దృఢమైన వంతెన - దారిమార్చుకున్న నది
ఆశ్చర్యం
*ఓ దృఢమైన వంతెన*…
*దారి మార్చుకున్న నది*…
*కొత్త పాఠం*…
…. *ఈ ఫోటో* జాగ్రత్తగా చూడండి… లాంగ్ షాట్… అన్నీ స్పష్టంగా అర్థమయ్యేలా…
ఇందులో ఒక బ్రిడ్జి ఉంది… దాని పక్కన ప్రవాహం ఉంది… బ్రిడ్జికి ఇరువైపులా దాన్ని కనెక్ట్ చేసే రోడ్లు కూడా లేవు… అదేమిటి..? ఇండియన్ కంట్రాక్టర్ అయి ఉంటాడు, అందులోనూ పొలిటికల్ వాసనలున్నవాడు అయి ఉంటాడు, అందుకే సగం కట్టేసి, డబ్బులు డ్రా చేసి, చేతులు దులుపుకుని ఉంటాడు అనేదేనా మీ డౌట్… అఫ్ కోర్స్, మనవాళ్లు అలాంటోళ్లే కానీ ఇక్కడ అది కాదు కేసు… *కథ వేరే ఉంది, చదవండి*…
దీన్ని చొలుటెకా బ్రిడ్జి అంటారు… ఇది 484 మీటర్ల బ్రిడ్జి… అంటే అర కిలోమీటర్… దక్షిణ అమెరికాలో హండురాస్‌లో ఉన్నది ఇది… భారీ తుపాన్లకు, కుండపోతలకు పెట్టింది పేరు ఆ దేశం… అంటే ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరస్టులు అన్నమాట… 1996లో చొలుటేకా నది మీద, ఓ అవసరమైన ప్రాంతంలో వంతెన కట్టాలని నిర్ణయించారు… ఎలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తినా తట్టుకునేలా దృఢంగా, నాణ్యంగా కట్టాలని టెండర్లు వేసిన కంట్రాక్టర్లకు గట్టిగా చెప్పారు…
జపాన్‌కు చెందిన ఓ కంపెనీ అత్యుత్తమ నాణ్యతతో కడతానని ముందుకొచ్చింది… చెప్పినట్టుగానే ఓ సాలిడ్ బ్రిడ్జి కట్టి ఇచ్చింది… ఏమాత్రం వంక పెట్టలేని రీతిలో… 1998లో జాతికి అంకితం చేశారు… *కానీ కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది*…
అదే సంవత్సరం ఓ భారీ తుపాన్ ముంచుకొచ్చింది… నాలుగు రోజుల్లో 75 ఇంచుల వర్షం… అంటే కుండపోతకన్నా చాలా ఎక్కువ… మేఘాలు భళ్లున బద్దలై నీళ్లు గుమ్మరించినట్టు అంటే సరిపోతుందేమో… సాధారణంగా అక్కడ ఆరునెలల్లో నమోదయ్యే వర్షపాతం నాలుగు రోజుల్లో కుమ్మేసింది… ఎటు చూసినా వరదనీరే… 7 వేల మంది మరణించారు… లక్షల మంది నిరాశ్రయులు… ఎటుచూసినా నీళ్లు, కన్నీళ్లు… *అన్నీ దెబ్బతిన్నాయి… ఈ బ్రిడ్జి తప్ప…*
కానీ సమస్య ఏమిటంటే… బ్రిడ్జి బాగుంది, దృఢంగా నిలబడింది… కానీ అటూఇటూ కనెక్ట్ చేసే రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి… అసలు అంతకుముందు కూడా లేవేమో అన్నట్టుగా… ఆ *భారీ వరదనీటితో ఆ నది కూడా ఇష్టారీతిన పొంగి, ప్రవహించి, చివరకు తన దిశను కూడా మార్చుకుంది* … దాంతో బ్రిడ్జి కింద నుంచి గాకుండా, బ్రిడ్జి పక్క నుంచి పారుతోంది ఇప్పుడు… *మరి ఈ బ్రిడ్జిని ఏం చేసుకోవాలి..?*
బిజినెస్ వరల్డ్‌లో ప్రచురితమైన *ఈ కథ ఇప్పుడు* పలు సైట్లలో, వ్యక్తిత్వ వికాస పాఠాల్లో, క్లాసురూముల్లో, బిజినెస్ మీటింగుల్లో *చర్చనీయాంశం అవుతోంది* … ఏమనీ..? ఒకే ప్రొఫెషన్ మీద డిపెండ్ అవుతాం, అందులోనే మెరుగులు దిద్దుకుంటాం, అలాగే *ఒకే వ్యాపారం మీద సర్వశక్తులూ ఒడ్డుతాం, విస్తరిస్తాం… మరి ఈ బ్రిడ్జిలాగే మారిపోతే… పరిస్థితులు మారిపోతే…?*
ఇప్పుడు కరోనా లేవనెత్తే ప్రధాన ప్రశ్న కూడా అదే… కొలువులు పోతున్నయ్… వ్యాపారలు దెబ్బతింటున్నయ్… ఎప్పుడు కోలుకుంటామో ఎవరికీ తెలియదు… *మనం పూర్తిగా డిపెండైన రంగం మునిగిపోతే, రేప్పొద్దున మన పరిస్థితి ఏమిటి…?* ఇప్పుడు అందరూ ఏ రంగమూ బాగాలేదని, సేఫ్ సైడ్ అన్నట్టుగా బంగారం కొంటున్నారు… ఏడాదిలో దాని ధర 30 వేల నుంచి ఇప్పుడు 52 వేలకు వచ్చింది, 70 వేలు దాటుతుందీ అంటున్నారు… కానీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడినా ఆ ధరలు ధడేల్ అని పడిపోతాయి… సేమ్, ఇలాగే…
*పూర్తిగా ఒకే విషయం మీద ఆధారపడటం కరెక్టేనా..? అనుకోని అవాంతరాలు వచ్చి, అది పనికిరాకపోతే ఎలా..?* అవాంఛనీయ, నష్టదాయక మార్పుకు తగినట్టుగా వెంటనే మనం మారిపోవడం ఎలా..? సేఫ్ ప్రత్యామ్నాయం ఏమిటి..? ఇవీ ఆలోచించడం ఇప్పుడు అవసరం అంటున్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు…
*ఒక సమస్యకు పరిష్కారాలు బోలెడు… కానీ సమస్యే మారిపోతే ఎలా..?* అంటే… మనం బ్రిడ్జిని దృఢంగా, నాణ్యంగా, పకడ్బందీగా కట్టి, దాని గురించే ఆలోచించాం, కానీ అసలు నదీప్రవాహమే దారిమళ్లింది, బ్రిడ్జి ఎంత బాగుంటేనేం..? యూజ్‌లెస్ అయిపోయింది… మరేం చేయాలి..? అందుకే ఈ బ్రిడ్జి మీమీ వ్యాపార సంస్థల్లో వేలాడదీసుకుని, *ఎప్పుడూ ఓ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి పెట్టుకోవడం బెటర్ అంటున్నారు*…
అఫ్ కోర్స్, ఉన్నదాన్ని ఇగ్నోర్ చేసి కాదు…!!
*Built to Last మాత్రమే కాదు*…
*Build to Adapt కొత్త మంత్రం*…
*కాలం మారేకొద్దీ పాఠాలూ మారిపోవాలి, పోతున్నయ్… కరోనా చాలా కొత్త పాఠాల్ని నేర్పిస్తుంది కదూ.
-
సూర్యప్రకాష్ సాధనాల