బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ?
బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ? వాళ్లకు అది నియమమా ? ఆచారమా ? మూఢ నమ్మకమా ? బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లిని అసలు ఇంట్లోకి కూడా తీసుకెళ్లకపోవడానికి కారణమేంటి ? అన్న సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా ? అయితే.. ఈ సందేహాలకు సమాధానం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
హిందూ మతంలో బ్రాహ్మణులు ఒక కులానికి చెందినవాళ్లు. వీళ్లలో చాలా మంది పూజారులు, విద్యావేత్తలు ఉంటారు. బ్రాహ్మణులు తమ సంస్కృతిని బోధించడంలో ప్రసిద్ధులు. వాళ్లు తమ ఆచారాలకి కట్టుబడి ఉండి, నిత్యం తమ నైమిత్తిక కర్మలతో పాటు వ్రతాలు ఆచరిస్తూ భగవంతునికి దగ్గరగా ఉంటారు. బ్రాహ్మణులు వైష్ణవులు, శైవులూ అని ఉంటారు. వైష్ణవులు శ్రీ మహా విష్ణువుని ఆరాధిస్తే శైవులు మహా శివుడిని ఆరాధిస్తారు.
బ్రాహ్మణుల కట్టుబాట్లు కఠినంగా ఉండటమే కాకుండా వీరి ఆహారపు అలవాట్లు కూడా కఠినంగానే ఉంటాయి. వీరు అస్సలు ఏ విధమైన మసాలాలూ తినరు. ముఖ్యంగా ఉల్లీ, వెల్లుల్లి వీరికి నిషిద్ధం. పూర్వీకులు ఎప్పుడూ వీటిని తినలేదు. బ్రాహ్మణులు అస్సలు వీటిని ఇంట్లొకి తీసుకొచ్చేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య ఈ అలవాటు కాస్త మారింది. కానీ స్మార్తులు, అయ్యర్, అయ్యంగార్ కుటుంబాలలో ఇప్పటికీ కొంతమంది గృహాలలో ఉల్లీ, వెల్లుల్లీ నిషేధం. భగవంతునికి నివేదించే నైవెద్య పదార్ధాలలో ఉల్లీ, వెల్లుల్లీ అస్సలు వాడరు. అసలు దీనికి గల కారణమేంటో తెలుసా ?
ఆయుర్వేదం ప్రకారం మనం తినే ఆహారం సత్వ, రజో, తమో గుణాలని కలుగచేస్తుంది. సాత్విక పదార్థాలు భుజించడం వల్ల మానసిక ప్రశాంతత కలిగి.. ఎప్పుడూ సత్యమే పలుకుతూ మన మనస్సుని అదుపులో ఉంచుకోగలుగుతామట. బ్రాహ్మణులు సాత్విక ఆహారం తినడానికి గల ముఖ్య కారణం ఇదే. రజో గుణం కలుగచేసే పదార్ధాలు తినడం వల్ల కోరికలు కలిగి ఐహిక సుఖాలు అనుభవించాలనే కోరిక కలుగుతుంది.
ఉల్లిపాయలు సెక్స్ పరమైన కోరికలని ఎక్కువగా కలుగచేస్తాయి. అందుకే మన పూర్వీకులు ఉల్లిపాయలని నిషేధించారు. తమో గుణం కలుగచేసే పదార్ధాలు అనగా ఉల్లి వెల్లుల్లి లాంటి వాటిని మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన మనస్సుకి అశాంతి కలిగి కోపం, అసూయ లాంటి భావాలు కలుగుతాయి. మన మనస్సుని కూడా అదుపులో ఉంచుకోలేము. అందువల్లే బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లిని తమ ఆహారంలో చేర్చుకోలేదు.
కానీ వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు నయమవుతాయని కొంతమంది నమ్ముతారు. కానీ వెల్లుల్లి ద్వారా కాకుండా ఆయుర్వేద మందుల ద్వారా ఇలాంటి జబ్బులని అరికట్టవచ్చని బ్రాహ్మణులు కనుగొన్నారు. మానవులు కోతుల నుంచి ఉధ్భవించారు అనే సిద్ధాంతం ఉంది కదా. అందుకే మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవడానికి ఈ నియమాలు వచ్చాయి.
ఇంకో మాటలో చెప్పాలంటే మనుషులు తమ మనస్సుని స్వాధీనంలో ఉంచుకోలేరు. అందువల్ల తమో గుణాలని కలిగించే ఉల్లీ, వెల్లుల్లి, మాంసము లాంటి ఇతరత్రా పదార్థాలని తీసుకోవడం తగ్గిస్తే మానసిక ప్రశాంతత కలిగి జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవచ్చని బ్రాహ్మణులు నమ్ముతారు. ఈ పదార్ధాలు భగవంతునిపై మన మనస్సుని లగ్నం కాకుండా అడ్డుకుంటాయని బ్రాహ్మణులు వీటిని తినరు.
- సేకరణ: బడే రాము