భగవంతుని పరీక్ష - భక్తుని సేవ
అతను ఆరవ గ్రేడులో ఉండగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జరిగిన కాల్పుల్లో రెండు కళ్ళకు దెబ్బ తగిలింది. రెండు సంవత్సరాలు ముడుమలైలో పరారీలో ఉన్నాడు. దాంతో మొత్తంగా చూపు కోల్పోయాడు. భరింపరాని శోకం పొందినవాడై 1950లో మొట్టమొదటిసారి పరమాచార్య స్వామివారిని దర్శించాడు దేవకొట్టై జమిందారు అయిన నట్టుకొట్టై చెట్టియార్ తో కలిసి. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన.
“శంకరా! కేవలం నువ్వు సేవ చెయ్యాలనే సంకల్పంతోనే ఈశ్వరుడు నీకు ఈ పరీక్ష పెట్టాడు. నీ సేవను కొనసాగించు. ఇక నీకు ఈ మనోవేదన ఉండదు” అని అనునయించారు. ఇన్నేళ్ళుగా తనలో ఉన్న ఈ బాధ అంతా మహాస్వామివారి మాటలవల్ల తొలగిపోయింది. మనస్సుకు ఎంతో ప్రశాంతత కలిగింది.
తరువాత అతను చక్కగా తమిళాన్ని నేర్చుకుని శైవ, వైష్ణవ తమిళ సాహిత్యాన్ని మొత్తం ఆకళింపు చేసుకుని వాటిని పిల్లలకు బోధించడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైనడి అరుణగిరినాథర్ల “కందర్ అనుభూతి”. అతని బంధువుల్లో ఒకామె అతణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. శంకర అయ్యర్ పల్లెలు పట్టణాలు తిరుగుతూ చిన్న పిల్లలతో భజనలు చేస్తూ గడపడం ఆచారంగా పెట్టుకున్నాడు. చిన్న చిన్న నాటికలు కూడా వేసేవాడు. పిల్లలకు పరిక్షలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చేవాడు. ఆ పరీక్షల్లో ఇతర మతస్థుల పిల్లలు కూడా పాల్గొనేవారు.
అతను చేస్తున్న తమిళ భాష సేవకు గాను “వంతోందర్” అన్న బిరుదును ప్రసాదించారు క్రిపానంద వారియర్. పరమాచార్య స్వామివారిని కలిసిన ప్రతిసారి తేవారం, తిరువాచకం, తిరుక్కురళ్ గురించే ఎక్కువగా సంభాషణ జరిగేది. ఎవరైనా మహాస్వామి వారి గురించి చెబితే మహదానందంతో కళ్ళ నీరు పెట్టుకునేవాడు. “తమిళ సాహిత్యం పరమాచార్య స్వామివారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు” అని ఆశ్చర్యపోయేవాడు.
ఇప్పుడు అతనికి డెబ్బైఆరు సంవత్సరాలు. డెబ్బై ఏళ్ళపుడు ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల నీకు మరలా చూపు వచ్చే అవకాశం ఉనది అని అతని మిత్రులు చెబితే, “పరమాచార్య స్వామివారి అపార కరుణ వల్ల ఇంతకాలం కళ్ళు లేకపోయినా చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కంటి చూపు తెచ్చుకుని నేను కొత్తగా పొందేదేముంది?” అని తిరస్కరించేవారు. 1958లో పరమాచార్య స్వామివారు చెన్నైలోని మైలాపూర్ సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు దేవకోట్టై జమిందారుతో కలిసి విశ్వరూప దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. అప్పుడు మహాస్వామి వారు ఉదయం పూట కాష్ట మౌనంలో ఉంటున్నారు. కాని వీరిరువురూ రాగానే అందరిని ఆశ్చర్యపరుస్తూ, “రా శంకరా! వచ్చి ఇక్కడ కూర్చో” అని అన్నారు.
సాయింత్రం దీప నమస్కారం అయిపోయిన తరువాత స్వామివారు, “ఉదయం నేను మౌనాన్ని వీడి మాట్లాడినందుకు మీకు అందరికి ఆశ్చర్యం కలిగింది కదూ! కాని ఎందుకు అని ఎవరికీ తెలియదు. నన్ను ఉదయం పూట చూసి మీరందరూ చాలా సంతోషిస్తారు. కాని కళ్ళు లేని ఈ శంకరం నన్ను చూడలేడు కదా. అందుకే నా స్వరం విని అయినా సంతోషిస్తాడని అలా చేశాను” అన్నారు.
--- వంతోందర్ శంకర అయ్యర్, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।