చీమలకు మనుషులకు పోలిక
*నేటి చిట్టికథ*
కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.
"చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.
సమస్య కొలిక్కి వచ్చింది.
ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.
"మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.
తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః ॥
ఉద్యమం అనగా కృషి లేక పరిశ్రమ. ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు లేదా తలపెట్టినప్పుడు, ఆ సత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా ధృఢ సంకల్పం ఉండాలి. కొనసాగించడానికి కృషి ఉండాలి. కార్య సాఫల్యతకి కృషి లేదా పరిశ్రమ అత్యంత ఆవశ్యకమే కాక, కీలకము కూడా. ఆ కార్య సాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. కార్య సాఫల్యతకై చేసే ప్రయత్నం లో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కోవడానికి గుండె దిటవు కావాలి. అట్టి కార్య సాధనకై, కృషీ పట్టుదలతో పాటు స్థిరచిత్తము, ధృఢసంకల్పమూ, ఏకాగ్రతా, గమ్యాన్ని చేరడానికి తగినంత ఓర్పు అత్యంత ఆవశ్యకం. అప్పుడే లక్ష్య సాధన దిశగా పయనించ గలుగుతాం.
ఆ విధమైన ఉద్యమముతోనే కార్యములు సిధ్ధించును. అంతే కానీ, కేవలం మనోరథములచే కార్యములు సిధ్ధించవు.
మనోభీష్టము చేత కోరికలు ఈడేరవు.
అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలిని తీర్చుకొనుటకై వేటాడావలసిందే. వేటాడి ఆహారం తినవలసినదే!
అంతేకాని, అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలిని తీర్చుకొనుటకై నోరు తెరచుకొని కూర్చుంటే వన్య మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు.
SM చక్రపాణి