బెంగళూరు భక్తుడు
పరమాచార్య స్వామివారు నిర్మలమైన తమ భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ కొలువుండి వారిని అనుగ్రహిస్తూవుంటారు. అలా మహాస్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్తుల్లో బెంగళూరులో ఉన్నత స్థాయి బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న యెన్. వి. సుబ్రమణియన్ ఒకరు. వారు పొందిన ఒక దివ్య లీలను ఇక్కడ చెబుతున్నారు.
1997లో కర్ణాటకలోని దావణగెరె అన్న ఊరికి బదిలీపై వెళ్లారు. పిల్లలు పాఠశాలకు వెళ్తుండడం వల్ల భార్యను, పిల్లల్ని బెంగళూరులోనే వదిలి దావణగెరెకు వెళ్ళి అక్కడే ఒక ఇంటిలో నివసించసాగారు. సెలవు రోజుల్లో భార్యా భర్తలు బెంగళూరు, దావణగెరె ప్రయాణాలు చేస్తుండేవారు.
ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రమణియన్ బెంగళూరు వెళ్లాడు. బంగారు మరియు వెండి వస్తువులు దావణగెరెలోని ఇంటిలోనే ఉండడం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తన స్నేహితునికి చెప్పాడు. దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పగులగొట్టి దొంగలు ఇంట్లో జొరబడ్డారు. పక్కింటి యువతి అటుగా వెళ్లినప్పుడు ఇల్లు తెరిచివుండడం గమనించి సుబ్రమణియన్ కు ఫోన్ చేసింది. నిర్ఘాంతపోయిన సుబ్రమణియన్ దంపతులు వెంటనే దావణగెరెకు బయలుదేరారు. ఇల్లంతా చల్లాచెదురై ఉండడంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంతా పోయిందేమోనని బాధపడ్డారు.
తీరా అన్నీ సర్దిన తరువాత చూస్తే, విలువైన వస్తువులు ఏమీ పోలేదని తెలిసింది. కేవలం టార్చి, చాకు మాత్రమే పోయాయి. వజ్రపు చెవికమ్మలు అలమరాలో ఉంచి, తాళంచెవులు కూడా అక్కడే వదిలేశారు. పూజగదిలో ఉన్న వెండి సామాను మొత్తం అలాగే ఉంది. దాదాపు పది లక్షల రూపాయల విలువైన వస్తువులను అలాగే వదిలివెళ్లిపోయారు. సుబ్రమణియన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదు అని సంతోషించారు.
రెండు నెలల తరువాత కర్ణాటకలోని సోదె శ్రీ వాదిరాజ తీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు, అక్కడి అర్చకులు రాఘవేంద్రాచార్ భవిష్యత్తు చెప్పడం విన్నారు. సుబ్రమణియన్ ఇంటిలో దొంగతనం జరిగిందని, ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు. ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు కంచి మహాస్వామి వారే చెప్పాల్సిన అవసరం లేదు కదా.
2003లో జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రమణియన్ కు ఇరవైఅయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జె.పి. నగర్ కు బదిలీ అయ్యింది. దాంతో ప్రతిరోజూ యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సివచ్చింది. దార్లో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టతరమై ఇదొక విపత్కర సమయం అయ్యింది. అంత దూరం ప్రయాణం చెయ్యాలన్న తలంపే మానసికంగా అలసిపోయేలా చేసింది. ఆ బదిలీ ఉత్తర్వు ఎలాగైనా నిలిచిపోవాలని పరమాచార్య స్వామివారిని వేడుకున్నాడు. అప్పుడే స్వామివారు తమ లీలను చూపించారు. కొత్త స్థలంలో ఉద్యోగంలో చేరక ముందే బదిలీ ఉత్తర్వు రద్దయి ఇంటికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక శాఖకు బదిలీ అయ్యింది. ఆ బ్యాంకు చరిత్రలో ఇది నిజంగా అద్భుతమే. మహాస్వామివారి ఇటువంటి దివ్య లీలలు కోకొల్లలు.
అదేవిధంగా సుబ్రమణియన్ ను పరమాచార్య స్వామి వారివైపు నడిపిన సేలం శ్రీ రాజగోపాల్ గారికి కూడా ఇటువంటి ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బెంగళూరులోని కాఫీ బోర్డు లేఅవుట్ లో రాజగోపాల్ ఒక కొత్త ఇల్లు కట్టాడు. నీళ్ళ కోసం 285 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీటి జాడ కనబడలేదు. కనీసం నీటి తడి కూడా కనబడక కేవలం రాళ్ళు మాత్రమే ఉండడంతో సేలంలోని ఇంటిలో ఉన్న మహాస్వామివారి పాడుకలకు పూజ చేయించి ప్రార్థించారు. ఆదేచోట మరొక అయిదు అడుగులు తవ్వగానే నీరు పైకెగసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।