Online Puja Services

పుండరీకుని కధ

18.221.93.167

పూర్వం ముచుకుందుడనే రాజు అసురులమీద యుధ్ధంచెయ్యటంలో దేవతలకు సహాయం చేయగా, దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుధ్ధంచేసి అలసిపోవటంవల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోదలచి, తనని నిద్రలేపినవారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతలద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు. శ్రీ కృష్ణుడు కాలయవనుడనే రాక్షసునితో యుధ్ధంచేస్తూ అతడు ఏ ఆయుధంచేతా మరణించడని గ్రహించి, ముచుకుందుడు నిద్రించే స్ధలానికి తీసుకువచ్చాడు. నిదురిస్తున్నది శ్రీకృష్ణుడేననే ఊహతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగము చెయ్యటం, అతని చూపుపడి మరణించటం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనంకావటం జరిగాయి. ఆ ముచుకుందుడే మరు జన్మలో పుండరీకుడిగా జన్మించాడు.


పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళేదోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా, అతి వికారంగావున్న ముగ్గురు స్త్రీలు వాకిలి శుభ్రంచేసి, నీళ్ళుజల్లి, ముగ్గులు పెట్టటం, వారలా చేయగానే అత్యంత సౌందర్యవంతులుగా మారి వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యచకితుడై వారిని ప్రశ్నించగా వారు తాము గంగ, యమున, సరస్వతులనే నదులమని, తమలో మునిగినవారి పాపాలవల్ల తమకి ఆ దుస్ధితి వస్తుందని, కుక్కుటమునిలాంటి మహనీయుల సేవలో ఆ పాపాలుపోయి యధా స్ధితికి వస్తామని పేర్కొన్నారు. కుక్కుటమునికి అంత మహిమ తన మాతాపితరుల సేవతో వచ్చిందనికూడా తెలిపారు. పుండరీకుడు అప్పటినుంచి తన మాతాపితరులకు అత్యంత భక్తి శ్రధ్ధలతో సేవచేయసాగాడు.

ఒకసారి తన భక్తుని పరీక్షించదలచిన పాండురంగడు పుండరీకుడు మాతాపితరుల సేవ చేస్తున్న సమయంలో వచ్చి బయటనుంచి పిలిచాడు. పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన మాతా పితరులకు నిద్రా భంగమవుతుందని, అందుకని కొంతసేపు వేచి వుండమని తన చేతికి అందుబాటులో వున్న ఒక ఇటుకని విసిరి దానిమీద వేచి వుండమంటాడు. భక్త వశుడైన పాండురంగడు పుండరీకుడు బయటకు వచ్చేదాకా ఆ ఇటుకమీదే నుంచుని వుంటాడు. పుండరీకుని భక్తికి, మాతా పితరుల సేవాతత్పరతకు మెచ్చి వరముకోరుకోమనగా, అక్కడ ఇటుకమీద నుంచున్నట్లుగానే భక్తులకు దర్శనమిచ్చి బ్రోవమని కోరాడు. విఠలుడు అనే పేరు విట్టు లోంచి వచ్చిందంటారు. విట్టు అంటే కన్నడంలో, మరాఠీలో ఇటుక.

ఇతర భక్తులు
పుండరీకుడేకాదు … ఇక్కడ స్వామిని కొలిచి, స్వామితో ఆడి, పాడి, సహపంక్తి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో. వారిలో కొందరు .. శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, జ్ఞానేశ్వర మహారాజ్, జనాబాయి, నామదేవుడు, గోరా కుంభారుడు, సక్కుబాయి, తుకారాం, సమర్ధ రామదాసు, పురందరదాసు మొదలగువారు ఎందరో. జగద్గురువు శ్రీ శంకరాచార్యులు ఇక్కడికి వచ్చి పాండురంగాష్టకం రచించారు.
 
- శ్రీనివాస మూర్తి చిట్టమూరి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore