Online Puja Services

ఎవరిని ధ్యానించాలి?

18.222.22.154
కర్మ చేయడంలో మనం స్వతంత్రులం. కాని, కర్మఫలాన్ని అనుభవించడంలో అస్వతంత్రులం. దీన్నిబట్టి కర్మఫలాలు ఇచ్చేవాడు ఒకడున్నాడని తెలుస్తుంది. అతనికే పరమాత్మ అని పేరు. ఎవరు ఈ మానవజన్మతో పాటు, సమస్త శక్తుల్ని మనకు ప్రసాదిస్తున్నారో, ఎవరిని ఈ విశ్వమంతా ఎల్లవేళల ఉపాసిస్తుందో, ఎవరి ఆజ్ఞను సమస్త దేవతలు శిరసా వహిస్తున్నారో, ఎవరిని ఆశ్రయిస్తే మోక్షం లభిస్తుందో, ఎవరిని ఆశ్రయించకపోతే మళ్లీమళ్లీ జన్మలెత్తవలసి వస్తుందో- అట్టి దేవుణ్నే మొక్కాలని వేదం చెబుతుంది. అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని; చీకటిని విడిచిపెట్టి ప్రకాశాన్ని; మృత్యువును విడిచిపెట్టి అమృతాన్ని చేరుకోవాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి.

'సత్‌', 'జ్యోతి', 'అమృత' శబ్దాలు పరమాత్మకే వర్తిస్తాయి. ప్రపంచం అసత్తు. అనగా సత్యం కానిది. పరమాత్మ సత్యం. కనుక అతడు సత్యస్వరూపుడు. అజ్ఞానమే చీకటి. పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడు. అతని జ్ఞానమనే వెలుగులో మన అజ్ఞానమనే చీకటి పటాపంచలమవుతుంది. కనుక పరమాత్మ 'చిత్‌' స్వరూపుడు. మనం మర్త్యులం. అనగా మృత్యు ముఖంలో ఉన్నవారం. ఎప్పుడేమవుతుందో తెలియదు. ఇలాంటి మృత్యువు నుంచి మనం బయటపడాలి. కనుక అమృతసిద్ధి పొందాలి. అమృతం అంటే శాశ్వతానందం. అది పరమాత్మలోనే ఉంది. కనుకనే ఆయన ఆనందస్వరూపుడు. అందుకే మనం ఎల్లవేళలా సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మనే ధ్యానించాలి.
కనిపించే ఈ స్థూల ప్రపంచానికి మూలకారణమైన ప్రకృతి కూడా సత్‌ పదార్థమేకాని, అది జ్ఞానరహితమైనది. అనగా దానికి తెలివిలేదు. కనుక పరమాత్మకు బదులుగా ఈ జడ ప్రకృతిని ఎవరు ధ్యానిస్తారో వారు దుఃఖరూపమైన అంధకారంలో పడిపోతారని వేదం చెబుతుంది.

సర్వజ్ఞుడైన పరమాత్మ జడప్రకృతి కంటే భిన్నమైనవాడు. ప్రకృతి కారణంగా కలిగిన విశ్వానికి ఆకారం ఉంది. కాని అతనికి లేదు. పరమాత్మ సర్వాంతర్యామి కనుక అతనిని పిలువలేం. సర్వాధారుడు కనుక అతనికెలాంటి ఆసనం ఇవ్వజాలం. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాడు కనుక అర్ఘ్య పాద్యాదులు సమర్పించలేమని శంకర భగవత్పాదులు 'పరాపూజా' అనే గ్రంథంలో శ్లోక రూపేణా రాశారు.
జడానికి బదులు జ్ఞానాన్ని ఆశ్రయించడం వల్లనే ముక్తి లభిస్తుందని సాంఖ్య దర్శనం చెబుతుంది. ఈ దర్శనంలోనే ధ్యానమంటే ఏమిటో స్పష్టంగా ఉంది.

విషయరహితమైన మనస్సుకే ధ్యానం అని పేరు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదూ విషయాలు. వీటి నుంచి మనస్సు పూర్తిగా వైదొలగినప్పుడే ధ్యానానికి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆత్మ మనస్సు నుంచి కూడా విడివడి పరమాత్మ ధ్యానంలో మునిగిపోవాలి. మనం ఎవరిని లక్ష్యంగా చేసుకొని ధ్యానిస్తున్నామో, ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే ప్రవాహరూపంలో ఉండాలి. పరమాత్మ సర్వ వ్యాపకుడైనప్పటికీ కేవలం మన హృదయంలో ఉన్న ఆత్మలోనే ఆయన దర్శనమివ్వగలడు. దీన్నే ఈశ్వర సాక్షాత్కారమని మన పెద్దలు చెప్పినారు. పరమాత్మ జడపదార్థం కాడు కనుక కనిపించడు. కాని, మన అనుభవంలోకి వస్తాడు. ఇదే ఈశ్వర సాక్షాత్కారం. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకు మనం చేయవలసిందల్లా ఆత్మకు పాపపంకిలాన్ని అంటకుండా జాగ్రత్తపడటమే.

నీటిమీద చెత్తాచెదారం ఉంటే చంద్రుణ్ని ఎలా చూడలేమో, అలాగే ఆత్మకు పాపం అంటుకుంటే పరమాత్మను కూడా అనుభవంలోకి తెచ్చుకోలేం.

చీకటి పోవాలంటే వెలుతురు ఎంత అవసరమో అజ్ఞానం పారద్రోలాలంటే జ్ఞానం అంత అవసరం. వీటన్నిటికి మూలం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను వశపరచుకున్నవారు దేనికైనా సమర్థులు.
 
ప్రపంచంలో చాలా రకాల జీవరాశులున్నాయి. ఒకో జీవి ఒకో వస్తువువల్ల కట్టుబడి పతనం చెందుతాయి. అవి తురంగ, మాతంగ, సతంగ, మీన, భ్యంగములు. తురంగం అంటే - జింక. జింక శబ్దానికి కట్టుబడుతుంది.  మాతంగం అంటే - ఏనుగు. ఇది మావటివాని అంకుశానికి లొంగుతుంది. సతంగం అంటే - మిడత. మిడత వెలుతురుకి ఆకర్షించబడి ఆ మంటలో మాడి మసైపోతుంది. 
మీనం అంటే - చేప. ఇది ఎరకి బలైపోతుంది. భ్యంగము అంటే - తుమ్మెద. ఇది పూల రంగులకి పరవశించిపోతుంది.

కాని మానవుడు ఈ జీవులన్నిటికన్నా హీనమైన వాడు. ప్రతి విషయానికి లొంగి పనతమవుతాడు. శబ్ద, రూప, రస, గంధాలకు వశమవుతాడు. అన్నింటికీ కుట్టబడిపోతాడు. వివేకాన్ని, బుద్ధినీ కోల్పోయి పతనం అయిపోతాడు. ఈ అయిదింటికి వశమయిన మానవుడు శాంతి, సుఖాలకు దూరమవుతాడు. అన్నింటికీ అతీతుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహం అలవరచుకోవాలి. దానికోసం కృషి చెయ్యాలి. మాట, తిండి, వాసన, వినికిడి, దృష్టి వీటన్నిటిని అదుపులో ఉంచుకోవాలి.

నిజమైన దైవత్వమును పొందాలంటే వాగ్దోషము, దృష్టి దోషము, క్రియాదోషములను దూరము చేసుకోవాలి. అలా ఆచరించినప్పుడే మానవుడు మాధవుడవుతాడు....... చరితార్థుడవుతాడు.
 
స్వస్థి........ 
**సనాతన ధర్మస్య రక్షిత -రక్షితః **

- ప్రసాద్ సింగ్ 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba