Online Puja Services

బాబా గోధుమలు ఎందుకు విసిరారు...

3.141.42.41
బాబా గోధుమలు ఎందుకు విసిరారు...
 
షిర్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కోసం, దేహానికి స్వతహాగా వుండే ఆకలిని తీర్చడం కోసం షిర్డీ గ్రామంలో బిక్షాటన చేసేవారు. ఒకసారి ఆయన షిర్డీలో బిక్షాటన చేస్తుంటే ఒక ఇల్లాలు సాయిబాబాకి ఒక రొట్టె అందించింది. తాను ఇచ్చిన రొట్టె తీసుకుని బాబా తింటారని భావించింది. అయితే ఆ ఇల్లాలు ఇచ్చిన రొట్టెను అందుకున్న బాబా దానిని అక్కడే వున్న ఓ కుక్కకు అందించారు. ఆకలిగా వున్న ఆ కుక్క ఆ రొట్టెను అందుకుని ఆబగా తినడం ప్రారంభించింది. బాబా చేసిన ఈ చర్య ఆ ఇల్లాలికి వింతగా అనిపించింది. ‘‘అదేంటి బాబా... నా దగ్గర ఉన్న ఒకే ఒక రొట్టె మీకు ఇచ్చాను. మీరు ఆ కుక్కకి దాన్ని వేసేశారు. ఇప్పుడు మీ ఆకలి ఎలా తీరుతుంది?’’ అని ప్రశ్నించింది. దానికి బాబా చిరునవ్వుతో సమాధానం ఇస్తూ ‘‘ఆ కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే’’ అన్నారు. బాబా జీవ కారుణ్యానికి తార్కాణంగా నిలిచే అనేక సంఘటనల్లో ఇది ఒకటి.
 
షిర్డీ సాయిబాబా గురించి యావత్ ప్రపంచానికి తెలియజేసిన మొదటి గ్రంథం ‘సాయి సచ్ఛరిత్ర’. దీనిని మరాఠీ భాషలో హేమాండ్ పంత్ అనే సాయి భక్తుడు రచించారు. 1916లో ఆయన ఈ గ్రంథాన్ని రాశారు. సాయిబాబాను చాలా దగ్గరగా చూస్తూ, ఆయనతో సన్నిహితంగా వుంటూ, తన ఎదుట జరిగిన ఘటనలు, భక్తులు చెప్పిన అనుభవాలు... ఇలా అన్నిటినీ క్రోడీకరించి ఆయన ఈ గ్రంథాన్ని రాశారు. అనేక భాషల్లోకి అనువాదమైన ఈ ‘సాయి సచ్ఛరిత్ర’ సాయిబాబా భక్తులకు నిత్య పారాయణ గ్రంథంగా గౌరవం అందుకుంటోంది. హేమాండ్ పంత్ అసలు పేరు రఘునాథ దభోల్కర్. సాయిబాబా ఆయన్ని హేమాండ్ పంత్ అని పిలుస్తూ వుండటంతో ఆ పేరే ఆయనకు స్థిరపడింది. హేమాండ్ పంత్ మొదటిసారి షిర్డీ సాయిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
 
ఆధ్యాత్మికాభిలాషి అయిన హేమాండ్ పంత్ సద్గురువును అన్వేషిస్తూ షిర్డీకి చేరుకున్నారు. హేమాండ్ పంత్ మొదటిసారి సాయిబాబాను దర్శించిప్పుడు బాబా తన ముందు తిరగలి పెట్టుకుని గోధుమలు విసురుతున్నారు. పక్కనే వున్న గోధుమలను తిరగలిలో పోస్తూ పిండిగా మారుస్తు్న్నారు. షిర్డీ సాయి బిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ వుంటారని హేమాండ్ పంత్ అప్పటికే విని వున్నాడు. మరి బిక్షాటన చేసే బాబా తిరగలిలో ఎందుకు పిండి విసురుతున్నాడో హేమాండ్ పంత్‌కి అర్థం కాలేదు. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన బాబాని గమనిస్తూ వుండిపోయారు.
 
ఇంతలో ఇద్దరు మహిళలు బాబా దగ్గరకి వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ వున్న గోధుమలను తీసుకుని తిరగలిలో వేస్తూ వాటిని పిండి చేయడానికి సహకరించారు. వాళ్ళూ కాసేపు తిరగలి తిప్పి ఉన్న గోధుమలన్నిటినీ పిండిగా మార్చారు. గోధుమలన్నీ పిండి అయిపోయిన తర్వాత ఆ మహిళలు... ‘‘బాబా.. బిక్షాటన చేసుకునే నువ్వు ఈ పిండిని ఏం చేసుకుంటావు.. మాకు ఇచ్చేస్తే నీకు కొన్ని రొట్టెలు ఇస్తాం’’ అన్నారు. వారి మాటలు విన్న బాబా వారిమీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ పిండి మన పొట్టలు నింపడానికి కాదు... ఈ పిండిని తీసుకెళ్ళి ఊరవతల పారబోసి రండి’’ అని గద్ధించారు. దాంతో బాబాని పిండి అడిగి పొరపాటు చేశామని అర్థం చేసుకున్న ఆ మహిళలు ఊరి చివర పారబోయడం కోసం ఆ గోధుమ పిండిని తీసుకుని వెళ్ళారు.
 
బాబా చేసిన ఈ చర్య కూడా హేమాండ్ పంత్‌కి ఎంతమాత్రం అర్థం కాలేదు. ఆ గోధుమ పిండి మన పొట్టలు నింపడానికి కాదు అని చెప్పిన బాబా, దాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చి సద్వినియోగం చేయాలి... అలా కాకుండా ఊరి చివర పారబోసి రమ్మన్నారెందుకో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. హేమాండ్ పంత్ సందేహానికి ఆ తర్వాత సమాధానం సాయిబాబాతో వుండే భక్తుల ద్వారా లభించింది. ఆ సమయంలో కలరా వ్యాధి వ్యాపించి వుంది. షిర్డీ గ్రామ ప్రజలు కలరా వ్యాధి నుంచి తమను కాపాడాలని సాయిబాబాకి విజ్ఞప్తి చేశారు. కలరా వ్యాధిని నివారించడం కోసమే బాబా తిరగలి విసిరి, గోధుమ పిండి తయారు చేసి దాన్ని ఊరి చివర పారబోసి రమ్మన్నారని అర్థం హేమాండ్ పంత్ చేసుకున్నారు. బాబా విసిరింది గోధుమలను కాదని... కలరా మహమ్మారినే పిండి చేసి ఊరి చివర పారబోయించారని అవగతం అయింది. బాబా ఏ పని అయినా ఎందుకు చేస్తున్నారో చెప్పరు.. కానీ చేసే ప్రతి పని వెనుక ఓ అంతరార్థం వుంటుందని హేమాండ్ పంత్‌కి అర్థమైంది. ఆ తర్వాత ఆయన షిర్డీలోనే స్థిరపడిపోయారు. ‘సాయి సచ్ఛరిత్ర’ రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు.
 
సమస్తలోకాన్ సుఖినోభవంతు , శుభోదయం 
 
- సత్యనారాయణ నాదెండ్ల 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore