Online Puja Services

మహాభారతంలో సంజయుడి పాత్ర ఆదర్శవంతం

18.224.33.235

మహాభారతంలో సంజయుడి పాత్ర ఆదర్శవంతం
 

మహాభారతంలో ఒక పాత్ర. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారు మరియు ఆయనకు రథసారథి. కురుక్షేత్రంలో ప్రాణాలతో మిగిలినవాళ్ళలో ఇతనొకడు. ధృతరాష్ట్ర దంపతులకు సేవలు చేసాడు. చేదోడు వాదోడుగా వున్నాడు. పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన సందర్భంలో ధృతరాష్ట్రుని తరుపున రాయబారిగా వెళ్ళాడు. యుద్ధము వద్దని మంచి మాటలతో ఒప్పించాలని చూసాడు.

మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్యదృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతాడు. యుద్ధంలో ఒక్కో రోజు ధృతరాష్ట్రునికి తన నూరుగురు కుమారులు భీముని చేతిలో ఎలా చనిపోయారో ఆయనకు వివరించాల్సి వస్తుంది. ఈ కష్ట సమయంలో సంజయుడే ధృతరాష్ట్రునికి సాంత్వన చేకూరుస్తాడు. సంజయుడికి ధృతరాష్ట్రుని మీద ఎంత భక్తి ఉన్నా యుద్ధంలో జరిగే భీభత్సాన్ని మాత్రం ఉన్నదున్నట్టుగా వివరించాడు. ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు.
కొడుకుల్ని కోల్పోయిన తరువాత గాంధారి ధృతరాష్ట్రుల వెంట అడవికి వెళ్ళాడు. ఆలనపాలనా చూసాడు. అయితే ఒకరోజు అడవిని కార్చిచ్చు కాల్చేస్తున్న సమయంలో గాంధారీ ధృతరాష్ట్రుని బలవంతంతో ప్రమాదం నుండి తప్పించుకొని వేరే దారిన వెళ్ళి చివరకు హిమాలయాలకు చేరుకున్నాడు.

భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి భోదిస్తున్నట్లుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. (సంజయ ఉవాచ)

మహాభారతం లో అధర్మ పక్షంలో ఉంటూ తమ పక్షం వారు అధర్మం చేస్తున్నారని అందువల్ల వినాశనం తప్పదని తమవారికే చెప్పగలిగిన ధైర్యశాలి సంజయుడు.

రామాయణంలో విభీషణుడు కూడా రావణునికి బుద్ది మాటలు చెప్పాడు. రావణుడు వినకపోతే అక్కడనుండి రాముని దగ్గరకు వెళ్ళిపోయాడు. అలాగే భారతంలో తాము చేస్తున్నది అధర్మమని భీష్మాది వీరులకి తెలుసు.అసలు అధర్మాచరణకు మూలకొమ్మయైన ధృతరాష్ట్రునికీ తెలుసు. కానీ ఎంత తెలిసున్ననూ వారు పుత్ర వ్యామోహంతోనో ప్రతిజ్ఞబంధంతోనో స్వధర్మాచరణ అనే ముడితో చాలామంది అధర్మపక్షంలోనే ఉండిపోయారు.కానీ ఎక్కడైనా సరే ఏ అవస్థ లోనైనా సరే ధర్మాన్ని విజయలక్ష్మి వరిస్తుందనేది నిక్కం.

ఎన్ని ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ధర్మం తప్పకుండా పనులు చేస్తూ అసత్యాన్ని పలకకుండా ఉండడమే నేర్పరితనం. ఆ నేర్పరితనంలో దిట్ట సంజయుడు.సంజయుడు కురు పాండవుల్లోని ఇరుపక్షాల బలాలు బలహీనతలు సమగ్రంగా తెలిసినవాడు. కనుకనే రాయబారానికి ధృతరాష్ట్రుడు పంపినపుడు పాండవుల దగ్గర సంజయుడు వారి బుద్ధి వైశిష్ట్యాన్ని పొగిడాడు. లోకంలో ఎవరైనా పొగడ్తల కు లోబడేవాళ్లే. అది ఎంతవరకు అన్నది వారి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది.కానీ కాసేపైనా ఆ మత్తులో ఉంటారు. అందుకే సంజయుడు కౌరవులు చేసింది చేస్తున్నది ఇప్పుడు చేయబోయేది అధర్మమని తెలిసినప్పటికీ తాను చెప్పేది సరియైనది కాదు అని తెలిసినా కూడా ధర్మరాజుని నీవు పుణ్యశాలివీ నీవు రక్తపుటేరులతో పండిన అన్నాన్ని తినలేవు ఐనా నీకు పరమశివుని దగ్గర అస్త్రాలను గైకొన్న వీరాధివీరులైన తమ్ములున్నారు అనీ సామంతో లొంగదీసుకునే ప్రయత్నం చేసాడు.

ఇది రాజనీతి అది సరికాకపోయినా దానిలో అసత్యం లేదు అదే సమయంలో కౌరవుల్లో మహాభయాంకరులైన యుద్ధ పిపాసులైన భీష్మ ద్రోణ కృపాచార్యులతో పాటుగా దుశ్శాసనాది వీరులు మహా పరాక్రమవంతులైన వారి సంతానం ఉన్నారని చెప్పి వారిని ఎదిరించటానికి పరమశివుడు కూడా సంశయిస్తాడని అంటాడు.

అంటే మీరు ఉత్తములని చెప్తూనే మీ ఎదుటివారు సైతం సామాన్యులు కారు, వారిని జయించడానికి ఎవరైనా వెనుకంజ వేస్తారనే విషయాన్ని వెల్లడిస్తాడు.ఇలా ఎన్నో సామదానదండోపాయాలను ఉపయోగించి వారిని యుద్ధ విముఖులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే చివరకు సంజయ రాయబారం శుష్కప్రియాలు శూన్యహస్తాలు మిగిల్చిందన్నది వాస్తవం.

ధర్మరాజాది వీరులకు ఎలా యుద్ధాన్ని విరమించుకోవాలో కౌరవుల వల్ల జరిగే కీడుని దూరం చేసుకోడానికి ఎంత నిశిత బుద్ది కలిగి ఉండాలో విడమరిచి చెప్పాడు. అలానే తన పుత్రులు పాండవాగ్నిలో శలభాల్లా మాడి మసవుతారనే చింతలో ఉన్న ధృతరాష్టునికి మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటూ చిన్ననాడే దుర్యోధనుని అదుపులో పెడితే ఈరోజు ఇలా చింతించాల్సిన అవసరం ఉండేది కాదు అని చెపుతాడు. పాండవులకు అన్యాయం చేసినపుడు చూస్తూ కూర్చున్నావు గనుకనే నేడు నీవారి వినాశనాన్ని కూడా మౌనంగా భరించవలసిందే అని అనగలిగిన వారిలో సంజయుడే ప్రథముడుగా కనిపిస్తాడు.

ధృతరాష్ట్రా! కృష్ణుడు కేవలం ధర్మ సంస్థాపనకై జన్మిoచినవాడు ధర్మనందనులైన పాండుపుత్రుల విజయానికి శ్రీ కృష్ణుడే మూలకారణం అవుతాడు. సత్య దర్మాల పక్షం వహించే శ్రీ కృష్ణుడు పాండవ పక్షపాతి అన్న ఖ్యాతి పొందినవాడన్న నిజాన్ని నీవు అందుడివైనా చూడాల్సిందేనని కష్టమైన మాటల్ని కూడా సూటిగా చెప్పగలిగిన దీముడు సంజయుడు.

ఇంతటి విచక్షణా జ్ఞాని గనుకే వేదవ్యాసుడు సంజయునికి కదన రంగంలో జరిగే పరిణామాలను చూడగలిగే నేర్పునే కాదు వీరుల మనస్సుల్లో రగిలే జ్వాలలను వారి మనసుల రీతిని కూడా చూడగల నైపుణ్య శక్తినిచ్చాడు. దానివల్లనే సంజయుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర మహా యుద్ధంలో జరిగే యుద్ధరీతిని అక్కడున్న వారి మనస్థితులని కూడా విపులంగా చెప్పాడు. అటువంటి సంజయుని హితోక్తులను మనము మననం చేసుకొని తీరాలి. సంజయుడు మాట్లాడిన వాటిల్లోంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని, నిత్య జీవితంలో ఆచరణలో పెడితే అన్నింటా విజయం వరిస్తుంది. అంతేకాదు నిజం మాట్లాడడమెలాగో, నిష్టూరమైననూ అధర్మం నుంచి ఎలా పక్కకు తప్పుకోవాలో, ఒకవేళ అక్కడే ఉన్నా అధర్మపు ఛాయ అంటకుండా ఎలా ఉండాలో తెల్సుకోవచ్చు. (tnilive) టెలిగ్రామ్’ ద్వారా (గురుగీత) పొందాలనుకునేవారు:

HTTPS://T.ME/GURUGEETA

- శ్రీనివాస మూర్తి చిట్టమూరి

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya