మహాలయ పక్షం - పితృదేవతలు
పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.
ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు. 'యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్' అని వాక్యం. మహతామ్+ ఆలయం= మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును.
దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది.
ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.
భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ ఉంటారు. కావున మహాలయ పక్షాలలో వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంగా 'కారుణ్యపితరులు'గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం మంచిది. * దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు. * 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు.
3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి. * 1. పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారినాహ్వానించి) తర్పణం చేయాలి.
2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.
వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి. పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.
మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు.
మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి. మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.
ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం. భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ కర్మకాండల వల్ల ముందు తరాల వారి గురించి జీవిత విశేషాలు తెలుస్తాయ. వారి నడవడి తెలుస్తుంది.
కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం అంటేనువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడంమన విద్యుక్త ధర్మం! తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెల్పడం మన కనీసధర్మం.
కనుక ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సర్వ శ్రేయస్కరం! కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా? అని కొంతమంది సందేహాన్ని వెలిబుచ్చుతుంటారు. 'దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం' అంటుంది శాస్త్రం.
అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. కనుక కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది శాస్త్రం చెప్పలేదు. కనుక ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కేవలం వారిని స్మరించుకోవడమే! కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలను శ్రద్ధతో ఆచరించడం కనీస మానవ ధర్మం. తర్పణవిధులను అందరం ఆచరించి ధర్మాన్ని కాపాడుదాం.
- కృష్ణవేణి శఠగోపన్