Online Puja Services

తత్వమసి అంటే ఏమిటి ?

3.144.115.125
తత్‌.. అంటే అది, 
త్వం అంటే నీవై, 
అసి అంటే ఉన్నావు. ‘
అది నీవై ఉన్నావు’ 
అనేది తత్వమసి వాచ‌కానికి అర్థం. 
 
పెద్దలు కనపడితే నమస్కరించి, చిరునవ్వుతోనే పలకరిస్తాం. ఇది మన హిందూధర్మానికి 
మాత్రమే సొంతమైన విశిష్ట ఆచారం. మన పెద్దలు ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారో? ఎప్పుడైనా ఆలోచించారా? వారు ఏం చేయించినా అందులో నిగూఢమైన వైదిక , ఉపనిషత్, పురాణ వాజ్ఞ్మయ సారంతో ముడిపడే ఉంటుంది.
 
రెండు చేతులు జీవాత్మ-పరమాత్మలకు సంకేతం. ఆ రెండూ కలవడం...జీవాత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అదే మన జీవిత కాలపు లక్ష్యం. ఎదుట ఉన్న వ్యక్తులకు నమస్కారం చేసేటప్పుడు ,రెండు చేతులను ఒకదానికొకటి ఎదురెదురుగా కలుపుతాం. అంటే నీలోని ఆత్మ , నాలోని ఆత్మ ఒక్కటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి, మనకి భేదం లేదని, మనమంతాఒక్కటే అని చెప్పకనే చెబుతాం. 
 
అంతా ఒక్కటిగా మెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ "నమస్కారం. మరి దీనికి మూలం.. సామవేద అంతర్గత
 చాందోగ్యోపనిషత్ సారమైన "తత్వమసి" అనే మహా వాక్యం.
ఈ మహా వాక్యాన్ని అర్థం చేసుకొనే శక్తి కలియుగంలో మానవులకు ఉండదని, దాని పరమార్థాన్ని "నమస్కారం" అనే సంకేతం ద్వారా వారికి తెలియకుండానే ఆచరింపజేశారు. అయితే ఈ వాక్యం శబరిమలలోని అయ్యప్ప ఆలయం ముందు రాసి ఉంటుంది. 41 రోజుల కఠోర దీక్షచేసి, పవిత్రమైన ఇరుముడిని శిరస్సును పెట్టుకుని, పావన పదునెట్టాంపడి ఎక్కగానే భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో స్మామికి నమస్కరించే ముందే, నమస్కారానికి మూలమైన ‘తత్వమసి’ మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని దీని అర్థం.
 
‘తత్వమసి’ అనేది సంస్కృత పదం. తత్‌+ త్వం +అసి అను మూడు పదాల కలయికే ‘తత్వమసి’,
 
తత్‌.. అంటే అది, 
త్వం అంటే నీవై, 
అసి అంటే ఉన్నావు. ‘
అది నీవై ఉన్నావు’ అనేది తత్వమసి వాచ‌కానికి అర్థం. 
 
మాలధరించి, మండల కాలం పాటు దీక్షచేసి, కొండ కోనలు దాటి పావన పదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మ తత్వాన్ని చూడాలని వచ్చావో ‘అది నీవై ఉన్నావు’ ‘నీలోనే పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు’ అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధ‌ను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్‌ ప్రబోధ‌మే ‘తత్వమసి’. అందుకే పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు. అంచెలంచెలుగా, మెట్టుమెట్టుగా ఒక్కొక్క సంవత్సరం కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల లాంటి ప‌ద్దెనిమిది అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే.. కొన్నాళ్లకు ‘తత్వమసి’ పరమార్థం ప్రతి ఒక్కరికీ సాక్షాత్కరిస్తుంది.
 
ప్రవీణ్ 
 
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore