Online Puja Services

( గణపతి వైభవం -1)

18.224.52.108
( గణపతి వైభవం -1)
 
ఓం గం గణాధిపతయే నమః 
 
ఓం గురుభ్యోనమః 
 
విఘ్నేశ్వరుడి  నామాలు
 
ఓం సుముఖాయ నమః,
 
ఓం ఏకదంతాయ నమః,
 
ఓం కపిలాయ నమః,
 
ఓం గజకర్ణాయ నమః,
 
ఓం లంబోదరాయ నమః,
 
ఓం వికటాయ నమః,
 
ఓం విఘ్నరాజాయ నమః,
 
ఓం ధూమకేతవే నమః,
 
ఓం గణాధ్యక్షాయ నమః,
 
ఓం ఫాలచం ద్రాయ నమః,
 
ఓం గజాననాయ నమః
 
ఓం వక్రతుండాయ నమః,
 
ఓం శూర్పక ర్ణాయ నమః,
 
ఓం హేరంభాయ నమః,
 
ఓం స్కందపూర్వజాయ నమః,
 
ఓం గణాధిపతయే నమః. 
 
 
 
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్ 
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపము కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్  
 
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము. ఈ భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు గజాననునికి విఘ్నాదిపత్యంబొసంగబడియెను. అందువలన ఈ స్వామి శుభాశిస్సులకై  ప్రతి సంవత్సరం ఈ  రోజున మనం ఈ  పండగ జరుపుకొంటాము. గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యము తలపెట్టము. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నాడు.  ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు  నిర్విఘ్నముగా నెరవేరుతాయి. విఘ్ననిర్మూలనముకై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్య మూర్తియై నిలిచాడు. 
 
ప్రశ్న:-
 
అసలు ఈ గణపతి ఎవరు - ఈ  గణాధిపత్యం అంటే ఏమిటి.?
 
 సమాధానము:-
 
ఓం గణానాం త్వా గణపతిగ్o  హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!
జ్యేష్టరాజం బ్రహ్మణాo  బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !
మహాగణపతియే  నమః ।। ఓం ॥ 
 
గణపతి సర్వవిద్యాధి దేవతగా, వేదకాలమునుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత , వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై  శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు.  "గ" శబ్దం బుద్దికి "ణ " శబ్దం జ్ఞానానికి ప్రతీక. 
సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరించబడేదే  "ఓంకారము  " అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము " లో వర్ణించారు.  గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు  - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి ".  అంతేకాకుండా "బ్రహ్మణస్పతి " అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.
 
గణపతి విష్ణుస్వరూపుడు :
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే !
 
ఇక్కడ వినాయకుడు "విష్ణుం" అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబదినాడు. విష్ణుం అంటే సర్వవ్యాపకుడు, స్థితి కారకుడు. అంతేకాకుండా క్షీర సాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీ మహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.  
సృష్టి ఆది లో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది.  ఇంకా మనుషులే పుట్టకముందుఅన్నమాట . అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది . ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయకకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం. 
 
గణేశుని (4) అవతారాలు:-
గణేశ  పురాణం ప్రకారం గణేషుడు (4) అవతారాలుగా ఆవిర్భవిస్తాడని అవి (4) యుగాలలో ఒకొక్క యుగానికి ఒకొక్క అవతారం గా చెప్పబడ్డాయి.
 
1. మహోత్కట వినాయక : - 
ఈయన  కస్యపప్రజాపతి - అదితి ల కొడుకుగా కృత యుగంలో అవతరించారు. పది చేతులతో, ఎఱ్ఱని శరీర ఛాయతో సింహ వాహనుడై -- నరాంతక, దేవాంతక అనే రాక్షసులని సంహరించినట్లు చెప్పబడింది.
 
2. మయూరేశ్వర వినాయక :- 
 
ఈయన శివపార్వతుల కొడుకుగా త్రేతాయుగం లో అవతరించారు.  ఆరు చేతులతో, తెల్లని ఛాయతో, నెమలి వాహనంగా సిన్దురాసురుడు మొదలైన రాక్షస సంహారం కావించాడు.
 
3. గజానన వినాయక :-
 
ఈయన శివపార్వతుల కొడుకుగా ద్వాపరయుగం లో అవతరించారు. ప్రస్తుత మన విఘ్న వినాయకుడు ఈయనే.  ఎర్రని శరీర చాయతో, నాలుగు బాహువులతో, మూషిక వాహనముతో. కుడివైపు రెండు చేతులలో  ఏక దంతమును,  అంకుశమును ధరించి,  ఎడమ వైపు రెండుచేతులతో పాశమును,
 మోదకమును ధరించి గజవదనంతో, తొండము కుడివైపు వంపుతిరిగి ఉండును. 
 
4. ధూమ్రకేతు వినాయకుడు :-
 
ఈయన బూడిద రంగులో, నాలుగుచేతులతో, నీలంరంగు గుర్రం వాహనంగా, కలియుగాంతంలో, విష్ణుమూర్తి, కల్కి అవతారంలో అవతరించినప్పుడు, ధూమ్రకేతు వినాయకుడు కూడా అవతరిస్తాడు.
 
మూలాధార స్థితుడు గణపతి --- 
"త్వం మూలాధార స్తితోసి " అని శ్రుతి చెప్పే రహస్యం :-
కల్పాదిలో విష్ణు నాభి కమలంనుంచి ఉద్భవించిన బ్రహ్మగారికి, విష్ణుమూర్తి సృష్టి భాద్యతను అప్పచెప్పారు.  కాని ఎలా చెయ్యాలో చెప్పకుండా యోగనిద్రలోకి వెళ్ళిపోయారు.  బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక చాల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని సృష్టి ప్రారంభించారు. ప్రారంభంలో జీవకోటిని, ముఖ్యంగా మానవుల్ని సృజించటం లో కొంత తికమక పడటం జరిగింది, అప్పుడు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ఆయన మహాగణపతిని ప్రార్ధించమని చెప్పారు. బ్రహ్మ, మహాగణపతిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమై " మూలాధరమనే చక్రాన్ని సృష్టించు, అక్కడనుండి సహస్రార కమలందాక నిర్మాణం చెయ్యి.  ఆ మూలాధారచక్రంలో నేను అధిస్టానదైవం గా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను కలుగచేస్తాను అని చెప్పారు.
 
శరీరంలోని షట్చక్రములలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రము "మూలాధార చక్రం".  ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు.దీనిలో ఇంకో రహస్యం  కూడా ఉంది. "మహాశక్తి " అయిన పార్వతీదేవికి "ద్వారపాలకుడుగా "గణపతిని పెట్టినట్టు మనపురాణగాధ, దీనిలో అంతరార్ధం ఏమిటంటే -- మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో నిద్రిస్తూ ఉంటుంది అని, ఈ కుండలిని శక్తి యే  మహాశక్తి  -- అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి  ప్రవేసించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు.  అనగా గణపతి భీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే  శక్తిని మేల్కొలుపుట సాధ్యపడుతుంది. 
 
      మూలాధారంలో మేల్కొన్న కుండలినిశక్తి "ఇడ " "పింగళ " నాడులద్వార షట్చక్రములను భేదించి సహస్రారం చేరుతుంది. యోగికి "సిద్ధి" "బుద్ధి" కలుగుతుంది.  ఈ బుద్ది, సిద్ది -- ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి.  
 
కంటిన్యూ...తరువాయి భాగం next post లో..
 
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం.
 
ఓం మహా గణాధిపతయే నమః </div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved