Online Puja Services

ఎంత గొప్ప వినాయకుడి శ్లోకం....

18.117.192.64

దేవతారాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజించమని చెబుతారు. గజాననుని శ్లోకం అనగానే అందరికి ముందు వచ్చేది ఈ క్రింద చెప్పిన శ్లోకమే

శుక్లాంబరధరం విష్ణుం 

శశివర్ణం చతుర్భుజం 

ప్రసన్న వదనం ధ్యాయేత్ 

సర్వ విఘ్నోపశాంతయే 

శుక్ల – స్వచ్చమైన
అంబర – ఆకాశాన్ని
ధర్మ – ధరించిన
శశివర్ణం – చంద్రుని వంటి కాంతి కలిగిన
చతుర్భుజం – నాలుగు వేదాలను నాలుగు భుజములుగా కలిగినవాడు / చతుర్విధపురుషార్ధాలను ఇచ్చువాడు
ప్రసన్నవదనం – చిరునవ్వులొలికించి సిరివెన్నలలను చిందించు నగుమోము కలవాడు
విష్ణుం – సర్వవ్యాపకుడైన పరమాత్మ
సర్వ విఘ్నోపశాంతయే – సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు
ధ్యాయేత్ – ధ్యానం చేస్తున్నాను.

తెల్లటి వస్త్రాన్ని ధరించి, చంద్రుని వంటి కాంతి కలిగి, ధర్మార్ధ కామమోక్షములను నాలుగు శ్రుతులనే భుజాలు గా ధరించి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మ స్వరూపుడైన పరమాత్మను, అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్ధన.

ఇది వినాయకుడి ప్రార్ధనగా మన అందరికి తెలుసు. విఘ్నశబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్ధన అని, హిందూ మతానికే చెందినది అని అనుకుంటాము. కాని, అంతటా వ్యపించి ఉన్న పరమాత్మను ప్రార్ధించే శ్లోకంగా, అర్ధం తెలిసినవారు అంగీకరిస్తారు.

శుక్లాంబర ధారిణిగా సరస్వతీదేవిని తలచి ప్రార్ధించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వార పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది ఒక మహా మంత్రరాజం.

ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రీ మంత్రంతో సమానం. పూర్ణగాయత్రి కి కూడ 32 అక్షరాలే. ఈ బీజాక్షరాలలో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శ్రుతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహప్రాప్తికై చేసే ఏకైక ప్రార్ధనా శ్లోకమిది.

ఏకో దేవః సర్వభూతేషు…అనే శ్రుత్యర్ధం తెలిస్తే, ఈ శ్లోకం మహా మంత్రమని తెలుస్తుంది. సమస్త విఘ్న నివారిణి ఐన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.

 
- భానుమతి అక్కిశెట్టి 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore