Online Puja Services

వారణాశి

52.15.66.233
అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికాః
 
అయోధ్య, మథుర, మాయ (హరిద్వార్), కాశి (వారణాశి), కంచి, అవంతిక (ఉజ్జయిని), పురీ, ద్వారక అనే ఏడు పుణ్యధామములు మోక్షమును ప్రసాదించే క్షేత్రములు. ఈ క్షేత్రములు దర్శించి భక్తి, శ్రద్ధలతో కొలిచే వారికి మోక్షము కలుగుతుందని భారతీయ ఆధ్యాత్మిక వేత్తల ప్రగాఢ విశ్వాసం. దీనికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈ అన్ని క్షేత్రాలలోకీ అత్యంత మహిమాన్వితమైనది వారణాశి. కాశ్యాం హి మరణాన్ముక్తిః - కాశీలో మరణం పొందిన వారికి ముక్తి వెంటనే కలుగుతుంది అని ఇంకో ఆర్యోక్తి. వరుణ మరియు ఆశి నదులు గంగానదిలో సంగమమయ్యే ప్రాంతంలో ఉన్న పట్టణం కాబట్టి కాశిని వారణాశిగా పిలుస్తారు.
 
ఆది శంకరులు దేశమంతా పర్యటిస్తూ కాశీ పట్టణంలో చాల కాలం గడిపారు. ఆ నగరంలోనే ఆయన కాశీ పంచకం, మనిషి తానూ ఎవరో తెలుసుకునే సాధనమైన మనీషా పంచకం రచించారు. ఇదివరకే మహత్కర మనీషా పంచకము ఈ బ్లాగ్ లో వివరించాను. ఈ వ్యాసంలో కాశీ పంచకము, తాత్పర్యము మీకోసం.
 
మనోనివృత్తిః పరమోపశాంతిః
సా తీర్థవర్యా మణికర్ణికా చ
జ్ఞానప్రవాహా విమలాదిగంగా
సా కాశికాహం నిజబోధరూపా ౧
యస్యామిదం కల్పితమింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా
సా కాశికాహం నిజబోధరూపా ౨
కోశేషు పంచస్వధిరాజమానా
బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం
సాక్షీ శివః సర్వగతోఽంతరాత్మా
సా కాశికాహం నిజబోధరూపా ౩
కాశ్యాం హి కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా ౪
కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనఃసాక్షిభూతోఽంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి ౫
 
తాత్పర్యము:
మనసులోని ప్రశ్నలకు నివృత్తి, అత్యుత్తమమైన ఉపశాంతి, తీర్థ రాజమైన మణి కర్ణిక , జ్ఞాన ప్రవాహమైన, శుద్ధమైన గంగానదికి రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.
 
మాయా పూరితమైన (ఇంద్రజాలము వలె) ఈ చరాచర సృష్టికి నిలయమైన, సచ్చిదానందమునకు రూపమైన, పరమాత్మ రూపమైన, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.
 
పంచ కోశముల జ్ఞాన ప్రకాశమైన, భవాని అనే దేహమునందు అర్థ భాగముగా ప్రకాశించుచు, అంతరాత్మకు ప్రభువైన, సాక్షియైన శివునిగా, నిజ ఆత్మ రూపమైన ఆ కాశికను నేనే.
 
కాశి కాశిలోనే యుండి అన్నిటినీ ప్రకాశింప చేయును. అటువంటి కాశిని తెలుసుకున్న వాడు కాశికి చేరును.
 
నా దేహమే కాశిలో ఉన్న విశ్వనాథుని దేవాలయము. నా భక్తియే విశ్వవ్యాప్తమైన త్రిభువన జనని గంగానది. నా శ్రద్ధయే గయా క్షేత్రము. గురుదేవుని నిజ పాద ధ్యానమే నాకు ప్రయాగ. నా అంతరాత్మయే ఈ సకల జగత్ప్రాణి మనస్సాక్షీ భూతమైన ఆ విశ్వేశ్వరుడు. దేహములో అంతటా ఈ విధముగా నివశించి యుండగా వేరే తీర్థములతో పని ఏమున్నది?
 
పరిశీలన:
ప్రత్యక్షముగా కనిపిస్తున్న కాశీ క్షేత్రము మరియు తన దేహములోని ఆత్మ ఒకటే అని నిస్సందేహముగా ఈ స్తోత్రము ద్వారా చాటారు ఆది శంకరులు. పరిపూర్ణ ఆత్మ జ్ఞాన అనుభూతుడైన శంకర గురువులకు తన శరీరమే దేవాలయము, అందులోని జీవుడే (ఆత్మ) పరమాత్మ, సనాతన దైవము. ఈ భావాన్ని శంకరులు ఈ కాశీ పంచకము ద్వారా -భక్తి శ్రద్ధలే సజల స్రవంతి యైన గంగ మరియు మోక్ష ధామమైన గయలని, అహంకారమును నాశనము చేసి, జ్ఞాన జ్యోతిని వెలిగించి ఆత్మ సాక్షాత్కారములో మార్గ సహాయకుడైన సద్గురువు పాద పద్మములే ప్రయాగయని - అద్వైతములోని జీవాత్మ పరమాత్మ ఏకత్వమును అత్యున్నతమైన స్థాయిలో ఉదహరించారు.
 
దేహములోని పంచకోశములలోని ప్రకాశమును ఆ భవానీశంకరుని రూపముగా, ఆ దేహమును చరాచర సృష్టికి సంకేతముగా, మాయారూపముగా, మోక్ష సాధనకు సాధనముగా ఈ స్తుతిలో వర్ణించారు ఆది శంకరులు. కాశీ క్షేత్రములో కనిపించే యోగము, జీవన్ముక్తి, గంగా నది మహత్తు, ఆ నదీమ తల్లి సర్వ వ్యాపకత, అక్కడి మణి కర్ణికా ఘట్టములో జరిగే నిరంతర దేహ కాష్టము, నదిలో ప్రవహించే అనేకములు, విశాలాక్షీ విశ్వేశ్వరులు - మొత్తం కాశీ పట్టణమే మహదనుభవైక వేద్యముగా భావించి, ఆ భావనను పరిపూర్ణముగా ఆత్మకు ఆలయమైన దేహములో అనుభూతి చెంది రచించారు శంకరులు. అందుకే, ఆయన శంకారవతారులు, జగద్గురువులు అయినారు.
 
మహాదేవ
 
- భానుమతి అక్కిశెట్టి 
 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba