Online Puja Services

పరమేశ్వరుని నాగాభరణం మహాసర్పం వాసుకి

18.218.181.138
పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళల స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.
 
కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు వున్నారు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. 
 
పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. 
 
హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వారు వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శాపాన్ని పెడుతుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది.
 
 అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. 
 
రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. 
 
సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.
 
- Sekarana

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya