Online Puja Services

దైవలీల

18.221.192.248

జీవిత సమరంలో ఓటమి సంభవించినప్పుడల్లా, దానికి కారణాన్ని ‘విధి’ పైకి నెట్టి కొంత ఓదార్పు పొందుతాడు మనిషి. అదే పోరాటంలో విజయం లభించినప్పుడు- దేవుడు చల్లగా చూశాడని చెబుతాడు. 

ఒక చెక్కపెట్టెకు తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు యజమాని. ఆ పెట్టెలోకి ఒక పాము ముందే దూరి ఉందని అతడికి తెలియదు. ఇంతలో ఎలుక ఒకటి ఆ పెట్టెలో ఏదో వాసన వస్తోందని గుర్తించింది. దాన్ని ఎలాగైనా తినాలని ఉవ్విళ్లూరుతూ తన పదునైన పళ్లు, కాలిగోళ్లతో గీకింది. ఎంతో కష్టపడి పెట్టెకు కన్నం పెట్టి, చటుక్కున లోనికి దూరింది.అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న పాము ఆ ఎలుకను గుటుక్కున మింగింది. 

ఎలుక చేసిన కన్నం ద్వారా బయటకు వెళ్లింది. 
అంతకుముందు, పాము నోటికి చిక్కిన ఎలుక తన తెలివితక్కువతనాన్ని తిట్టుకుంది. అప్పటివరకు బయటపడే మార్గం కనిపించని పాము- తన పరిస్థితికిభగవంతుణ్నినిందించింది.అంతలోనేఎలుక రూపంలో ఆహారం లభించింది. బయటపడే మార్గమూ కనిపించింది. అదృష్టమని పాము పొంగిపోయింది.ఇంటికి తిరిగివచ్చిన యజమాని అక్కడి పరిస్థితి గమనించి ‘దేవుడా! నేనే పెట్టె తీసి ఉంటే, నా ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. ఎలుక రూపంలో వచ్చి నన్ను ఇలా కాపాడావా?’ అని పదేపదే దైవస్తుతి చేశాడు. విధి లీల! 

ఇదే విషయాన్ని భారతం వివరంగా తెలియజేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం పరిసమాప్తమైంది. ధర్మరాజు చక్రవర్తి అయ్యాడు. గాంధారీ ధృతరాష్ట్రులు ఆయన ఆదరణలో జీవిస్తున్నారు. ఒకరోజు భీముడు ‘ఈ బాహువులతోనే ఆ దుష్ట కౌరవులందర్నీ వధించాను’ అని మిత్రులతో అనడం ధృతరాష్ట్రుడి చెవిన పడింది. ధర్మజుడితో ఆయన- ‘నా తప్పుల వల్లనే ఆత్మీయులందర్నీ పోగొట్టుకున్నాను. కృష్ణుడు, సంజయుడు, వ్యాసుడు వంటి విజ్ఞుల మాటలు వినలేదు. రాజ్యం పాండవులకు ఇవ్వకుండా పుత్రప్రేమతో పెద్ద తప్పు చేశాను. ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి. నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇప్పుడు అనుకుంటున్నాను. అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకోవడానికి నువ్వు అనుమతించాలి’ అన్నాడు. 
అప్పుడు ధర్మరాజూ శోకించాడు.‘మాకు తల్లి, తండ్రి, గురువు అంతా నువ్వే. ఈ రాజ్యమంతా నీదే. మాకు దుర్యోధనుడిపై కోపం లేదు. నీకు శుశ్రూష చేసేందుకు మేం కూడా అరణ్యాలకు వస్తాం’ అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ తరవాత కృపుడితో, సంజయుడితో మాట్లాడాడు. ధర్మరాజుకు నచ్చజెప్పాలని వారిని కోరాడు. 

ఉపవాసాల వల్ల ధృతరాష్ట్రుడు స్పృహతప్పి పడిపోయాడు. ధర్మరాజు చల్లటి నీళ్లు తెచ్చి, ఆయన ముఖంమీద చల్లి, గుండెలపై నిమిరాడు. ఆయన కోలుకొని, ధర్మరాజు తలపైన ముద్దుపెట్టుకున్నాడు. ‘ముందు మీరు భోజనం చేయండి. తరవాత ఆలోచిద్దాం’ అన్నాడు ధర్మజుడు. ‘నువ్వు అనుజ్ఞ ఇస్తేనే భుజిస్తాను’ అని పట్టుపట్టాడు ధృతరాష్ట్రుడు. వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ‘ధర్మజా! ధృతరాష్ట్రుడు వృద్ధుడు,నిరంతరం దుఃఖిస్తూ ఉంటాడు. గాంధారీ అంతే.

ఇక్కడ ఉంటే వారు అసంతృప్తితోనే మరణిస్తారు. అందువల్ల వారు కోరుకున్నట్లుగా అరణ్యానికి వెళ్లనివ్వు’ అని వ్యాసుడు నచ్చజెప్పాడు. ధర్మజుడు అంగీకరించాడు. ధర్మరాజు వీపును ప్రేమగా నిమురుతూ ధృతరాష్ట్రుడు రాజధర్మాల్ని బోధించాడు. పౌర ప్రతినిధుల్ని పిలిచి ‘వృద్ధాప్యం వల్ల అలసిపోయాను. పుత్రవియోగం, ఉపవాసాల వల్ల నీరసించిపోయాను. మీరందరూ అనుమతిస్తే వనవాసానికి వెళతాను. ధర్మరాజును మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నా కుమారుల వల్ల మీలో ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించండి’ అన్నాడు. వారు శోకించారు. 

పౌరుల ప్రతినిధిగా సాంబుడు అనే జ్ఞాని ముందుకు వచ్చి ఇలా అన్నాడు- ‘ఓ మహారాజా! ధర్మరాజు పరిపాలనలో మేం సుఖంగా ఉంటాం. అంతా దుర్యోధనుడి వల్లనే వినాశనం దాపురించిందని అనుకుంటున్నావేమో? అన్నింటికీ కారణం దైవం! పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం పద్దెనిమిది రోజుల్లో నశించిందంటే- ప్రధాన కారణం మీరెవరూ కాదు. విధిలీలను ఎవరూ మార్చలేరు’ అని హితవు పలికాడు

 
-బీ. సునీత శివయ్య 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore