మనస్సును కట్టి వేయాలి
మహర్షి ఇలా సెలవిచ్చారు ...
ఒక ఆవు పొరుగు పొలాల్లో పడి దొంగగా గడ్డి మేస్తుంది అనుకొందాం. ఈ చాటుమాటు అలవాటు ఒక మాత్రాన పోయేదికాదు.
ఆవును కొట్టంలోనే ఉంచాలి. బలవంతంగా కట్టి పడవేసినా, దొంగమేతకై అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొట్టంలోనే కట్టివేసి మేతవేసినా మొదట కొద్దికొద్దిగా గడ్డికొరికినా, ఎప్పుడెపుడు వీలవునా, పరుగెడుదామా అనే దాని ఆశ.
రెండోరోజు కూడా రెండు మూడుసార్లు మేస్తుంది. ఇట్లా రోజు రోజుకూ మేత హెచ్చుతూపోయి, చివరకు దొంగమేత అలవాటు తప్పిపోతుంది.
అప్పుడు కట్టు విప్పివేసినా, పొరుగువారి పొలాల వైపు వెళ్లదు. కొట్టంలో దాన్ని పట్టి కొట్టినా సరే, అది అక్కడే ఉంటుంది. మన మనసూ కూడా అలాగే.
మన గత జన్మల వాసనల చేత మన ఆలొచనలు మన మనస్సును బాహ్యానికి పారిపోవడం అభ్యాసం చేయించింది . లోన వాసనలు ఉన్నంతవరకు అవి బయటకు రానే రావలెను ; చివరకు నశించి పోవలెను.
ఈ ఆలోచనలన్నీ ఒక దండలాగా గ్రుచ్చినదే మనస్సు. ఆలోచనలు ఆత్మనుంచి వచ్చి, ఒదిగి ఆత్మలోనే స్థిరపడితే, మనస్సు మాయమౌతుంది. అప్పుడు ఆనందానుభవం లభిస్తుంది.
అంతకు ముందు ఆలోచనలను ఆపివేయటం ఎంతకష్టమో, ఈ స్థితిలో ఆలోచనలను చేయడం అంతే కష్టం.