Online Puja Services

కుమారస్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు!

3.144.48.13
దక్షిణభారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతాఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్నా, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్నా... ఆ షణ్ముఖునికే చెల్లింది.
 
విజయాలకు – కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే! రెల్లుగడ్డిని ‘శరం’ అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ ‘శరం’ అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలకు నాయకునిగా, ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టులావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే... ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట!
 
సంతానానికి - ఈ సృష్టిలో పార్వతీపరమేశ్వరులని ఆదిదంపతులకి చిహ్నంగా పేర్కొంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక!
 
జ్ఞానానికి – సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుందట! పరమేశ్వరుని దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం కద్దు. ఈ శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తుంటారు.
 
ఆధ్మాత్మిక ఉన్నతికి – శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడిందనీ, అది ఆరుభాగాలుగా మారిందనీ.. కుమారస్వామి జననం గురించి చెబుతుంటారు. ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారట. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని పేర్కొంటారు. అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతుంటారు. ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచన. పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు కనిపిస్తాయి. ఇలా రెండు త్రికోణాలు కలిసిన షట్కోణం గుర్తుని హిందువులతో పాటుగా క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కూడా పవిత్ర చిహ్నంగా భావిస్తుంటారు. ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని భావించవచ్చు!
 
యోగసాధనకు – కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్రపు అంతిమలక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు!
 
జాతక దోషనివారణకు – వివాహం, సంసారం, సంతానం... వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట! ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహజీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. సుబ్రమ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే... ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నమ్మిక!
 
- రాజారెడ్డి వేడిచర్ల 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba