Online Puja Services

అనుబంధాల విలువలు నేర్పిన కరోనా

3.138.114.140
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది పాత సామెత. కరోనా చేసే మేలు కరీనా కూడా చేయదన్నది కొత్త సామెత. కరోనా వల్ల చస్తే వాడి ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ మైలు గాని, మేలు ఏముంది అనే కదా మీ అనుమానం. చస్తేనే మైలు, అదే చావకపోతే బోలెడంత మేలు ఉంది ఈ కరోనా వల్ల. అసలు కరోనా ఇప్పటివరకూ ఎంత మేలు చేసిందనుకుంటున్నారు. చాలా మేలు చేసింది. మనుషుల వల్ల సాధ్యం కాని అసాధ్యాలన్నిటినీ సుసాధ్యం చేసి పడేసింది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి..
 
మామూలుగా మనం వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండగలమా? మనకి అది సాధ్యం కాని పని. పక్క వీధిలోకి వెళ్లాలంటే ఆ దిక్కుమాలిన బండి కావాలి. రెండడుగులు వేసే దానికి కూడా రెండు చక్రాల బండి కావాలి. బండిలోంచి వచ్చే పొగ, నోట్లోంచి గుప్పు గుప్పుమంటూ వదిలే సిగరెట్ పొగ ఈ రెండూ మన జీవితాల్నే కాకుండా వాతావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నాయి. ఇన్నాళ్ల మానవ జీవితంలో మనం ఎవరైనా ఆపగలిగామా? కరోనా ఆపింది. లాక్ డౌన్ వల్ల బండి తీయడానికి లేదు, సిగరెట్ కోసం బయటకెళ్లడానికి లేదు. దీని వల్ల మన ఊపిరితిత్తులే కాకుండా, ప్రకృతి కూడా కొన్ని రోజులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. పెట్రోల్, డీజిల్ బండ్లు ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నాయో ప్రతీ ఒక్కరూ తెలుసుకున్నారు. బండి మీద బయటకెళ్లి చావడం కంటే ఇంట్లోనే ఉంటూ ఆన్ లైన్ లో వర్క్ చేసుకుంటే చాలనుకుంటున్నారు. 
 
ఓజోన్ పొర దెబ్బ తింటుంది, ఏసీలు ఆఫ్ చేయండిరా అంటే ఒక్కడు ఆఫ్ చేయడు. చలికాలంలో కూడా ఏసీ లేకపోతే ఉండలేనివాళ్లు ఉన్నారు. నేను ఏసీ లేకపోతే ఉండలేను తెలుసా అని బిల్డప్ లిస్తారు. అలాంటి బిల్డప్ బాబాయ్ లిప్పుడు ఏసీ వేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా, కూల్ ప్రదేశాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని భయపడుతున్నారు.  
 
మాట్లాడితే షాపింగ్ లకు వెళ్ళిపోయి, ఏది పడితే అది కొనేసి దుబారాగా డబ్బులు తగలేయకూడదు అనే విషయాన్ని నేర్పింది. న్యూడిల్సు, పానీ పూరీ అంటూ చిల్లర తిండి తినే వాళ్ళకి కమ్మని అమ్మ చేతి వంట అలవాటు చేసింది. శుభ్రంగా ఉండమని చెప్పింది. శుభ్రమైన తిండి తినమని చెప్పింది. ఒంటరిగా ఉండి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పింది. పని ఒత్తిడిలో పడి మర్చిపోయిన మీ ఫ్యామిలి మెంబర్స్ అందరినీ ఒక చోట చేర్చి కుటుంబ విలువలు నేర్పింది. కాసేపు సెల్ ఫోన్ ని పక్కన పెట్టి అమ్మా, నాన్న, భార్యా, పిల్లలతో ఎక్కువ సమయం గడపమని చెప్పింది. ఇంటిల్లిపాది కలిసి ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూడమని చెప్పింది. చాలా రోజులయి ఉంటుంది కదా, అమ్మా, నాన్నలతో కలిసి సినిమా చూసి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య అనుబంధాన్ని పెంచింది కరోనా. కష్టకాలంలో భార్య.. భర్త కోసం ఎంత సేవ చేస్తుందో తెలియచేసింది. ఆధునిక కాలంలో ఆలుమగల మధ్య పెరిగిన దూరాన్ని దగ్గర చేసింది. అన్నిటికీ మించి ఒకరికొకరుగా కూర్చొని.. నాలుగు మాటలు మాట్లాడుకునే సమయాన్ని ఇచ్చింది. వారి మధ్య మళ్ళీ ప్రేమలను చిగురింప చేసింది.  
 
ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కానటువంటి మందు, సిగరెట్, డ్రగ్స్, దొంగతనాలు, దోపిడీలు, రేపులు వంటి నేరాలు జరగకుండా ఆపింది. మళ్ళీ ప్రభుత్వం మద్యం షాపులు తెరిచిందనుకోండి. అది వేరే విషయం. కానీ ఒక నెల రోజులు తాగుబోతులని మద్యం జోలికి పోకుండా ఆపిందా లేదా? ఆడపిల్ల ఒంటి మీద చేయి వేస్తే కరోనా వస్తుందేమో అని భయం, ఏ ఇంట్లో అయినా దొంగతనం చేస్తే కరోనా వస్తుందేమో అని భయం కలిగేలా చేసింది. పోలీసులకి భయపడని పోరంబోకులని కరోనా భయపెట్టింది. డ్రగ్ రాకెట్ ని ఆపింది.  వ్యభిచారాన్ని హోల్డ్ లో పెట్టింది. రోడ్డు ప్రమాదాలని నివారించింది.  
 
డబ్బు కోసం యంత్రాల్లా తయారైన మనం మళ్ళీ మామూలు మనుషులు అయ్యాము. ప్రాణం కంటే డబ్బు పెద్ద విలువైనది కాదనే నిజాన్ని గ్రహించాము. లగ్జరీగా తిరగడానికి లక్షలు కావాలనుకున్న స్టేజ్ నుంచి తినడానికి నాలుగు మెతుకులు సంపాదించుకుంటే చాలురా నాయనా అనే స్టేజ్ కి వచ్చేసాము. ఒకవేళ ఈ కరోనా ముదిరిపోతే మనిషిని, మనిషి ముట్టుకోడు. అప్పుడు కట్టుకున్న బట్ట, వేసుకున్న బంగారం, బ్యాంక్ బేలెన్స్ లు ఇవేమీ కడుపు నింపలేవు. నా కడుపు కోసం నేనే సంపాదించుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను అనే స్టేజ్ కి వచ్చిన వాళ్ళున్నారు. డబ్బు కోసం పరిగెత్తకు, నిదానమే ప్రధానం అనే సామెతను గుర్తు చేసింది ఈ కరోనా. ఇంట్లో భార్య, పిల్లలని పట్టించుకోకుండా నువ్వు సంపాదించిన కోట్లు నా నుంచి నిన్ను కాపాడలేవని చెప్పింది. అవినీతి మార్గంలో సంపాదించిన వేల కోట్లు కూడా పట్టుకెళ్లలేవు అని చెప్పింది. నువ్వు ఏమీ అవ్వక్కర్లేదు, ఓ తెగ పిసికేసుకోకు... నీతో ఎవరూ రాదు, ఏదీ రాదు. ఆఖరికి నీ శరీరం కూడా నీతో రాదు అనే జీవిత సత్యాన్ని బోధించింది. 
 
గడపకి పసుపు, నుదిటన బొట్టు, చీర కట్టు, ఆరు బయట పేడతో కల్లాపు, గోమూత్రం ఇవన్నీ ఏంటి చాదస్తం కాకపోతే అనే వాళ్ళ నోర్లు మూయించింది. పసుపు యాంటీ బయాటిక్ గా పని చేస్తుందని, పేడతో వేసిన కళ్లాపు దోమలని రానివ్వకుండా ఆపుతుందని, గోమూత్రం క్యాన్సర్ ని క్యూర్ చేస్తుందని, ఇలా ఎన్నో విషయాలు ఎప్పుడో మన వేదాల్లో ఋషులు, పండితులు పొందుపరిచిన విషయాన్ని నేటి మూర్ఖులకి అర్ధమయ్యేలా చెప్పింది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. తరతరాల నుంచి వస్తున్న మన ఆచారాలను, సాంప్రదాయాలను తుంగలో కలపొద్దని చెప్పింది. వాటిని మూఢనమ్మకాలుగా తీసి పడేయవద్దని చెప్పింది. అలా తీసి పడేస్తే, కరోనా ప్రాణం తీసి పడేస్తానని చెప్పకనే చెప్పింది. నుదిటన కుంకుమతో గాని, విభూదితో బొట్టు పెట్టుకుంటే రక్తప్రసారణ జరిగి మెదడు చురుగ్గా పని చేస్తుందని, దాని వల్ల ఏకాగ్రత పెరుగుతుందని తెలియజేసింది. వీటి వెనుక సైన్స్ దాగి ఉందని చెప్పింది.  
 
“షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారమే ముద్దు” అని మన సనాతన ధర్మం చెప్పిన విషయాన్ని ప్రపంచం దేశాలకి తెలియజేసింది. మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని కాపాడుకుంటే బతికి బట్టకడతాం, లేదంటే చస్తామనే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ప్రకృతిని, ప్రకృతి వనరులైన మొక్కలని, చెట్లని, అడవులని, ఈ భూమిని, నీరుని, మత్స్య సంపదని ఇలా ప్రకృతిలో భాగమైన సహజ వనరులని మనం కాపాడుకోవాలి. వాటి నుంచి వచ్చే వాటిని తీసుకోవాలి గాని, వాటిని తీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అనే విషయాన్ని చెప్పింది. సమస్త మనవాళికి కనువిప్పు కలిగించింది. 
 
కరోనా ఒక్క నాలుగు నెలలు ఉంటేనే ఇంతలా చేసింది అంటే అదే 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిలా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దెబ్బకి మనిషికున్న జబ్బులన్నీ ఎగిరిపోతాయి. భూకంపాలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవేమీ ఉండవు. కరోనా వల్ల చాలా ప్రయోజనాలు కలిగాయి. కరోనా ఒక గుణపాఠం. మన జీవితాల్లో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన కరోనా వెళ్లిపోతే మళ్ళీ మనం మామూలు అయిపోతాం. అప్పుడు కరోనా 2 వస్తుంది. అయినా కానీ మనం మారము. మాస్క్ లు, సేనిటైజర్లు అని హడావుడి చేసేస్తాం. ఇప్పటికైనా కరోనా చెప్పిన జీవిత సత్యాలని ఆచరించి, మన సంస్కృతిని, సాంప్రదాయాలను ఫాలో అయితే 100 ఏళ్ళు బతకచ్చు. మన పెద్దలు చెప్పే విషయాలని ఫాలో అవుదాం. కరోనాని తిట్టుకుంటున్నాం కానీ, దారి తప్పిన మనిషిని గాడిన పెట్టింది. మూర్ఖంగా దూసుకుపోతున్న పశువు లాంటి మనిషికి ముక్కుతాడు వేసింది. ఇన్నాళ్ళకి కరెక్ట్ మగాడు కరోనా రూపంలో వచ్చాడు. కరోనా మన హీరో. తప్పు అయిపోయిందని ఒప్పుకుని ఇక మీద తప్పు చేయకుండా ఉంటే మనల్ని ఏమీ చేయడు, అలా కాకుండా తప్పు చేస్తా అంటే తీసుకెళ్లిపోతాడు. ఇన్ని విప్లవాత్మక మార్పులు జరిగాయి కాబట్టి ఒకవేళ అవార్డులు, రివార్డులు ఇవ్వదలచుకుంటే కరోనా గాడికే ఇవ్వాలి. అయ్యప్పసామి సాక్షిగా ఎన్ని అవార్డులున్నాయో అన్ని అవార్డులు మన చిట్టి కరోనాకే ఇవ్వాలి. జై హింద్....
 
- Hithokthi Desk

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore