Online Puja Services

వినాయకుడు గణాధిపత్యం సాధించుట

18.221.93.167
గణపతి  వైభవం:-3
 
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
 
సమస్త గణములను పాలించేందుకు, నడిపించేందుకు మాకో అధిపతి కావాలి, అందుకు తగినవాడిని మీరే చూడాలి అని కోరారు. చాలా పుస్తకాల్లో విఘ్నాధిపత్యం అని ఉంది,4 కానీ వినాయకుడు దేవతాగణాలతో, రుద్రగణాలతో పొరాడి, శివుడి త్రిశూలానికి తలతెగి క్రింద పడిన తరువాత, ఆయన శక్తియుక్తుల్ని చూసి, దేవతలు వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారు. కనుక అప్పుడు ఉమాపుత్రుడు విఘ్నేశ్వరుడయ్యాడు. కానీ దేవతలు ఇక్కడ గణాధిపత్యం గురించి అడిగారు.  సృష్టి, స్థితి, లయ కారకులు బ్రహ్మావిష్ణుమహేశ్వరులు. బ్రహ్మ పంచభూతాలకు,సృష్టి కి ఆధారమైన గణాలకు అధిపతి, విష్ణువు ఇంద్ర, అగ్ని, వరుణ మొదలైన అష్టదేవతలకు, వారి అనుచరులకు, ఆయా గణములకు అధిపతియై పోషణమును చేస్తున్నాడు, శివుడు లోకాలను సహరించు రుద్ర గణాలకు, భూతప్రేతపిశాచాది గణాలను నియంత్రిస్తూ విశ్వమును నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురి బాధ్యతను స్వీకరించి, సమస్త గణాలను అదుపాజ్ఞాల్లో ఉంచేవాడు గణాధిపతి కాగలడని చెప్పిన పరమశివుడు, మీలో ఎవరు సమర్ధులో చెప్పండి అన్నారు దేవతాగణాలతో. ఇంత పెద్ద బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం కష్టమని ఎవరూ ముందుకు రాలేదు. ఇంతలో అక్కడికి కుమారస్వామి తన మయూరవాహనం మీద వేగంగా వచ్చి, వాహనం దిగి శివపార్వతులకు నమస్కరించి కూర్చున్నాడు. అక్కడున్న కొన్ని గణాలు కుమారస్వామికే గణాధిపత్యాన్ని ఇవ్వాలని జయజయధ్వానాలు చేశారు.
 
 ఇంతలో తన ఎలుక వాహనం మీద గణపతి చేరుకుని, సభాసదులందరికి నమస్కరించాడు. అంతే, అందరూ విఘ్ణేశ్వరుడే గణాధిపత్యానికి తగినవాడని జయము జయము అంటూ అరిచారు.  కుమారస్వామి వైపునున్న సైన్యం 'మా స్వామిని జయించిన వారు ఆ ఆధిపత్యమును స్వీకరించవచ్చు' అని చెప్పగా, గణపతి వైపు ఉన్న శక్తులు గణపతిని సమర్ధిస్తూ, రుద్రగణాలను, దేవేంద్రాదిదేవతాగణాలను చితగొట్టిన ఘనులు మా ప్రభువైన విఘ్నేశ్వరుల వారే. ఎందరో రాక్షసుల పీచమణిచారు. వారికి సమానామైన వారు ఎవరైనా ఉన్నారా? అంటూ గణపతికే ఆధిపత్యం ఇవ్వమని చెప్పారు.
 
వారి వాదనలని విన్న శివుడు వారితో చిరునవ్వుతో ' పిల్లలారా! మీలో ఎవరూ ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకి వస్తారో వారిని గణాధిపత్యానికి అర్హులుగా నిర్ణయించి, వారికా ఆధిపత్యాన్నిస్తాను. వెంటనే బయలుదేరండి' అని పలికాడు. ఆ మాటలు వినీ వినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పనిమీద రివ్వున బయలుదేరాడు. కూమారస్వామి వాహనం నెమలి, చాలా వేగంగా వెళుతుంది, ఎగరగలదు. గణపతి వాహనం చిన్న ఎలుక, ఎగరలేదు, గణపతి పెద్దవాడు. వెంటనే గణపతి ఏమాత్రం దిగులు చెందకుండా తాపీ
గా నడుచుకుంటూ తన తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి, చేతులు జోడించి నమస్కరించి "జననీజనకులారా ....... ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే, వారు ముల్లోకల్లోని మూడుకోట్ల యాభైలక్షల పుణ్యతీర్ధాల్లో స్నానం చేసిన పుణ్యం  పిందుతారని వేదశాస్త్రాలు ఘోషితున్నాయి. కనుక వేదమూర్తులు, నా తల్లిదండ్రులైనమీ చుట్టు ప్రదక్షిణం చేస్తున్నానని మూడు ప్రదక్షిణలు చేశాడు. చెప్పి గణపతి మూడు ప్రదక్షిణలు చేయగా, కుమారస్వామి 3 లోకాల్లో నదికి వెళ్ళినా, ప్రతి నది దగ్గర గణపతి తనకంటే ముందు స్నానం చేసి, వెళ్ళిపోవడం చూశాడు.
                                                    
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళినా, గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరి స్నానం కూడా పూర్తిచేసి, ఎంతో ఆశ్చర్యంగా కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరికి వెళ్ళెసరికి గణపతి కనిపించాడు. అప్పుడు షణ్ముకుడు పశ్చాత్తాపంతో ' నాన్నగారూ! అన్నగారి మహిమనాకు తెలియలేదు. నన్ను అహం కమ్మేసింది. అందుకే అలా ప్రవర్తించాను. నాకు అన్నగారే ఒకప్పుడు మయూరవాహనం ఇచ్చారు. బుద్ధిలో అన్నయ్యే నాకంటే అధికం.. నా కన్నా అన్నయ్యే అన్ని విధాలా సమర్ధుడు కనుక గజాననుడినే గణాధిపతిని చేయండి' అన్నాడు.
 
ఈ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి గణాధిపత్యం వేడుకని జరిపించాడు. ఈ వృత్తాంతం ద్వారా గణపతి లోకానికి తల్లిదండ్రుల విలువను చాటి చెప్పారు. తల్లిదండ్రులే సమస్త పుణ్యతీర్ధాలు, వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులను వదిలి, ఎవరు తీర్ధయాత్రలు చేస్తారో, వారు పుణ్యం పొందకపోగా, అతిమకాలంలో నరకానికి వెళతారని శాస్త్రం చెప్తోంది. మన ముందు కనిపించే దైవస్వరూపాలు తల్లిందండ్రులు. అందుకే వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణంతో మహాగణపతి అయినాడు.
 
అట్లాగే ప్రతీసారీ కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలని చెప్తుందీ  వృత్తాంతం.  కష్టాలను బుద్ధిబలంతో ఎదురుకున్నవాడే అసలైన ప్రజ్ఞావంతుడని కూడా  చెప్తున్నదీ వృత్తాంతం.
 
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
 
కంటిన్యూ...
 
ఓం గణాధిపతయే నమః
 
- L. రాజేశ్వర్ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore