తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలు
20 - 11 - 2020 నుండి డిసెంబర్ 1 - 2020 వరకు తుంగభద్ర పుష్కరాలు తుంగభద్రా నదీతీరంలో విశేష ఆలయాలు ఏవి?_
పన్నెండేళ్ళకోసారి వచ్చేది పుష్కరం. పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2008 లో ఈ నదికి పుష్కరాలు జరిగాయి. మళ్ళీ 12 ఏళ్ళతర్వాత 2020 నవంబరు 20 నుంచి డిసెంబరు ఒకటి వరకూ తుంగభద్రమ్మకు పుష్కరాలు జరుగనున్నాయి.
తుంగభద్రమ్మ నడక ఇలా
కర్నాటక ఎగువ భాగాన తుంగ , భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. రాష్ట్రంలో కౌతాళం మండలం మేళగనూరు వద్ద కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. నదీ తీరంలో కొలువుదీరిన దేవతలను తాకుతూ సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. 2008లో తుంగభద్ర నదికి పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం నిండుగా ఉంది. కౌతాళం , కొసిగి , మంత్రాలయం , నందవరం , సి.బెళగళ్ , గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతంఉంది.
పుష్కరాలు ఎప్పుడు వస్తాయి?
ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. అందుకే 12 నదులను పుష్కర నదులని , 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు. నవగ్రహాల్లో ఒకటైన గురుగ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో తిరుగుతూ ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాలు 27 , తొమ్మిది పాదాలు కలిసి ఒక రాశి ఏర్పడతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో బ్రహ్మ , బృహస్పతి , పుష్కరుడు , నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుంది.
ప్రత్యేకత గల ఆలయాలు
కర్నూలు జిల్లాలో తుంగభద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకి వస్తుంది. స్వామి ఆలయం నదీతీరంలో ఉంది. కోసిగిలో ఆర్డీఎస్ ఆనకట్ట , అనంతరం మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం , మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయం ఉంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ , దిగువన గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది. నాగులదిన్నె సమీపంలో సాయిబాబా దేవాలయం ఉంది. తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి చేరుకుని పుణ్యస్నానాలు చేస్తారు. సి.బెళగల్ మండలం సంగాల వద్ద ఈశ్వరాలయం ప్రసిద్ధి.