‘గురి’ తత్వమే .. ‘గురు’ తత్వం"
‘గురి’ తత్వమే .. ‘గురు’ తత్వం"
.
‘గురువు’ అన్నది ఒక గొప్ప ‘తత్వ ‘ .. అంతే కానీ ‘గురువు’ అంటే ఒక ‘వ్యక్తి’ ఎంతమాత్రం కానేకాదు.
ఒకానొక జిజ్ఞాసువు శ్రీ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ” ‘గురువు’ అంటే ఏమిటి స్వామీ ? “అని అడిగాడట. అప్పుడు ఆయన” ‘ గురి ‘ యే గురువు నాయనా ” అని చెప్పారు.
‘గురి’ అంటే ‘శ్రద్ధ’. నేర్పేవాడికి ఎంత శ్రద్ధ ఉండాలో .. నేర్చుకునేవాడికి అంతకంటే ఎక్కువ శ్రద్ధ ఉండాలి. అసలు .. నేర్పేవాడికంటే నేర్చుకునేవాడి శ్రద్ధయే చాలా గొప్పది. నేర్పేవాడు తాను తెలుసుకున్న విషయాలను అనాయాసంగా వల్లిస్తూంటాడు కానీ .. నేర్చుకునేవాడు మాత్రం దానిని ఎంతో శ్రద్ధతో, గురితో వింటూంటాడు. తెలిసింది చెప్పడం కంటే తెలియనిది ‘ గురి ‘ తో, ‘ శ్రద్ధ ‘ గా తెలుసుకోవడమే గొప్ప. ఎంత గురితో నేర్చుకుంటే అంత జ్ఞానం కనుక ‘గురియే గురువు’ అన్నారు.
మనం స్పష్టంగా తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే మన ‘శ్రద్ధ’ అంటే మన ‘గురి’ తత్వమే .. మన అసలైన గురుతత్వం.
ఈ తత్వాన్ని బోధించడానికే .. ఋషులు దేవుళ్ళ పేరుతో అనేక రకాల పాత్రలను సృష్టించి .. “అలాంటి తత్వానికి నమస్కారం” అని చెప్పారు. అయితే కాలక్రమేణా మనం అసలు తత్వాన్ని వదిలిపెట్టేసి .. కేవలం వారు ఉదాహరణలుగా చూపించిన బొమ్మలను మాత్రమే ఆరాధిస్తూ వస్తున్నాం.
“గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః ||“
“గురుర్బ్రహ్మా” : అంటే ” అంతటా అన్నీ సృష్టిస్తూ ఉన్న ‘ బ్రహ్మ’ వంటి గురుతత్వానికి నమస్కారం “
“గురుర్విష్ణు” : అంటే .. “ఈ సృష్టిలో అన్ని చోట్లా వ్యాప్తి చెందుతూ ఉన్న ‘ విష్ణు ‘ వంటి గురుతత్వానికి నమస్కారం”
” గురుర్దేవో మహేశ్వరః ” : అంటే .. ” ఈ సృష్టిలో అంతటినీ దివ్యంగా మరి గొప్పగా పాలించే ‘ పరమేశ్వరుని ‘ వంటి గురుతత్వానికి నమస్కారం “.
“గురుసాక్షాత్ పరబ్రహ్మ” : “కంటికి కనిపించే వ్యక్తమయిన సృష్టితత్వానికీ మరి కంటికి కనిపించని అవ్యక్తమయిన పరబ్రహ్మతత్వానికీ ..”
“తస్మై శ్రీగురువే నమః ” : ఈ రెండింటి యొక్క సంపూర్ణ రూపమైన ‘గురుతత్వానికీ’ మన వినయపూర్వక నమస్కారం”
“ఎవరికి వారే వారి ‘ గురి ‘ తీరే”
ఇంత వరకు మనకు తెలియని దాన్ని శ్రద్ధతో, గురితో తెలుసుకున్నాక .. ఇక దానిని ఆచరణ ద్వారా సానపెట్టుకుంటూ అభ్యాసం చెయ్యాలి. దానికి ఉన్న మన ఏకైక మార్గమే ‘ శ్వాస మీద ధ్యాస ‘ ధ్యానం. ధ్యానం ద్వారా అనేకంగా ఉన్న మనస్సును శ్వాస మీద పెట్టి .. ఏకముఖం చెయ్యాలి. ఆ పై .. ఒక్కో మెట్టును ఎక్కుతూ .. ఆత్మోన్నత దిశగా ప్రయాణం చెయ్యాలి.
“ఎవరి ‘ గురిలేమి ‘ వారికే శత్రువు .. మరి ఎవరి ‘ గురి కలిమి ‘ వారికే మిత్రుడు కనుక .. ఎవరి ‘ గురి ‘ తో వారు తమ తమ ఆత్మలను ఉద్ధరించుకోవాలి ” అని భగవద్గీత ద్వారా శ్రీకృష్ణపరమాత్మ సమస్త మానవాళికీ సెలవిచ్చారు.
నేను కూడా నేను నాకు తెలిసిన విషయాలను .. అంటే నేను శ్రద్ధగా నేర్చుకున్న విషయాలను మీ చెవుల వరకు వినిపించగలను కానీ .. మీ మెదడులోకి మాత్రం ఎక్కించలేను ; మీ ‘ గురి ‘, మీ ‘ శ్రద్ధ ‘, మరి ‘ నేర్చుకోవాలి ‘ అన్న మీ ధన్యత్వమే దానిని మీ మెదడులోకి ఎక్కిస్తుంది.
“గురువు అంటే బరువైనవాడు”
ధ్యానభ్యాసంలోకి రాకముందు కూడా మనం లౌకిక విషయాల మీదా .. మరి డబ్బు సంపాదించడం వంటి ప్రాపంచిక వ్యవహారాల మీదా .. ‘గురి’ బాగానే పెట్టాం. అయితే అవి అన్నీ కూడా మనల్ని ఇంకా ఇంకా ‘తేలిక’ చేసేస్తూ మన దుఃఖానికి కారణం అవుతూ వచ్చాయి. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మన ‘గురి’ అంతా ‘ పరబ్రహ్మతత్వం ‘ మీద పెట్టాం మరి అనంతమైన ‘ఆత్మజ్ఞానం’ మీద పెట్టాం. క్రమంగా అవి మనలో ఏకాగ్రతత్వాన్ని పెంచడం వల్ల గురుతత్వంతో కూడిన ఆధ్యాత్మిక మేధస్సుతో మనం ‘బరువు’ గా అవుతుంటాం.
సత్యభామాదేవి నగలూ చీని చీనాంబరాలూ త్రాసులో వేసినా గురుతత్వం మెండుగా ఉన్న శ్రీకృష్ణుడి బరువుకు అవి సరితూగ లేకపోయాయి. కానీ ‘ శ్రద్ధ ‘ – ‘ గురి ‘ మిళితమై ఉన్న హృదయంతో రుక్మిణీదేవి వినయంగా ఒక్క తులసీదళాన్ని త్రాసులో పెట్టగానే .. అంతటి కృష్ణుడు కూడా సరితూగాడు.
కాబట్టి ‘ గురి ‘ తో కూడిన ‘ గురుతత్వం ‘ ఎంతగా పెరుగుతూ ఉంటే .. మనలో అంతగా అణుకువ, సహనం, స్థిరత్వం, ధర్మవర్తనం మరి మనోనిబ్బరత వంటి దివ్య లక్షణాలు ఏర్పడి మరింతగా పెంపొందుతూ ఉంటాయి. ప్రతిక్షణం మన నోటినుంచి జ్ఞానపూర్వకమైన మాటలే వస్తూంటాయి.. మరి చక్కటి ఎరుకతో కూడిన ఆత్మజ్ఞానంతో మనం సదా విలసిల్లుతూ ఉంటాం.
“గాంధీ మహాత్ముల వారు” “సబ్ కో సన్మతి దే భగవాన్” అంటూ సమస్తమానవాళి తరపున ప్రార్థించారు. “భగవత్ తత్వం” అంటే “మన చర్మచక్షువులకు కనపడని సమస్త సమున్నత ఆత్మల బృహత్ సముదాయం” .. ఎప్పుడూ మనకు మతిని ధారాపాతంగా ఇస్తూనే ఉంది. అయితే దానిని పుచ్చుకునే ధన్యత్వంతో మనం కూడా సంసిద్ధులుగా ఉండాలి.
అలా మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఈ సృష్టిలో వ్యక్తమయి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఒక గురువులా మనకు నేర్పిస్తూనే ఉంటుంది. సింహం దగ్గర నుంచి గంభీరత, నెమలి దగ్గర నుంచి సొగసు, పావురం దగ్గర నుంచి శాంతం, చీమ దగ్గర నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి. అవన్నీ కేవలం వాటికి మాత్రమే స్వంతం కాదు. “నేర్చుకోవాలి” అన్న తపన ఉంటే అవన్నీ మనకు కూడా వచ్చేస్తాయి.
అంతేకాదు జీవితంలోని ప్రతిఒక్క క్షణం, ఎదురయ్యే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఒక గురువులా మనకు జ్ఞానాన్ని కలిగిస్తూనే మనల్ని క్షణ క్షణం ఎదిగిస్తూనే ఉంటుంది. ఈ విషయాలన్నింటి పట్ల మనకు స్పష్టమైన అవగాహన కలగాలంటే .. నిరంతర ధ్యానసాధన మనకు తప్పనిసరి.
ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారే తమలో ఉన్న ‘గురి’ తత్వానికి .. ‘శ్రద్ధా’ తత్వానికి .. ధ్యానసాధన ద్వారా, జ్ఞానార్జన ద్వారా విశేషంగా సానపెట్టుకుంటూ .. గురువులుగా మారితీరాలి; నిరంతర ధ్యానాభ్యాసం ద్వారా దివ్యచక్షువును సంపాదించుకోగల .. ఆత్మసందేశాలను వినగలగాలి
.. మరి వాటిని నిజజీవితంలో అభ్యాసం చేస్తూ శుభాశుభాలను సాక్షీభూతంగా గమనిస్తూ ఉండాలి.
” గురుతత్వం ” తో కూడి ఉన్న వారందరికీ .. ధ్యానవందనాలు
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి