Online Puja Services

కృష్ణార్పణం.

3.138.189.0

ఒక ఊళ్ళో పేద,అమాయకమైన కృష్ణభక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ కృష్ణార్పణ మనడం మొదలుపెట్టింది.

ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకొనేముందు కృష్ణార్పణం, భుజించేముందు, బోజనం తరువాత, బయట కెళ్ళేముందు ఇంటికొచ్చిన తరువాత..కృష్ణార్పణమే.

చివరకు చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ కృష్ణార్పణం అనటమే !ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. .. 

విషయమేమిటంటే ఆఊరిలో ఉన్న 
శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడి పై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీరోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్తపడుతోంది. ఎలాగో ఎవరికీ అర్ధం కాక నిఘా పెట్టారు ఊరిజనమందరిమీదా....
చివరకు ఈ గొల్లస్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడి పై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి
ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆదేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.

రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ కృష్ణార్పణమంది.

మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ... ఆమె కటికనేల పై పడుకొనే ముందు కృష్ణార్పణమనుకుంది. రెండవరోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.

ఇక మూడవరోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు... ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది.
అప్రయత్నంగా కృష్ణార్పణ మనగానే గాయం మాయమయ్యింది. అదిచూసిన కారాగృహాధికారి పరుగుపరుగున రాజుగారికి చెప్పాడు.

అదేసమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి 
ధారాపాతంగా రక్తమొస్తోంది... ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వట్లేదు అని వాపోయారు.

రాజు గారు ఆ స్త్రీని అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని. తెలియదు నాకు అంది... సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది. సభలో వారందరూ హతాశులయ్యారు.

ఆమెని నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా అని అడిగితే, తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను.

అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. 

సభికులు పెద్దల కళ్ళల్లు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి.... ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళమీద పడ్డారు.

ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను..స్వామివారి మీద చెత్తపోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.

చిరునవ్వులు రువ్వుతూన్న నందకిషోరుడుని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆరోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.

సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు... భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్నితండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు. ..

ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలకు అంతమేముంటుంది?.

ఓం నమో భగవతే వాసుదేవాయ 

 

కృష్ణవేణి శఠగోపన్ 
 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba