శ్రీ వైభవలక్ష్మీ పూజా వ్రతకథ
శ్రీ మహాలక్ష్మీ కటాక్షసిద్ధికి
శ్రీ వైభవలక్ష్మీ పూజా వ్రతకథ
పూర్వకాలంలో మహర్షులు తపోవనాలలో ఆశ్రమాలు నిర్మించుకొని లోకకల్యాణానికై తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ విద్యర్థులుగా వచ్చిన బాలకులకు వారికి తగిన విద్యలను బోధిస్తూ ప్రశాంత జీవితం సాగిస్తూ ఉండేవారు. ఆ మహర్షులను ఆయా దేశాధినేతలు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నుండి దండిగా సహాయ సహకారాలందిస్తూ పోషించెదివారు. అట్టి పవిత్ర తపోవనములలో పేరందినది నైమిశారణ్యము.
నైమిశారణ్యము ఉత్తరభారతంలో గోమతీ నదీతీరాన ఉండెను. అచట మహామునులంతా కలిసి లోకకల్యాణార్థము దీర్ఘసత్రయాగము నిర్వహించుచుండిరి. ఆ యాగములో పాల్గొనుటకు పలువురు మునులు సుదూర ప్రాంతముల నుండి యరుదెంచిరి. ఆ వచ్చిన మహర్షులలో అష్టాదశపురాణ పారీణుడగు వ్యాసమహర్షి శిష్యుడు సూతమహర్షి కూడయుండెను. ఆ సూతమహర్షిని చూడగనే మహామునులంతా ఎంతో ఆనందంతో యాగఫలము సిద్ధించిందని సంతోషపడిరి. ఉదయకాలమున జపహోమపూజాదులతో ఆ తపోవనము దద్దరిల్లినది. మధ్యాహ్నకాలమున ఫలహారములు పూర్తియైన పిదప మహర్షులంతా సూతుని చెంతకు చేరి ఓ మహానుభావా! నీవు సర్వజ్ఞుడవు. మీ గురుదేవుల అనుగ్రహం వలన నీవు వేదపురాణ ఇతిహాససారమంతా ఆపోశనం పట్టావు. మాకు కొన్ని సందేహాలుకలవు. ఆ సందేహములు తీర్చి మమ్ములను నిస్సందేహులుగా జేయగలందులకు ప్రార్థించుచున్నాము. ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములందురు గదా! వీటిని సామాన్య జనులు కూడా పాటించి ఆయా ప్రయోజనములు సులభముగా పొందుటకు మార్గములున్నచో తెలుపగలందులకు ప్రార్థించుచున్నామని వేడుకొనిరి. వెంటనే సూతమహర్షి ఆ మునిమండలితో 'తపోధనులారా! మీరు మంచి ప్రశ్నవేసిరి. మీరడిగినది లోకమునకెంతయో ఉపయోగకరమైనది సావధానముగా వినుడ'ని ఇట్లు చెప్పనారంభించెను.
'మునులారా! పురుషార్థములో మొదటిది ధర్మము. మానవుడు ధర్మమార్గమున సంచరించుట ప్రథమకర్తవ్యము. ధర్మమనగా సర్వప్రాణికోటికి సమ్మతమైనదే ధర్మము. ఆ ధర్మాచరణకు ముఖ్యసాధనభూతమైనదే రెండవ పురుషార్థమగు అర్థము. అర్థము అనగా ధనము. ఆ ధనము ధర్మయుక్తమైనదైనచో బంగారమునకు పరిమళమబ్బినట్లే. కావున మానవుడు ధనార్జనకు ధర్మమార్గమవలంబించుట శ్రేయోదాయకము. ధర్మమూలకమైన ధనము శాశ్వతమై నిత్యసంతోషము నొసంగి ఆ వంశములోని వారికనంత సుఖానుభూతి నొసంగగలదు. కావున మానవుడు తాను సంపాదించిన ధనములో కొంత కుటుంబ పోషణకు, కొంత ధర్మార్జనకు వినియోగింపవలయును. అట్లుగాక సంపాదించిన ధనమునంతయు మానవుడు కుటుంబపోషణకు, సుఖానుభూతికి కూడబెట్టుటకు తలంచినచో దాని వలన కష్టములేగాని సుఖమే మాత్రము కలగదు. అందువలన మానవుడు సంపాదించిన ధనములో కొంతభాగము ధర్మకార్యములకై వెచ్చించినచో సుఖానుభూతిని పొందగలదు. దీనివలన మానవుడు నిత్యతృప్తుడై సుఖశాంతులతో శాశ్వతానందము పొందుట కవకాశము లభించును.' అని పల్కుచుండగా కొందరు మునులు సూతమహర్షితో స్వామీ! భగవంతుడు మానవులలో కొంతమందిని ధనవంతులుగా కొంతమందిని దరిద్రులుగా సృజింపనేల? అందరినీ ఒకేవిధముగా సృజింపవచ్చునుగదా! ఈ పక్షపాత బుద్ధియేల? యని ప్రశ్నింప సూతమహర్షి ఇట్లనెను.
'ఓ మునులారా! భగవంతుని దృష్టిలో యేవిధమగు పక్షపాతములేదు. భగవంతుడందరినీ ఒకేవిధముగా సృష్టించును. కాని ఆయాప్రాణుల పూర్వజన్మ ప్రారబ్ధము ననుసరించి కష్టసుఖములు వారికి కల్గుచున్నవి. దీనికుదాహరణముగా సుశర్మోపాఖ్యానము వినిపింతును. శ్రద్ధగా వినుడ 'ని యీ విధముగా చెప్పనారంభించెను.
'అవంతీ దేశమున సుశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతడు చతుర్వేదములను షట్శాస్త్రములను క్షుణ్ణముగా నభ్యసించి పండిత పరిషత్తులో మహాపండితునిగా గెలుపొంది అపరసరస్వతి అవతారమని పలువురి మన్ననలు పొందెను. కాశ్మీర దేశమునుండి యరుదెంచిన పరాశరుడను పండితోత్తముడా సుశర్మకు తన కుమార్తెయగు శారదాదేవి నొసంగి వివాహముగావించెను. అవంతి దేశాధిపతి సుశర్మను గంగాతీరముననున్న గురుకులమునకు అధ్యక్షునిగా చేసి గౌరవించెను.
మహాపండితుడగు సుశర్మ గురుకులములోనున్న విద్యార్థులకు విద్యాబోధనచేయుచూ కాలము గడుపుచుండెను. దేశదేశములలో ఆ గురుకులమునకు మంచి పేరు ప్రఖ్యాతులు వ్యాపించెను. క్రమక్రమముగా ఆ గురుకులములో విద్యపూర్తి చేసిన పలువురు విద్యార్థులు దేశదేశములలో తమ ప్రతిభా పాండిత్యములను ప్రదర్శించి అఖండ సన్మానముల నంది అంతులేని ధనమునార్జించిరి.
పిదప కొంతకాలమునకు ఆ పండితులెల్లరూ తమ గురువగు సుశర్మకు తమ భక్తి ప్రపత్తులను తెలుపుటకై గురుకులమున కేతెంచి సుశర్మ పాదములపై బడి మీ అనుగ్రహమునే మేమింతవారమై అఖండ కీర్తి ప్రతిష్ఠలతో బాటు అపారధనము నార్జించితిమని చెప్పి అమూల్యవస్త్రాభరణములను, సువర్ణ నాణెములను గురుదేవులకు కానుకగా సమర్పించిరి. కాని ఆ సుశర్మ ఆ శిష్యులతో మీ భక్తి ప్రపత్తులకు నేను చాల సంతోషించితిని. నాకీ సువర్ణనాణెములు గాని, అమూల్య వస్త్రాభరణములు గాని సంతోషము నీయజాలవు. వీనిని నేను ముట్టను నాకు సంపదల మీద యేవిధమగు ఆశలేదు. వీనిని మీరు తీసుకొనివెళ్ళి సుఖముగా నుండుడు. నా కీర్తి ప్రతిష్ఠలు నలువైపులా వ్యాపింపచేసిరి. అదియే నేను కోరుకొనుచుంటినని పల్కి ఆ సంపదలను తిరస్కరించెను. శిష్యులెన్ని విధముల బ్రతిమాలిననూ ఆ పండితోత్తముడా సంపదలను స్వీకరింపకపోవుటచే వారు గురువుల మనసు నొప్పింపలేక మిన్నకుండిరి. పిదపవారు గురువులకు తెలియకుండ గురుపత్ని యగు శారదాదేవికా కానుకలందించి తృప్తితో వెడలిపోయిరి.
శారదాదేవి శిష్యులొసంగిన అపారధన సంపదను భర్తకు తెలియకుండా దాచియుంచి వానినేవిధముగా బహిర్గతము చేయువలయునని యోచించుచు కాలము గడుపుచుండెను.
ఒకానొక దినమున ఏకాంతముననున్న సుశర్మ చెంతకు శారదాదేవి యేతెంచి నాథా! మిమ్ములనొకమాట అడుగవలెనని చాలారోజులనుండి తలంచుచుంటిని. అడుగమందురా? అని ప్రశ్నింపనాతడు నీ ప్రశ్నయేదో తెలుపమనెను. వెంటనే ఆమె నాథా! మీ శిష్యులు పలువురు దేశదేశములలో అఖండకీర్తి ప్రతిష్ఠలతోబాటు అపారధనసంపదలు సంపాదించుటకు కారణభూతులు మీరేకదా! అట్టిమీరు సర్వస్వము వదలి కూపస్థమండూకమువలె యీ గురుకులమునే నమ్ముకొని దినభత్యముతో కాలక్షేపము చేయుట భావ్యముగానున్నదా? మీకు ధనధాన్యములపై ఆశలేకపోవచ్చును. కాని నేను నా పిల్లలూ ధనహీనులుగా బ్రతుకుట దుర్భరముగానున్నది. మా కోరిక తీర్చుటకై మీరుకూడ దేశాటనము చేసి ప్రతిభాపాటవములను ప్రదర్శించి మహారాజులను మెప్పించి మణిమాణిక్యములను అగ్రహారములను సంపాదించుడు, లేనియెడల మేమీ మనోవేదనతో కొంతకాలమున కసువులు బాసెద'మని నిష్కర్షగా చెప్పెను. అంతట ఆ మహాపండితుడామెతో ఓ శారదా! ధనము శాశ్వతము కాదు. దాని వలన సుఖమును పొందలేము. దుఃఖమును కల్గించును. మనమింత కాలము ఎంతోసుఖముగా జీవించితిమిగదా! నా శిష్యులు సంపాదించి తెచ్చిన ధనము చూచిన నాటినుంచి నీకు దుఃఖము ప్రారంభమైనది. ఆ ధనాశ నీలో ఏర్పడి ప్రాణత్యాగమునకే సిద్ధమైతివి. కావున నీవు ఎప్పటివలె ప్రాప్తలాభముతో సుఖముగా జీవించుము. కోరికలు వదులుమని నచ్చచెప్పెను. ఎన్నిచెప్పినను ఆమె ఎంతమాత్రము ధనసంపదలు లేకుండ జీవించి యుండజాలనని బదులుపల్కెను. వెంటనే సుశర్మ ఆమెతో ఓ సాధ్వీ! నీవు తొందరపడవలదు. నేను నా పాండిత్యమును ప్రదర్శించి రాజాధిరాజులను యాచింపలేను. నీ కోరిక తీరుటకు ఆ మహాలక్ష్మీదేవిని మెప్పించి కనకవర్షము కురిపింపచేయగలనని ఆమెను శాంతింపచేసెను. ఒక శుభదినమున శ్రీమహాలక్ష్మీదేవి యనుగ్రహమును బడయుటకై మహాలక్ష్మీయాగము ప్రారంభించెను. నలుబది దినములు అహోరాత్రములు జపహోమార్చనలతో ఆ మహాలక్ష్మిని గూర్చి తపముచేసెను. నలుబదియెకటవ దినమున పూర్ణాహుతి గావించి ఆనాటి అర్థరాత్రమున మనయింట కనకవర్షము పడునని భార్యకు తెలిపెను. ఆ శారదాదేవి ఎంతో సంతోషముతో అర్థరాత్రికై ఎదురుజూచెను. అర్థరాత్రియైనది కాని ఆ యింట కనక వర్షము కాదుకదా కనీసము నీటితుంపరలైననూ జాలువారలేదు. క్రమముగా తెల్లవారజొచ్చెను. అప్పుడు శారదాదేవి సుఖనిద్రనుండి మేల్కొన్న సుశర్మ చెంతకు చేరి నాథా! మీ మాటలు నీటిమూటలయ్యెను. కనకవర్షము కాదుగదా కనీసము నీటితుంపరలు కూడా పడలేదు. రాత్రియంతయు సుఖనిద్రమాని రెప్పపాటుకూడా వేయక ఎదురుచూచితిని. నా ఆశలు అడియాశలైనవి. నేనెంతయో దురదృష్టవంతురాలను. మీవంటి బూటకములాడు భర్తను కట్టుకొని నేను మోసపోతిని. మీ కండ్లయెదుటనే నేను ప్రాణత్యాగము చెయుదు" నని పలుక నాపండితోత్తముడు తన భార్యతో ఓ శారదా! నేను మహాలక్ష్మీదేవినుద్ధేశించి భక్తిశ్రద్ధలతో అఖండ తపమొనరించితిని. ఆమెకు నాపై కరుణ కల్గలేదు. అసత్యవాదిగా నాకు పేరుతెచ్చిన ఆ మహాలక్ష్మీనే నా కండ్ల ఎదుట అభిచారహోమముచేసి బూడిదపాలు గావించెదనని" ఘోరశపధము గావించి ఉదయకాలమున అభిచార హోమమునకు సంసిద్ధుడయ్యెను. సుశర్మ నల్లని వస్త్రములు ధరించి రౌద్రరూపముతో అభిచార హోమమున కుపక్రమించెను. వేపసమిధలు అగ్నిలోవ్రేల్చ నారంభించెను. అగ్నిదేవునిలో రౌద్రరూపము చేర్పడినట్టుల నీలకాంతులతో అగ్ని ప్రజ్వరిల్లుచుండెను. ఆ సమయమున సుశర్మ తాటియాకుపై ఘంటముతో తానింతకాలము తపముచేసిన మహాలక్ష్మీ మంత్రమును బీజాక్షరములతో లిఖించి ప్రాణప్రతిష్ఠగావించి దానిని అగ్నిగుండములో హోమము చేయుటకు సంసిద్ధుడగుచుండగా దూరమునుండి 'ఓ సుశర్మా నీవు హోమము ఆపుము ఆపుమనీ యొక స్త్రీ ఆర్తనాదము కర్ణకఠోరముగా వినిపించెను. వెంటనే సుశర్మ హోమము ఆపి ఆ ఆర్తనాదము వినబడ్డదిక్కుకు చూడగా యొకస్త్రీ జుట్టు విరబోసుకుని మలిన వస్త్రములతో కాంతివిహీనమైన దేహసౌందర్యముతో ఎదురువచ్చి హోమమాపుమని కోరెను. వెంటనే సుశర్మ అమ్మా నీవెవరివు? ఎందులకు నా హోమమాపుజేయవలెనని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ సుశర్మా నీవెవరి కొరకై నలుబది దినములు అఖండ తపశ్చర్య జరిపితివో యా మహాలక్ష్మిని నేను. నీ తపస్సుకు సంతుష్టురాలనై నీ ఇంట కనకవర్షము కురిపింప ప్రయత్నింపగా నా అక్కయ అది వినగానే జ్యేష్టాదేవి(దరిద్ర దేవత) నాతో నీవా సుశర్మకు అపారధన రాసులొసంగుటకు వీలులేదు. అతడు పూర్వము ఏడుజన్మలలోను ఎవ్వరికీ ఏమి దానమిచ్చియుండలేదు. ఎవరికీ ఏమియు పెట్టలేదు. ఆ ప్రారబ్ధదోషమువలన యీ జన్మలో దరిద్రునిగానే యుండవలెను. ఈ తపఃఫలమువలన అతదు మరుజన్మలో రాజసంపదలనుభవించునని యడ్డగించెను. నేనామె మాటలను త్రోసిపుచ్చి నీయింట కనకవర్షము కురిపించుటకు పూనుకొనగా నా సర్వశక్తులను స్వీకరించి నన్నీవిధముగా అలక్ష్మిగా మార్చినది. నీవు జరిగినది తెలియక క్రోధముతో అభిచారహోమముసల్పిన మరింత ప్రారబ్ధమును మూటకట్టుకుందువని హోమమునాపు జేయమంటిని' అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడామెతో నేను జీవించియుండగనే నా దారా పుత్రుల కోరికదీర్చవలయునని తలంచితిని. నేను సన్యాసాశ్రమమును స్వీకరించి ఈ జన్మను కడతేర్తును. నా భార్యాపుత్రుల కోరిక తీరునుగదా! యని పలుకగా తప్పక తీరునని జెప్పెను. వెంటనే సుశర్మ తన భార్యతో శారదా! వింటివిగదా నీవు. నేను కావలయునా? లేక ధనసంపదలు కావలయునా? అని ప్రశ్నింపనామె వెంటనే స్వామీ! మీరు సన్యాసము స్వీకరించి మమ్ములను సుఖముగా బ్రతుకనీయుడు అని పల్కెను. వెంటనే ఆ మహాపండితుడు విధివిధానముగా సన్యాసాశ్రమమును స్వీకరించి శిఖాయజ్ఞోపవీతములను విసర్జించి దంకమండలములు స్వీకరించి గ్రామైకరాత్రముగా దేశాటన కుద్యుక్తుడయ్యెను. శారదాదేవి ఇంట కనకవర్షము కురిసెను. ఆ తల్లీపిల్లలెంతో ఆనందమందిరి. ఎదుటనున్న మహాలక్ష్మి ఎప్పటివలె వెలుగొంది దేశాటనకు బయలుదేరిన ఆ సన్యాసి యెదుట నిలిచి 'ఓ పరివ్రాజక! నీవలన నేను కొత్త అవతారమునెత్తితిని, మహాలక్ష్మినైన నేను వైభవలక్ష్మిగా యవతరించితిని. నన్ను కొలిచినవారికి, నా పూజలు చేసినవారికి ప్రారబ్ధదోషములు రూపుమాపి ఆ జన్మలోనే అష్టైశ్వర్యములు నొసంగగలను. నీవు సన్యాసివైననూ నీవు యీ దేశాధినాధుడవై సంపదలలో మునిగియున్ననూ తామరాకు మీద నీటి బొట్టువలె సంచరించి లోకోపకారము గావింతువు' అని పల్కి అదృశ్యమయ్యెను.
మహర్షులారా! కాబట్టి మానవుడుగాని యే ప్రాణిగాని తాము పూర్వజన్మలో చేసుకున్న ప్రారబ్ధముననుసరించి సుఖఃదుఖములను ధనదారిద్ర్యములను అనుభవించెదరు. అష్టలక్ష్మీ అవతారములకంటె వైభవలక్ష్మీ అవతారము సర్వోత్కృష్టమైనది. ప్రారబ్ధదోషాన్ని కూడా రూపుమాపి అఖండ అష్టైశ్వర్యాలను ప్రసాదించే అవతారమే వైభవలక్ష్మీ అవతారము. ఈమెను భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారు తప్పక తాము కోరుకున్న ధర్మయుక్తమైన కోరికలు తప్పకుండా తీరును. ఏదైనా కోరిక తీరుటకు ఈ వ్రతాన్ని ఆరంభించినవారు ఎనిమిది శుక్రవారములు సాయంకాలము ప్రదోషకాలములో బంధువులను మిత్రులను ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి సమక్షములో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి కథాశ్రవణం చేసి తీర్థప్రసాదములు పంచి లక్ష్మీస్తోత్రము మంగళహారతులతో ఆమెను సంతృప్తి పరచవలెను. ఈ విధముగా ఎనిమిది శుక్రవారములు వైభవలక్ష్మీ వ్రతం చేసి చివరి వారమున ఎనిమిదిమంది ముత్తైదువులను పిలచి వారిని వైభవలక్ష్ములుగా భావించి పూజించి దక్షిణ తాంబూలములతో 8 వైభవలక్ష్మీ వ్రతకథా ప్రతులను వాయనములుగా ఇచ్చి వారి ఆశీర్వాదమును పొందవలెను. ఇదియే ఈ వ్రతమునకు ఉద్యాపనము. ఈ వ్రతము ఆచరించిన వారికి అష్టైశ్వర్యములతో బాటు అఖండ సౌభాగ్యము కలుగును అని సూతమహర్షి మహామునులకు వినిపించెను.
-
సూర్యప్రకాష్ సాధనాల