సూర్యుడు కర్మసాక్షి
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః.!!
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
అన్తకాలే స్వయం విష్ణుః త్రయీ మూర్తి ర్దివాకరః ||
ఏకచక్ర రథో యస్య దివ్యః కనకభూషితః
సోయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||
వాతాశ్మరీ గదార్శః త్వద్గోష మహోదర
గ్రహీణీ భగందరాఖ్యామహారుజోపిత్వ మేవహంసి॥
సూర్యుడు' అనే పదానికి ‘సువతి ప్రేరయితి జనాన్ కర్మణేతి సూర్యః' అని వ్యుత్పత్తి. ‘లోకులు వారి కర్తవ్యాలను నిర్వహించుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడు' అని అర్థం. ఈ విధంగా జగత్తును తన వెలుగుతో నడిపిస్తున్నవాడు సూర్య భగవానుడు. మహాభారతంలో ‘రోదసీ కుహరంబు రుచిరాంశుతతి జేసి, యర్కుండు వెలిగించునట్టు' అంటూ భీష్ముని నోట పలికిన భావం ఇదే! జగత్తుకు- జగదీశ్వరుడైన సూర్యుడికీ అంతటి అవినాభావ సంబంధం. ఆయనను ‘కర్మసాక్షి' అని పూర్వులు సంబోధించారు. ‘ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు'నన్నాడు మహాకవి పోతన. అందుకే సూర్యుడు అందరివాడు.
సప్తాశ్వ రథ మారూఢం...
సూర్యుడి రథానికి ఏడు గుర్రాలు అవి: గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ఠుప్, అనుష్ఠుప్, పంక్తి. అలాగే ఆ గుర్రాలను ఏడు వారాలుగా, ఇంద్రధనుస్సులోని ఏడు రంగులుగా, సప్త ఛందస్సులుగా కూడా పరిగణిస్తారు.
సూర్యుడి రథానికి ఉన్న ఆకులు పన్నెండు. వాటిని నెలలుగా, రాశులుగా భావిస్తారు. రథానికి ఉన్న రెండు ఇరుసులు రాత్రి, పగలు. సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. అతను గరుత్మంతుడి సోదరుడు. ఊరువులు (తొడలు) లేకుండా జన్మించాడు కాబట్టి అతణ్ణి ‘అనూరుడు' అంటారు.సూర్యుని తండ్రి కశ్యపుడు. తల్లి అదితి. అందుకే ఆయనను ‘ఆదిత్యుడు' అంటారు.