Online Puja Services

సంపాదన కోసం ఉండవలసిన లక్షణాలు

18.220.242.160

సంపదను ఆకర్షించేవారి లక్షణాలు

‘‘మీ కలలను నిజం చేసుకోవడానికి మీరే ప్రయత్నించండి. అలా ప్రయత్నం చేయకపోతే మరెవరో తమ కలలను నిజం చేసుకోవడానికి మిమ్ములను ఉపయోగించుకుంటారు’’ ధీరూబాయ్ అంబానీ చెప్పిన మాట ఇది. అంటే దీని అర్థం మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. జీవితంలో ఎదడగానికి మీకు మీరే యజమానిగా ఉండాలి. అలా కాకుండా ఒక ఉద్యోగిగా జీవితం మిగిలిపోతే యజమానిని సంపన్నుడిగా మార్చడానికి మన కలలు ఉపయోగపడతాయి కానీ మనకు మనం ఎదగడానికి ఉపయోగపడదు. జీవితంలో మనం ఆశించిన స్థాయికి ఎదగాలి అంటే కష్టమైనా సరే సొంత మార్గం ఉండాలి. చాలా మంది సంపన్నులను గమనిస్తే ఈ లక్షణాలే వారిని జీవితంలో ముందుకు తీసుకు వెళతాయి.

*ఒక చిన్న ఉద్యోగి కావచ్చు, చిన్న వ్యాపారం, వృత్తి ఏదైనా కావచ్చు. చిన్న స్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న పలువురిలో కామన్ లక్షణాలు కొన్ని గమనించారు. అవి జీవితంలో ఎదగాలి అనుకున్న అందరికీ ఉపయోగపడవచ్చు. ఇలాంటి లక్షణాలే సామాన్యులను సైతం సంపన్నులుగా మారుస్తాయి. దీనికి వ్యతిరేక దిశలో ఉండే లక్షణాలు సంపన్నులను సైతం సామాన్యులుగా మార్చేస్తాయి. మా జీవితం ఇంతే ... కష్టాల్లో పుట్టాం... కష్టాల్లో పెరిగాం, కష్టాలతోనే జీవితం ముగిస్తాం అనే నిరాశ పూరిత ఆలోచనలు వద్దు. ఆలోచనలు మార్చుకుంటే అవకాశాలు లభిస్తాయి. దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు మనల్ని అభివృద్ధి దిశ వైపు తీసుకు వెళ్లే విధంగా ఉండాలి. సంపన్నులు ప్రత్యేకంగా జన్మించరు. అందరిలానే జన్మిస్తారు. వారి ఆలోచనలే వారిని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాయి. సామాన్యులుగా సాధారణ కుటుంబాల్లో పుట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయరహస్యాలు, వారి ఆలోచనలు తెలుసుకుందాం. మంచి ఉంటే ఆచరిద్దాం.

* జీవితంలో విజయం సాధించిన వారు, చిన్న స్థాయిలో జీవితాన్ని ప్రారంభించి సంపన్నులు అయినా వారందరిలో కనిపించే కామన్ లక్షణం పనిని వాయిదా వేయకపోవడం. మంచి పని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచింది. మంచి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎప్పటి పని అప్పుడు చేయడానికి మించిన ముహూర్తం ఉండదు. పనిలోనే విశ్రాంతి పొందడం వీరి లక్షణం. ఒక పని వాయిదా వేయడం వల్ల కలిగే సంతృప్తి కన్నా అనుకున్న సమయానికి పూర్తి చేసిన తరువాత కలిగే సంతృప్తి ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. పని వాయిదా వేయడానికి అనేక కారణాలు కంటి ముందు కనిపించవచ్చు. కానీ పూర్తి చేయాలి అనే నిర్ణయానికి వచ్చినప్పుడు ఒక్క సాకు కూడా కనిపించదు. వాయిదాలు వేయడం అలవాటు అయితే జీవితంలో ఎప్పటికీ చేయాలనుకున్నవి చేయలేరు. వ్యాపారమో, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే తక్షణం పని ప్రారంభించాలి. ఎదురు చూస్తూ పోతే అవకాశం చేజారి పోవచ్చు.

* ఆదాయం ఏదో ఒక చోటు నుంచే కాకుండా ఒకటికన్నా ఎక్కువ చోట్ల నుంచి రావాలి. సంపన్నులకు ఒక వ్యాపారం నుంచే కాకుండా అనేక వ్యాపారాల నుంచి ఆదాయం వస్తుంటుంది. ఒకే ఆదాయం ప్రమాదకరం. ఇనె్వస్ట్ చేసేవారు సైతం ఒకే కంపెనీలో కాకుండా విభిన్న కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు.

* అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఏ వ్యక్తి కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కాడు. ధీరూబాయ్ అంబానీ కుటుంబం ఈ రోజు దేశంలో కెల్లా సంపన్నులు. కానీ అంబానీ ఎంతో శ్రమ కోర్చి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. దుబాయ్‌లో చిన్న ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఖర్చులు తగ్గించుకుని మిగులను ఇనె్వస్ట్ చేయడం వల్లనే ఆ స్థాయికి చేరుకున్నారు. అనవసర ఖర్చులు పెట్టి ఉంటే కోట్లాది మంది సామాన్యుల్లో అంబానీ ఒకరిగా మిగిలిపోయి ఉండేవారు. కూడ బెట్టిన ఒక్కో రూపాయే కొంత కాలానికి పెద్ద మొత్తం అవుతుంది, ఒక్కో నీటి చుక్కనే సముద్రంగా మారినట్టు.

* సమయానికి తగ్గట్టు తమ కూడా మారడం స్వయం కృషితో ఎదిగిన సంపన్నుల్లో కామన్‌గా కనిపించిన లక్షణం. వ్యాపారంలో, జీవితంలో ఆలోచనల్లో ఎప్పటికప్పుడు మార్పుకు స్వాగతం పలకాలి.

* ఇతరులను అనుసరించాల్సిన అవసరం లేదు. మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. కానీ ఒకరిని అనుసరించి వారిలానే చేయాలని ప్రయత్నించవద్దు.

* మీకు మీరే యజమానిగా మారే అవకాశాలను వెతకండి. యజమానులే సంపన్నుడిగా మారగలడు. ఉద్యోగి శ్రమ ఎప్పుడూ యజమానిని సంపన్నుడిగా మార్చడానికి ఉపయోపడుతుంది.

* ఉద్యోగం చేస్తూ ఎదగడానికి ప్రయత్నించవచ్చు. ధీరూబాయ్ జీవితం కూడా అంతే. ఉద్యోగం చేయడం తప్పు అని కాదు. ఉద్యోగంలో ఉన్నా మనసులో ఒక ప్రణాళిక ఉంటే అవకాశం కోసం ప్రయత్నించాలి. సరైన ప్రణాళికతో స్థిరపడగలను అనే నమ్మకం ఏర్పడితే ముందడుగు వేయవచ్చు.

* ఉద్యోగంతో రిస్క్ లేకుండా గడిచిపోతూ ఉండొచ్చు. కానీ ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేస్తూనే ఇన్వస్ట్మెంట్ ద్వారా తమ జీవితాలను మెరుగు పరుచుకున్న వారు ఎందరో ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా అంత కన్నా ఎదుగుదల కోసం ఉన్న అవకాశాలపై దృష్టిసారించాలి.

* మన ఖర్చుపై మనకు అదుపు ఉండాలి.

* మన ఖర్చు, ఆదాయం కాగితంపై రాసుకుంటే... వృథా ఖర్చు ఎక్కడో తెలుస్తుంది. ఉద్యోగం చేస్తున్నా వృధా ఖర్చు తగ్గించుకుని అలా తగ్గించుకోవడం ద్వారా ఆదా చేసిన డబ్బును ఇన్వస్ట్ చేయడం ఒక వ్యాపకంగా మారితే... కొంత కాలానికి ఆ మార్పు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు.

* స్వయంకృషితో సంపన్నులు అయిన వారిని చూసి ఏదో తప్పు చేసి ఎదిగారు అని ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు. అలా ఎదిగిన వారందరిలో కనిపించే సహజ లక్షణాలు, అలవాట్లు ఏమిటో గ్రహించి అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి.

-బి. మురళి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore