Online Puja Services

పగిలిన పెదవులు

18.116.85.79

వేద స్వరూపమైన పరమాచార్య స్వామివారు వేదాంత సారమైన అద్వైతాన్ని లీలగా ప్రదర్శించిన వేళ.

చాలా సంవత్సరాల క్రితం శీతాకాలంలో తీవ్రమైన చలి వల్ల పరమాచార్య స్వామివారి పెదవులు ఎండిపోయి, పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. శ్రీవారు మాట్లాడితే ఆ పగుళ్ళ వల్ల చాలా బాధ కలిగేది. కానీ, ఆ దయామయుడు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడి వారిని అనుగ్రహించేవారు.

చలికాలంలో పెదవులు ఎండిపోయి పగుళ్ళు ఏర్పడినప్పుడు, పెదవులకు వెన్న రాయడం వల్ల అవి తగ్గి ఉపశమనం కలిగిస్తుంది. మరలా పెదవులు కోమలంగా అవుతాయి. తరతరాలుగా మనవాళ్ళు పాటిస్తున్నది ఇదే.

కాని సాంప్రదాయం పాటించే స్వామివారు బయట అంగళ్ళలో అమ్మే వెన్నను వాడారు, దాన్ని పెదవులకు పూసుకోరు. మరి ఏమి చెయ్యాలి?
ఒక ముసలావిడ దీన్ని గ్రహించి ఐదు శేర్ల ఆవుపాలు తీసుకుని, వాటిని మరిగించి, మజ్జిగ చేసి బాగా చిలికి వెన్నను తీసింది. దాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి, “పెరియవ పెదవులు పగిలి ఇబ్బంది పెడుతున్నాయి. నిష్ఠతో మడిగా పాలు చిలికి ఈ వెన్నను తీసాను. పెరియవ పెదవులకు ఈ వెన్న పూసుకోవలసింది” అని ప్రార్థించింది.

మహాస్వామివారు ఆ వెన్నను ఒకసారి చూసారు. బహుశా వారికి ద్వాపర యుగపు సంఘటనలు గుర్తుకు వచ్చాయి ఏమో, చూడగానే చిన్నగా నవ్వారు.

ఆ వెన్నని కేవలం పరమాచార్య స్వామివారి కళ్ళే కాదు మరో రెండు కళ్ళు కూడా అంతే అమితానందాలతో చూస్తున్నాయి. అప్పుడు బహుశా స్వామివారి దర్శనానికి వచ్చిన ఒక బాలుడు ఆత్రుతగా స్వామివద్దకు వచ్చి వెన్న కావలన్నట్టుగా తన చిన్ని చేయి చాచాడు. బాలగోపాలుడే అక్కడకు వచ్చి వెన్న కావాలని అడుగుతున్నాడేమో.

అడగకుండానే మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన కరుణాసముద్రులైన మహాస్వామివారు వెంటనే ఆ వెన్న జాడిని ఆ బాలునికి ఇచ్చేశారు. ఇది చూసిన అక్కడివారందరూ కాస్త ఖేద పడ్డారు. “ఎంత పిల్లాడే అడిగినా నిమ్మపండంత వెన్నను ఇచ్చుంటే సరిపోయేది కదా మొత్తం వెన్నను ఇచ్చేయ్యకుండా” అని అనుకున్నారు.

వారి ఆఅలోచనల్ని పసిగట్టిన మహాస్వామివారు అక్కడున్న వారితో, “ఎందుకు అందరూ అంత చింతిస్తున్నారు? ఆ వెన్నను ఆ బాలుడు తింటే నా పెదవులు సరిపోతాయి. దిగులు పడకండి” అన్నారు. ఆ సాయంత్రానికే స్వామివారి పెదవుల పగుళ్ళు నయమై మునుపటి వలె అయ్యాయి. బహుశా బాలగోపాలుడు ఆ వెన్నాను తినేశాడేమో.

శరీరములు వేరైనా ఆత్మా ఒక్కటే కదా. అదే కదా అద్వైతం.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya