ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే మహాదాత
దానం (కథ)
పూర్వం వారణాసిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఒక రోజు రాజుగారి ఆస్థానానికి పోతూ ఉండగా, వీధిలో ఒక తాపసి తారసపడ్డాడు. అతని ముఖంలో తేజస్సును చూసి, ధనవంతుడికి ఆ తాపసిపై గౌరవం కలిగింది.
‘‘స్వామీ! తమరు ఎక్కడికి పోతున్నారు?’’ అని అడిగాడు.
‘‘నాయనా! భిక్ష కోసం!’’ అన్నాడు తాపసి.
‘‘స్వామీ! మీరు మా ఇంటికి భిక్ష కోసం రండి’’ అని ఆహ్వానించి, తన సేవకునితో- ‘‘నువ్వు ఈ స్వామిని మన ఇంటికి తీసుకొని వెళ్ళు. అమ్మగారికి చెప్పి భిక్ష పెట్టించు!’’ అని చెప్పి పంపించాడు.
సేవకుడు తాపసిని తీసుకొని యజమాని ఇంటికి వెళ్ళాడు. ధనవంతుడు రాజాస్థానానికి వెళ్ళిపోయాడు.
తాపసికి ఆ ఇంటి యజమానురాలు గిన్నెనిండా మంచి మంచి ఆహార పదార్థాలు భిక్షగా సమర్పించింది. భిక్ష స్వీకరించిన తాపసి తిరిగి అదే దారిన తన ఆరామం కేసి వస్తున్నాడు, ధనవంతుడు కూడా రాజాస్థానం నుంచి మరలి, అదే దారిలో తన ఇంటికి వస్తూ, తాపసిని చూశాడు. అతని గిన్నెలో నిండుగా ఉన్న ఆహార పదార్థాలను చూశాడు. చూడగానే అతని మనస్సులో ఏదో భావన రేకెత్తింది.
‘ఏదో భిక్ష వేయమని పంపితే, కొద్దిగా ఆహారం వేస్తారనుకున్నాను. ఇన్ని మంచి పదార్థాలు గిన్నె నిండుగా పెడతారని అనుకోలేదు. ఈ పదార్థాల్ని సేవకులకు పెడితే వారితో మరో పూట చాకిరీ చేయించుకోవచ్చు. ఇప్పుడు వృథాగా పోయాయి’ అనుకున్నాడు.
ఆ ధనవంతుడు దానం చేద్దాం అనుకున్నాడు కానీ, దానం చేసిన తరువాత దరిద్రంగా ఆలోచించాడు. ‘దాతకు ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు!’ అని బుద్ధుడు- దాతకు ఉండాల్సిన మూడు లక్షణాలను చెప్పాడు.
దాత మనస్సు దానం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. దానం చేయాలా? వద్దా? అని ఊగిసలాడకూడదు. ఇది మొదటి లక్షణం.
ఇక రెండోది: దానం చేస్తున్నప్పుడూ దాత మనసు అంతే ప్రసన్నంగా ఉండాలి. దానం చేసే వస్తువుల విలువల్ని లెక్కించి,అవి చేయాలా? ఇవి చేయాలా? చద్దన్నం పెట్టాలా? మిగిలిపోయినవి పెట్టాలా? మంచి పదార్థాలు పెట్టాలా? అని ఊగిసలాడకుండా ఉండాలి.
అలాగే మూడో లక్షణం: దానం చేశాక కూడా మనసు అదే స్థాయిలో ప్రసన్నంగా ఉండాలి. ‘అయ్యో! అనవసరంగా చేశానే?’ అని బాధపడకూడదు.
ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే మహాదాత. ఆ లక్షణాలు మాత్రమే దానానందాన్ని ఇస్తాయి
- నాగ ఫణీంద్ర