Online Puja Services

భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కర్మసిద్ధాంతం.....!

3.141.42.41

భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన కర్మసిద్ధాంతం.....!!

ధర్మరాజు ” భీష్మపితామహా ! నరుడు చేసే కర్మలకు అతడి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి సుఖదుఃఖములు, శుభాసుభములు ఉంటాయి కదా ఆ కర్మల కర్త అతడేనా ! కాదా ! అని నాకు అనుమానంగా ఉంది దానిని వివరించండి ” అని అడిగాడు. 

భీష్ముడు ! ధర్మనందనా ! ఒక సారి ఇంద్రుడు ప్రహ్లాదుడి మధ్య జరిగిన సంవాదము వింటే నీ సందేహము తీరుతుంది. 

సత్వగుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ సంయమనం పాటించే వాడు, అహంకారము లేని వాడు, కోపమంటే తెలియనివాడు, నిందను స్తుతిని సమానంగా పరిగణించేవాడు, ఇనుమును బంగారమును సమానంగా విలువ కట్టేవాడు అయిన ప్రహ్లాదుడు తన మందిరములో కూర్చుని ఉండగా ఇంద్రుడు అతడి అంతరంగం తెలుసుకోవాలని అక్కడకు వచ్చి ” ప్రహ్లాదా ! నీవు సంపద లేకున్నా దుఃఖించవు, శత్రువుల చేతికి చిక్కుతానన్న భయము లేదు, అసలు ఏమీ చేయవు ఇంతటి బేలగా ఉంటే ఎలా ? ” అని అడిగాడు. 

ప్రహ్లాదుడు ” ఇంద్రా ! కలిమి లేమి పక్క పక్కనే ఉంటాయి. సంపదలు ప్రయత్నిస్తే వస్తాయి లేకున్న రావు అనుకోవడము నీ బేలతనమే ! సంపదలు సంపాదించనవసరం లేదు విధి అనుకూలిస్తే వచ్చి పడతాయి ప్రతికూలించిన హారతికర్పూరంలా కరిగి పోతాయి. దీనికి మానవ ప్రయత్నముతో పని లేదు. శత్రువులు ఓడించడం, మిత్రులు కాపాడడము, సంపదల రాకపోక అంతా విధిలిఖితమే. మానవుడి మనసును అనుసరించి భావాలుపుడతాయి, పోతాయి. చంచలమైన మనసులోని భావాలు చంచలమైనవే అని తెలుసుకుని మనసుని నిగ్రహించాలి. తన పనులన్నిటికీ తానేకర్తను అనుకోవడము అవివేకము. అలా అయితే మానవులు చేసే కర్మలన్నిటికీ సమ ఫలితాలు ఉండాలి కదా ! అఖిలకర్మలకు కర్త ఆ పరమేశ్వరుడే కాని మానవుడు కాదు. తాను చేసే కర్మలకు తానేకర్తను అన్న అహంకారంతో కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటుకుటుంది. ఫలాపేక్ష లేక కర్మలను చేస్తూ సుఖదుఃఖాలకు లోను కాక మనసు నిలకడగా ఉంచుకున్న వాడు మహనీయుడు. 

కనుక దేవేంద్రా ! నేను ఈ లోకములో ఉన్న సకల ప్రాణులకూ అనిత్యములే అని అసత్యములని తెలుసుకుని సంసార బంధములో చిక్కక సంతోషముతో ఉంటాను. శాంతితోను ఇంద్రియనిగ్రహముతో ఉండే వాడికి చింతలు దరిచేరవు. నేను అలా నిశ్చింతగా జీవిస్తున్నాను ” అని ప్రహ్లాదుడు అన్నాడు. 

ఇంద్రుడు ” దానవేంద్రా ! నీకు ఇంతటి ప్రశాంతచిత్తము ఎలా అలవడింది చెప్పవా ! ” అని అడిగాడు. 

ప్రహ్లాదుడు ” దేవేంద్రా ! ఆత్మావలోకనము, మంచిప్రవర్తన, మనసును ప్రసన్నంగా ఉంచుకోవడము, అప్రమత్తత, పెద్దలను వృద్ధులను గౌరవించుట లాంటి ఉత్తమ లక్షణాలు మానవులకు మేలుచేసి మానవుడికి ప్రజ్ఞా శాంతి ఇస్తాయి. ఇది విన్న ఇంద్రుడు ఆశ్చర్యముతో తిరిగి స్వర్గానికి వెళ్ళాడు” అని చెప్పాడు. 

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore