Online Puja Services

క్షణకాల దర్శన భాగ్యం

3.147.86.246

క్షణకాల దర్శన భాగ్యం  కంచి పరమాచార్యుల క్షణకాల దర్శన భాగ్యం కనీసం దూరం నుండి అయినా పొందగలిగే రోజు కోసం నేను ఎంతగానో ఎదురుచూశాను. చివరికి 1963లో ఆ రోజు రానేవచ్చింది. అప్పుడు నేను సెలవులకని మధురైలో ఉన్నాను.  నగరానికి వెలుపల ఉన్న నారాయణపురంలో మహాస్వామివారు మకాం చేస్తున్నారు. జులైలో ఒకరోజు ఉదయం అవకాశం కోసం మఠానికి వెళ్ళాను. విజిటింగ్ కార్డుపై నా స్థానిక చిరునామా వ్రాసి స్వామివారి అంతేవాసులకు ఒకరికి ఇవ్వగా, వారు వెంటనే దాన్ని స్వామివారి దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రతిక్రియ లేదు. ఎంతసేపైనా వేచివుండడానికి సిద్ధపడి ఒక మూలన కూర్చున్నాను.  కొన్ని గంటల తరువాత గోపూజ చెయ్యడానికి స్వామివారు బయటకువచ్చారు. నేను స్వామివారికి కనబడేలాగా ఉన్నాకూడా వారు నన్ను గమనించలేదు. ఇతర కార్యక్రామలాకు సమయం కావడంతో స్వామివారు వారి గదికి వెళ్ళిపోయారు.  గంటలు గడుస్తున్నాయి కానీ రాత్రి ఏడు గంటలైనా స్వామివారి నుండి ఎటువంటి సమాధానం లేదు. స్వామివారు ఇక సాయంత్రం పూజకు వెళ్తారని, తరువాత ఇక విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఇక వేచివుండడం అవసరంలేదని తెలిపారు.  ఇలా అయిదు రోజులపాటు జరిగింది. కానీ నేను వదలలేదు. నీరీక్షించే సమయం పెరిగే కొద్దీ స్వ్వామివారితో మాట్లాడలనే కోరిక నాలో బలపడింది. ఆఖరికి ఆరవరోజు, మధ్యాహ్నం ఒంటి గంటకు నన్ను స్వామివారు కలవాలనుకుంటునట్టు మఠం నుండి సమాచారం అందింది.  ఆలస్యం చేయకుండా వెంటనే మఠానికి వెళ్ళాను. కానీ అది అంత సులభం కాదు. నన్ను వేచివుండమని చెప్పారు.

నాలుగు గంటల తరువాత స్వామివారు నన్ను కలవడానికి ఒప్పుకున్నారు.  నిరీక్షించిన క్షణం వచ్చింది. శరీరంతో ఉన్న భగవంతుని ఎదురుగా ఉన్నాను. మేధోహంకారి, నాస్తికుడు, విగ్రహారాధనను తప్పుబట్టే ‘ఆర్థర్ కోస్లర్’, పరమాచార్య స్వామి వారిని గురించ్ఈ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.  స్వామివారితో మాట్లాడిన తరువాత, భారతదేశం మరియు జపాను గురించి అర్ధరహితంగా రచించిన ‘ది లోటస్ అండ్ ది రోబోట్’ పుస్తక వివాదాస్పద రచయిత చెప్పిన విషయం, ‘భగవంతుడు ఉన్నాడు అనుకుంటే, అది వీరే’. 

దేవతల కాంస్య విగ్రహాలలో కనబడే అద్భుతమైన ఆ చిరునవ్వుతో నన్ను ఆహ్వానించడం, ఆ చిరునవ్వు గురించి కోస్లర్ చెప్పినట్టు : “జెసస్ ఎప్పుడైనా గనక నవ్వుంటే, ఈ గొప్ప హిందూ సన్యాసిలాగా నవ్వి ఉండేవాడేమో”, పరమాచార్య స్వామివారే సంభాషణ మొదలుపెట్టారు, “ఎక్కువసేపు ఎదురుచూసావేమో? కేవలం నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాను. ఇప్పుడు హాయిగా ఉండు. నీవు నాగురించి అడిగే ముందు నేను నీ గురించి అడగాలి”  కన్నతండ్రిలాంటి ప్రేమను కురిపిస్తూ చాలా పారదర్శకంగా నా కుటుంబ వివరాలు, నా గత జీవితం, నా ఇష్టాయిష్టాలు, నా ఉద్యోగ వివరాలు, ఏవైనా ఆరోగ్య సమస్యలు, నా బాంబే జీవితం ఇలా ఎన్నో విషయాలను అడిగారు. స్వామివారు ఇప్పుడు సంభాషించడానికి ఉత్సుకతతో ఉండడంతో నా పది పేజీల ప్రశ్నలను స్వామివారి ముందుంచాను.  క్షణకాలం పాటు దాన్ని చూసి నాకు తిరిగిస్తూ, “నేను సమాధానాలు చెప్పీ ముందు ఈ ప్రశ్నలను చదువు.

నీవు ముగించిన తరువాత నేను ఒక్కోదానికి సమాధానం చెబుతాను. ఆత్రుత లేదు, తీరికగా మాట్లాడుకుందాము. నిన్ను దాదాపు ఆరు రోజులపాటు నిరీక్షింపజేయడానికి కారణం నీతో ప్రశాంతంగా, అర్థవంతమైన, ఉపయోగకరమైన చర్చ చేయాలనే స్వార్థం వల్ల మాత్రమే. ఇప్పుడు నువ్వు అడుగు, నేను సమాధానం చెబుతాను. ఫ్రెంచిలో చెప్పినట్టు ‘tête-à-tête’ దీర్ఘ సమావేశానికి సిద్ధమవుదాం” అన్నారు.  రెండు రోజులపాటు, రోజుకి అయిదు గంటల పాటు అరిస్టాటిల్ నుండి ఆదిశంకరుల దాకా, ఆస్ట్రోఫిజిక్స్ నుండి అథర్వవేదం దాకా దీర్ఘమైన చర్చ చేశాము. సమయం సరి మరి స్థలమో; ఎలుకలు, సాలెపురుగులు, బొద్దింకలు, బల్లులు ఉండే స్టోరు రూములో.  పరమాచార్య స్వామివారు ఒక బియ్యం బస్తాను అనుకుని ఒట్టి నేలపై కూర్చున్నారు. మా సంభాషణ సాగుతుండగానే దేశ విదేశాల నుండి వచ్చిన ఎందరో భక్తులు స్వామివారిని దర్చించుకుంటున్నారు, స్వామివారు అందరినీ అనుగ్రహిస్తున్నారు.  వాళ్ళందరూ వారి వారి భాషల్లో స్వామివారి ఆశీస్సులను కోరుతున్నారు. స్వామివారు కూడా ఎంతో సులభంగా వారి మాతృభాష అయిన కన్నడలో మాట్లాడినంత సరళంగా, సులభంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.  పదిహేడు భాషల్లో స్వామివారు నిష్ణాతులని సేవకులు చెప్పగా నేను ఆశ్చర్యపోయాను.  మూడు వారాల తరువాత, రెండు భాగాల నా వ్యాసం నా పత్రికలో ప్రచురణ అయ్యింది. పత్రికను శ్రీమఠానికి తీసుకునివెళ్లాను. స్వామివారి సేవకులు అప్పటికే స్వామివారికి చూపించారు.

కొద్దిగా ఇబ్బందిగా నవ్వుతూ నన్ను పలకరించి, “నీ వ్యాసం చదివిన తరువాత నేను రెండంగుళాలు పెరిగినట్టు అనిపించింది. అంత పొగడాల్సిన అవసరం లేదనుకుంటా” అని సౌమ్యంగా అన్నారు. “అలా ఏంలేదు స్వామి, మీ గురించి పాశ్చాత్య మేధావులు చెప్పినంతగా నేను చెప్పలేకపోయాను”.  అందుకు స్వామివారు, “నువ్వు ఇతర శంకర పీఠాల గొప్పదనం కూడా చెప్పివుంటే బావుండేది. నీకు తెలుసా మాకు ఎటువంటి భేషజాలు లేవు. భాగవత్పాదుల పారంపర్యం కొనసాగించడానికి మేమంతా వినియోగింపబడ్డాము. ఆదిశంకరుల ముఖ్య శిష్యుల్లో ఒకరైన వారిచేత మొదలుపెట్టబడిన ఆ మఠం గురించిన అనవసరమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించకపోయివుంటే చాలా బావుండేది. కంచి మఠం పైనున్న అధిక భక్తి వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు” అని అన్నారు. నేను తెచ్చిన వారపత్రిక ప్రతిని స్వామివారి ముందుంచి సంతకం చెయ్యమని వేడుకున్నాను. స్వామివారు ఎంతో మృదువుగా “సన్యాసులు సంతకం చెయ్యరు, నారాయణ!” అని దీవించారు.  పరమాచార్య స్వామివారికి ప్రతీ భక్తునిపైన ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. భక్తులకు మహాస్వామి వారు అత్యంత ప్రియమైనవారిగా కావడానికి కారణం స్వామివారి మేధో సంపత్తో మరొకటో కాదు, కేవలం స్వామివారి దయార్ద్ర హృదయము, మాటలకందని కరుణ, మనోహరమైన చిరునవ్వు, మాటల్లోని పారదర్శకత. స్వామివారు తమ జ్ఞానాన్ని, పాండిత్యాన్ని వారితో ఉన్న అందరితో పంచుకున్నారు.

జె. యం. కెయిన్స్ సాధారణ ఉపాధి సిద్ధాంతాన్నైనా, ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్నైనా పసిపిల్లలకు చెప్పే ఊహాజనిత కథలలా చెప్పగల సమర్థులు.  --- శ్రీ ఏ. యస్. రామన్.  అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। 

KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore