Online Puja Services

వేల్పూరు మౌన రమణ స్వామి

3.12.153.95
వేల్పూరు మౌన స్వామి
వేల్పూరు మౌన రమణ స్వామి
 
భగవాన్ రమణుల భాష మౌనం. ఒకసారి ఆల్ ఇండియా రేడియో వారు భగవాన్ మాటలు రికార్డు చెయ్యటానికి వస్తాము అన్నారని ఒక గాలి వార్త ఆశ్రమం లో వచ్చింది .అప్పుడు భగవాన్ నవ్వుతూ " ఓహో ! అట్లాగా నా మాట మౌనమే కదా . యెట్లా రికార్డు చేస్తారు ,వున్నది మౌనమాయె దాని రికార్డు చెయ్యటం ఎవరి తరం " అన్నారు . ఈ విషయాన్ని సూరి నాగమ్మ గారు శ్రీ రమణాశ్రమ లేఖలు (శ్రీ రమణాశ్రమ లేఖలు-మౌనముద్ర) లో చాల అద్భుతము గా వర్ణించారు .
భగవాన్ ఉపదేశం కూడా మౌనవాక్యమే ఎందుకంటే అయన అపర దక్షిణ మూర్తి కదా .
మరి భగవాన్ ఉపదేశము అయిన మౌనం మరియు నిరాడంబరత్వాన్ని ఆచరిస్తున్న మహా మౌనయోగి ఇక్కడే మన మధ్యనే ఆంధ్రప్రదేశ్ లోనే వున్నారు . రమణతత్వము లో పూర్తిగా మునిగి భగవాన్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మనలాంటి వారికీ మార్గం చూపే మహానుభావుడు వేల్పూరు రమణ స్వామి.
రమణ మార్గమే తన మార్గంగా చేసుకొని భగవాన్ కి సంబదించిన ఎన్నో పుస్తకాలను తెలుగు లో ప్రింట్ చేయించి రమణ భక్తులకు ప్రసాదము గా ఇచ్ఛే మౌన స్వామి గురించి ఆయన ఆశ్రమం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మీతో పంచుకుంటాను .
వేల్పూరు మౌన స్వామి ఆంధ్రప్రదేశ్ ,పశ్చిమ గోదావరి జిల్లా ,తణుకు కి సుమారుగా 8Km దూరంగా వేల్పూరు లో వుంటారు .స్వామి బాల రమణ స్వామి గా మరియు ఆశ్రమము శ్రీ రమణ నిలయ ఆశ్రమము గా అక్కడ అందరికి బాగా సుపరిచితం.
 
స్వామి మౌన స్వామి కదా భక్తుల సందేహాలకి సమాధానం పలక మీద వ్రాసి ఇస్తారు. స్వామి ని దర్శించిన వారికీ ప్రసాదం గా భగవాన్ పుస్తకము మరియు చాకోలెట్స్ ఇస్తారు. కానీ ప్రశ్నలు మాత్రమూ ఆధ్యాత్మిక సంబధమైనవి మాత్రమే అడగాలి .
స్వామి దిన చర్య ఉదయం రెండు గంటలకి ప్రారంభమవుతుంది .స్వామి ఉదయం రెండుగంటలకే లేచి ధ్యాన మందిరం కి వచ్చి ధ్యానం లో మునిగిపోతారు .స్వామి తో పాటు వుండే ఆశ్రమ వాసులు కూడా లేచి ధ్యానం చేస్తుంటారు .ఉదయం నాలుగు ఐదు గంటల మధ్య ఆశ్రమవాసులు ధ్యానం నుండి లేచి గోశాల కి సంబదించిన పనులు మరియు ఆశ్రమ వాసులకి , అతిదులకి టీ మరియు అల్పాహారం తయారు చెయ్యటానికి ఉపక్రమిస్తారు . స్వామి మాత్రం ఈ ప్రపంచము తో సంబంధం లేకుండ ధ్యానంలో మునిగివుంటారు . అ సమయం లో అక్కడ ఎలాంటి వారికైనా ధ్యానం అద్భుతం కుదురుతుంది .స్వామి సమక్షం లో మనస్సు శూన్యము అయి మనం కూడా ఆ ధ్యానం లో మునిగిపోవటం తథ్యం.
 
ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్యన సీతమ్మ అనే అవ్వ హారతి ఇచ్చి ఇంకా స్వామి ని కొబ్బరి నూని మరియు కర్పూరము తో రుద్ది ధ్యానం నుండి భౌతిక స్థితి కి తీసుకు వస్తారు .సీతమ్మఅవ్వ గత ముప్పై సంవత్సరాల గా స్వామి ని సేవించుకుంటున్నారు.
స్వామి పదకొండు గంటల నుండి భక్తులను మరియు సందర్శకులు అడిగే ప్రశ్నలకు సమాదానాలు పలక మీద వ్రాసి ఇస్తారు .వచ్చిన వారికి ప్రసాదంగా స్వామి స్వయం గా ప్రింట్ చేయించిన పుస్తకాలూ ఇస్తారు .స్వామి మోము ఎల్లవేళలా ప్రశాంతముగా చేరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది .వచ్చిన వాళ్ళు పిల్లలు అయితే స్వామి మోము మహా సంతోషం తో వెలిగిపోతూ వాళ్ళని నవ్వుతోనే పలకిరించి వారికి ఇష్టమైన చాకోలెట్స్ చేతి నిండుగా తీసి ప్రసాదం గా ఇస్తారు .
మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటిగంట మధ్యలో స్వామి సుఖాసనమ్ నుండి లేచి భోజనము చేస్తారు .భగవాన్ ఏ విధముగా అయితే భోజనం లో అన్ని కలిపి ఒక ముద్దగా చేసుకుని తినేవారో అదేవిధముగా స్వామి కూడా అన్నము,రసం,చపాతీ మజ్జిగ అన్ని కలిపి ముద్దలా చేసి మధ్యాహన భోజనం ముగిస్తారు . కొంచెం విరామము తరువాత స్వామి అక్కడ వుండే పొలం లో పని చేస్తారు లేదా అక్కడ జరిగే నిర్మాణ పనుల లో కానీ గోశాల లో వుండే ఆవులకు గడ్డి కోయటం లాంటి పనులు చేస్తారు.
 
సాయంత్రము ఆరు ఏడూ గంటల మధ్య కాలంలో ఆశ్రమ వాసులు మరియు అతిధులు అందరు రాత్రి భోజనం ముగించి పుస్తక ప్రింటింగ్ మరియు బైండింగు మొదలైన పనులు రాత్రి తొమ్మిది వరకు చేస్తారు. ఆ తరువాత కొంత సేపు ధ్యానం చేసి ఆ రోజు ముగిస్తారు .మరల ఉదయం రెండుగంటలికి లేచి సన్నపానాదులు ముగుంచి స్వామి మరియు ఆశ్రమవాసులు ధ్యానం లో కూర్చుంటారు .
 
ఆశ్రమ దర్శనానికి ఎటువంటి బేధాలు లేవు ఎవరన్నా ఎప్పుడన్నా ఆశ్రమము ని దర్శించవచ్చు .ఆశ్రమం పచ్చటి పొలాల మధ్యన ప్రశాంతం వాతావరణం లో పట్టణ హడావిడి కి దూరంగా ఉంటుంది. ఆశ్రమము ప్రవేశ ద్వారం భగవాన్ ఫోటో తో రమణ నిలయ ఆశ్రమం బోర్డు తో ఉంటుంది .మనం ఆశ్రమం లోకి వెళ్ళగానే ఒక ప్రక్కన కొన్ని గదులతో కూడిన ఒక భవనము ఉంటుంది .ఈ బిల్డింగ్ స్వామి ని చూడటానికి దూరం నుండి వచ్ఛే భక్తుల కోసం కొందరు భక్తులు కట్టించారు .ఆ భవనం నుండి పక్కగా ఒక అందమైన మట్టి రోడ్డు దానికి ఇరుపక్కల అందమైన వరి పొలాలు ఉంటాయి. ఆ త్రోవ వెంబటి వెళ్తూ వుంటే మట్టి రోడ్ పక్కన ఒక ఆసుపత్రి ఉంటుంది. ఆ మట్టి త్రోవ వెంబటి ముందు కి వెళితే స్వామి వుండే ఆశ్రమం .ఇక్కడ పెద్ద ధ్యానం మందిరం ,వెనుకగా గోశాల, స్వామి గది మొదలైనివి ఉంటాయి. ధ్యాన మందిరం కి కొంచెం ముందు న వంట గది ఉంటుంది. ధ్యాన మందిరం కి ముందు అరుణాచలం కొండ నమూనా ని ఏర్పాటు చేసారు .కొందరు భక్తులు ఈ నమూనా చుట్టూ ప్రదక్షిణలు చేస్తువుంటారు . ఆశ్రమ భవనం చుట్టూ పూల చెట్లు ఇంకా రక రకాల మొక్కలతో చాల ఆహ్లదం గా ఉంటుంది . కొందరు భక్తులు ధ్యానమందిరం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తారు . ఆశ్రమం లో మంచి మాటలతో కూడిన సూక్తులు రాసిన బోర్డు లు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి .
రమణ భగవాన్ భక్తులు ఒక్కసారైనా చూడలిసిన స్థలం వేల్పూరు రమణాశ్రమము. ఎందుకంటే ఈ వేల్పూరు ఆశ్రమం మరియు మౌనస్వామి మనకి రమణుల వున్నప్పుడు వున్న రమణాఆశ్రమము ను గుర్తు చేస్తుంది . ఒకవిధంగా చెప్పాలంటే మనము సూరి నాగమ్మ గారు,కృష్ణ భిక్షు గారు వాళ్ళ రచనలలో చెప్పిన రమణా ఆశ్రమము కి వెళ్లినట్టు ఉంటుంది .
 
ఆశ్రమము కి వెళ్ళటానికి తణుకు లో దిగి షేర్ ఆటో లో గాని APRTC బస్సు లో గాని వెళ్ళవచ్చు.తణుకు కి వెళ్ళటానికి ట్రైన్ మరియు బస్సు సౌకర్యము కలదు .ఆశ్రమం లో ఉండాలి అనుకుంటే అక్కడ వసతి సౌకర్యం కూడా కలదు .
ఈ కర్మ యోగి కి తన జీవిత చరిత్ర గురుంచి రాయటం ఇష్టంలేదు అందుకని వారి జీవితచరిత్ర వ్రాయటానికి ఎవరికీ అనుమతికూడా ఇవ్వలేదు.
 
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః
 
- అనంత విజయ అక్కనప్రగడ 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba