అమ్మవారు తెల్లగా ఉండటం ఏమిటి...!?
శ్రీ దుర్గా మాత యొక్క స్వరూపముగా వాగ్భవకూట సాత్త్విక ధ్యాన ఫలమే సారస్వత యోగం.
శంకరులు, "సౌందర్యలహరి" లోని 15వ శ్లోకాన్ని, ఈ విషయాన్నే తెలియచేస్తూ, ఇలా రచించారు,
శరజ్జ్యోత్స్నాశుద్ధాం - శశియుతజటాజూటమకుటాం
వరత్రాసతాణ - స్ఫటికఘటికా పుస్తకకరాం
సకృన్నత్వా న త్వా - కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీరద్రాక్షా - మధురిమధురీణాః ఫణితయః
శరజ్జ్యోత్స్నాశుద్ధాం ( శరజ్జ్యోత్స్నాశుభ్రాం అనే పాఠాంతరము ఉంది)
శరత్కాలం వెన్నెల ఎలా ఉంటుంది...!?
అమ్మవారి యొక్క శరీర కాంతులు శరత్కాల చంద్రుడు కురిపించే వెన్నెలలాగా ఉన్నాయిట. అనగా తెల్లగా మరియు చల్లగా.
అమ్మవారు తెల్లగా ఉండటం ఏమిటి...!?
అమ్మవారు "అరుణాం కరుణాతరంగితాక్షీం"అన్నారు కదా. అనగా అరుణ వర్ణము కదా అమ్మవారిది. శంకరులు కాదనలేదు.
"వర్ణము" అనే శబ్దానికి రెండు అర్థములు ఉన్నాయి. ఒకటి అక్షరము,రెండవది రంగు.
సర్వమాతృకా వర్ణరూపిణి అమ్మవారే అయినప్పుడు, ఏ అక్షరం అమ్మవారిది కాదు...!? మరియూ ఏ వర్ణము అమ్మవారిది కాదు...!? ప్రతి అక్షరానికి ఒక వర్ణము (రంగు) కూడా ఉంటుంది. దానిని ద్రష్టలు దర్శించగలరు, మనము దర్శించలేము.
అయితే మనం ఇక్కడ సారస్వత యోగంలో అమ్మవారి యొక్క తెల్లని వర్ణమునే తీసుకోవాలి.
శశియుతజటాజూటమకుటాం అనగా, అమ్మవారి యొక్క జడముడిలో చంద్రరేఖ ఉన్నది. అమ్మవారి యొక్క చంద్రరేఖతో వెలుగొందుతున్న జటాజూటమే అమ్మవారికి కిరీటములాగా ఉన్నది.
ఆ జటాజూట ధ్యానం వల్లనే, చంద్రరేఖ వంటి సుకుమార భావములతోటి, జటాజూటము వంటి కఠిన పదభందాలతోటి, కవిత్వము చెప్పగలిగిన కవులు అవుతారు.
వరత్రాసతాణ ,స్ఫటికఘటికా పుస్తకకరాం అనగా,
శ్రీ మాత మనకు వరదాభయములేకాక, తపస్సిద్ధిని మరియూ సకల విద్యలను అనుగ్రహిస్తుంది అని, అమ్మవారు ధరించిన జపమాల మరియు పుస్తకము చెబుతున్నాయి. అమ్మవారు తన నాలుగు చేతులతో, నాలుగు పురుషార్థములను ప్రసాదిస్తాను అన్న సంకేతములు చెబుతున్నారు.
సకృన్నత్వా న త్వా , కథమివ సతాం సన్నిదధతే అనగా, పైన చెప్పిన విధంగా అమ్మవారి యొక్క వాగ్భవ కూటమును ధ్యానించిన వారి యొక్క వాక్కులు, తేనెలా, పాలలా మరియూ ద్రాక్షరసములా, మధురంగా ఉంటాయి.
అమ్మవారిని ధ్యానించకుండా ఏ విద్య అయినా ఎలా వస్తుంది..!? (సకృన్నత్వా న త్వా - కథమివ సతాం సన్నిదధతే)
కూటము అనగా సమూహము.
వాగ్దేవతలు శ్రీ లలితా సహస్రనామములో, ఎన్ని కూటములు చెప్పారు...!?
వాగ్భవ కూటము, మధ్య కూటము, మరియూ శక్తి కూటము.
వాగ్భవ కూటము వల్లనే కదా వాక్కులు.
కానీ, వాక్వైభవం..!?
మూడు వేదముల యొక్క మొదటి అక్షరములను సంపుటీకరించటం వలనే,వాగ్భీజం అయినటువంటి "ఐం" ఏర్పడినది.
శ్రీ దుర్గా నవార్ణ మంత్రము నందు మరియు శ్రీ బాలా మంత్రమునందు మొదటి బీజము అయిన "ఐం" సకల విద్యా స్వరూపము.
రూపమును మరియు నామమును చూసి మోసపోకూడదు.
శ్రీ బాలయే శ్రీ మహా సరస్వతీ. శ్రీ బాల అన్న నామమునుబట్టి, చిన్నపిల్ల స్వరూపమైనటువంటి ఆమె రూపమును బట్టి, శ్రీ బాలా అమ్మవారిని చిన్నపిల్ల అనుకుంటే మనం అమ్మవారి మాయలో పడినట్లే.
శ్రీ బాలయే శ్రీదుర్గ. ఆ తల్లి యొక్క వాగ్భవ కూటమును ( అనగా ముఖ స్వరూపమును) శ్వేతవర్ణగా ధ్యానిస్తే, మనకు సరస్వతీ యోగము కలుగుతుందని శంకరులు ఈ శ్లోకము ద్వారా చెప్పిన రహస్యం.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే