దీపం చెప్పిన జీవిత సత్యం
దేవుడు మూడు దీపపు కుందులు తయారు చేసి, అందులో ఒకే ప్రమాణం గల నూనెను పోసి
అన్నిటికీ ఒక్కొక్క వత్తిని ఇచ్చాడు**
అన్ని దీపాలు తమ జ్యోతిని వెలిగించుకున్నాయి. అలా కొంతకాలం గడిచింది. తర్వాత అందులో ఒక దీపం మరొక వత్తిని వేసుకుంది. వెంటనే వేరే దీపాలు అది చూసి నవ్వుకుంటూ "నీకేమైనా పిచ్చా ఇలా చేస్తే నీ జీవితకాలం తగ్గిపోతుంది అన్నాయి".
వెంటనే ఆ దీపం "పర్వాలేదు ఒక వత్తి తో పెద్దగా వెలుగును ఇవ్వలేక పోతున్నాను. ఇప్పుడు కొంత ఎక్కువ దూరం వెలుగును ఇవ్వగలను" అంది .
అది విని మిగతా దీపాలు మనసులో "ఇది చాలా అమాయకమైనది. నూనె తగ్గి తొందరగా ఆరిపోతుంది" అనుకున్నాయి.మరి కొంత సమయం తర్వాత మరో రెండు కొత్త వత్తులను ((నూనెను తక్కువగా పీల్చేవి)) ఆ దీపం తనలో వేసుకుంది. ఇప్పుడు ఆ దీపం కాంతి నలుదిక్కుల వ్యాపించింది .
దీంతో మిగతా దీపాలు "దీనివల్ల మా కాంతి ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది" అంటూ కుళ్ళు కుంటున్నాయి. దీంతో ఎక్కువ కాంతినిచ్చే దీపం కాంతి లో వివిధ రకాల పనులు చేసుకుంటున్నా వారు తక్కువ కాంతినిచ్చే మిగతా దీపాలను ఆర్పేసి వాటి నూనెను మొదటి దీపం లో కలిపేశారు.
నీతి:: జీవితం సాఫీగా సాగుతోంది కదా అని కూర్చోకుండా ఎప్పటికప్పుడు మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ,కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే ఆ దీపంలాగే మన జీవితం కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. లేకపోతే మిగతా దీపాల లాగా మన జీవితం కూడా కనుమరుగై పోతుంది.
- కృష్ణవేణి శఠగోపన్