతులు తుంగనాధ్ ప్రాతములో పడినట్లు స్థల పురాణము. చోప్త దగ్గరనుంచి కాలి నడక మొదలౌతుంది .
తుంగనాథ్ నుంచి చంద్రశిల శిఖరం రెండు కిమీ ల పైన వుంది . త్రేతాయుగం లో శ్రీరాముడు యీ చంద్రశిల శిఖరం పైన తపస్సు చేసినట్లుగా రామాయణంలో చెప్పబడింది . వొకటి రెండు రోజులు వుండడానికి వీలుగా చిన్న చిన్న రూములు కామన్ టాయిలెట్ లతో వున్న సామాన్య గదులు తక్కువ వెలలో లభిస్తాయి . ప్రొద్దున్న పది గంటలకు నడక ప్రారంభిస్తే తుంగనాధుని దర్శించుకొని భోజనం చేసుకొని సాయంత్రం నాలుగు అయిదు గంటలకి చోప్తా చేరుకోవచ్చు. యాత్రికులు ఉదయం వీలైతే సూర్యోదయానికి పూర్వం యాత్ర మొదలుపెట్టి సూర్యాస్తమయానికి ముందు లేక వెంటనే ప్రయాణం నిలిపివేస్తే చాలా ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడి వాతావరణం నమ్మలేని విధంగా మారుతూ వుంటుంది .
అంతలోనే వాన అంతలోనే యెండ .. తుంగనాధ్ మందిరం కేదార్నాద్ మందిరాన్ని పోలివుంటుంది . లోపల శివ లింగం శివ కుటుంబంతో పాటు పాండవుల విగ్రహాలను కుడా చూడొచ్చు కాశి నగరానికి చెందిన బ్రాహ్మణులు యిక్కడ నిత్య పుజాదులు నిర్వహిస్తున్నారు . ఆరునెలలనుంచి ఎనిమిది నెలలవరకు యీ కోవెల మూసివేస్తారు. చొప్టా నుండి సుమారు 4 కి.మీ. కాలినడకన ప్రయాణించి తుంగనాధ్ చేరుకోనవలయును.
రుద్రనాధ్ (4వ కేదార్) పంచ కేదార్ లలో నాలుగవ కేదార్ అనిపిలువబడు రుద్రనాధ్ ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతములో నున్న శివునికి చెందిన హిందూ దేవాలయము. సముద్ర మట్టమునకు సుమారు 11800 అడుగుల ఎత్తున ఉన్న సహజ సిద్దమైన రాతి నిర్మితమైన దేవాలయము. ఈ ఆలయము మరుగుజ్జు (ఎత్తు తక్కువ) గన్నేరుచెట్ల తోనూ పర్వత పచ్చిక బయళ్లతోనూ నిండిన దట్టమైన ఆటవీ ప్రాంతము నందు ఉన్నది. పంచ కేదార్ యాత్ర నందు రుద్రనాధ్ దేవాలయ సందర్శనమునకు ముందు కేదార్నాధ్, మధ్యమహేశ్వర్ మరియు తుంగనాధ్ దేవాలయములు సందర్శించవలెను. రుద్రనాధ్ పిమ్మట కల్పెశ్వర్ దర్శించుకొనవలయును. శివుని ముఖ భాగము ఇచట నీలకాంత్ మహదేవ్ పేరుతో కొలువబడుచున్నది. గోపేశ్వర్ నుండి 3 కి.మీ దూరములో కల సాగర్ గ్రామమునుండి పర్వతారోహణ (నడక) ప్రారంభము అవుతుంది. ఇదికాక గోపేశ్వర్ నుండి 12 కి.మీ. పర్వతారోహణ (నడక) మార్గము కలదు. ఈ మార్గము అనసూయాదేవి ఆలయము ద్వారా ఉంటుంది. ఈ పర్వతారోహణ మిక్కిలి కష్ట తరమైనది మరియు సుమారు 24 కి.మీ దూరము ఉంటుంది. మరియొక మార్గము చొప్తా నుండి 30 కి.మీ. వాహనము లోనూ 10 కి.మీ ట్రెక్ (నడక) ద్వారా 5 గం ప్రయాణించి పానర్గుఫా చేరవలయును. ఆచటినుండి 12 కి.మీ. 6 గంటలు ట్రెక్ (నడక) ద్వారా ప్రయాణించి రుద్రనాధ్ చేరవచ్చును. రుద్రనాధ్ నందు మరియు కల్పెశ్వర్ ఆలయము లందు ఆది శంకరాచార్యులచే నియమించ యాడిన దాసనమీ గోసన కులస్థులు పూజా కార్యక్రమములు నిర్వర్తించెదరు.
కల్పెశ్వర్ (5వ కేదార్) పంచ కేదార్ లలో అయిదవ కేదార్ కల్పెశ్వర్ ఉత్తరాఖండ్ నందు హిమాలయములలో గారెవాల్ ప్రాంతములో సుందరమైన ఉర్గంలోయ ప్రాంతములో ఉన్నది. పంచ కేదార్ యాత్ర నందు ముందు కేదార్నాధ్, మధ్యమహేశ్వర్, తుంగనాధ్ మరియు రుద్రనాధ్ దేవాలయములు సందర్శించవలెను. రుద్రనాధ్ పిమ్మట కల్పెశ్వర్ దర్శించుకొన వలయును. రుద్రనాధ్ దర్శనము పిమ్మట తిరిగి 23 కి.మీ చామోలి నుండి హెల్లాంగ్ మీదుగా 22 కి.మీ ప్రయాణించి దేవగ్రామ్ చేరి ఆచటి నుండి ప్రయాణించి కల్పెశ్వర్ చేరవచ్చును. . శివుని జటాఝూటము ఇచట శివభగవానునిగా కొలువబడు చున్నాడు. కల్పెశ్వర్ సముద్ర మట్టమునకు 7200 అడుగుల ఎత్తులో నున్నది.
ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు..నేను రెండు కేధారులు చూసాను..కేధర్నాథ్ మరియు కల్పేశ్వర్ ..
- శ్రీనివాస్ గుప్తా వనమా