Online Puja Services

విదేశీయానం – ప్రాయశ్చిత్తం

18.119.163.95

 

పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల మద్రాసులోని ప్రభుత్వ ఆసుపత్రిలో 1964 నుండి 1992 దాకా ఎన్నో మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేసాను. పదవీ విరమణ తరువాత ప్రైవేటు ఆసుపత్రులలో దాదాపు దశాబ్ధం పాటు పనిచేశాను.

ఆ కాలంలో ఉపనయనం అయిన బ్రాహ్మణులు విదేశాలకు వెళ్ళివస్తే, వచ్చిన వెంటనే ప్రాయశ్చిత్తం కోసం రామేశ్వరం వెళ్ళి సేతుస్నానం చేసి రావాలి. మాది సంప్రదాయం పాటించే కుటుంబమైనా నాకు ఇది కుదరలేదు. విదేశాలనుండి వచ్చిన వెంటనే నాకు హెర్నియా ఆపరేషన్ జరిగింది. తరువాత వివాహం. ఆ తరువాత ఇక ఆసుపత్రి పనిలో పడి రామేశ్వరం వెళ్ళడానికి కుదరలేదు.

నాకు గుర్తున్నంతవరకు 1975లో పరమాచార్య స్వామివారి దర్శనానికి నా చెల్లెలు మేనకోడలితో కలిసి కాంచీపురం వెళ్ళాను. అప్పటికే నేను చాలా సార్లు విదేశాలు వెళ్ళి వచ్చాను. నైజీరియా నుండి వచ్చిన మధ్యవయస్కుడైన ఒక బ్రాహ్మణుడు కూడా స్వామివారి దర్శనానికి వచ్చాడు. దాదాపు ఒక అరవై డెబ్బై మంది అక్కడ ఉన్నారు. ఒక గంటసేపు ఈ ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడారు. ఆ సంభాషణ మీకోసం.

పరమాచార్య స్వామివారు అందరిని ఉద్దేశించి, “ఈ పెద్దాయన ప్రాయిశ్చిత్తం చేసుకోవాలా వద్దా అని తెలుసుకోవడానికి నైజీరియా నుండి వచ్చాడు” అని నావంక తిరిగి “బహుశా కళ్యాణరామన్ కి కూడా ఈ విషయంపై అడగాలని వచ్చాడు. రామేశ్వరం వెళ్ళాలా? వద్దా? అని”

మహాస్వామి : “భారతందేశంలో ఎన్ని రామాయణాలున్నాయి?”

కళ్యాణరామన్ : “బహుశా ఒక వంద”

మహాస్వామి : “మన దేశంలో దాదాపు 300 వందల భాషలు మాందలికాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల రామాయణాలు కూడా ఉండొచ్చు. సీతారాములు లంక నుండి అయోధ్యకు ఎలా చేరుకున్నారు?”

కళ్యాణరామన్ : “పుష్పక విమానంలో”

మహాస్వామి : “అవును నిజం. ఇందులొ ఆశ్చర్యం ఏమంటే వాల్మీకి రామాయణంలో గాని, లేదా వేరే ఏ ఇతర రామాయణాలలో కాని లంక నుండి తిరిగి వచ్చిన తరువాత రాముడు కాని ఇతరులు కాని ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు లేదు. మీరు అనుకోవచ్చు సముద్రమార్గంలో వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కాని వారందరు వచ్చినది వాయిమార్గంలో కదా అని”

వారు ఒక ఫ్రెంచి దేశస్థుని పేరు చెప్పి, అతని గురించి విన్నావా? అని అడిగారు. నేను లేదని చెప్పాను.

మహాస్వామి : ”ఇతను ఒక చరిత్రకారుడు. చోళుల ప్రారంభ పరిపాలనా కాలంలో అతను ఈ దేశంలో ఉండేవాడు. అప్పుడు పరిపాలిస్తున్న చోళరాజు కుమార్తెకు తగిన వరుడు భారతదేశంలో దొరకలేదు. ఆప్పుటి కాలంలో హిందూ రాజులు ఇతర దేశాలైన కాంబోడియా, థాయ్ లాండ్, ఇండీనేసియాలలో రాజ్యం చేసేవారు. నువ్వు బాంకాక్ వెళ్ళావా?”

కళ్యాణరామన్ : “వెళ్ళాను పెరియవ”

మహాస్వామి : “అక్కడ ప్రాకారాలకు రామాయణం బొమ్మలతో ఉన్న ప్రఖ్యాత బౌద్ధ దేవాలయానికి వెళ్ళావా? ”

కళ్యాణరామన్ : “వెళ్ళాను పెరియవ”

మహాస్వామి : “సరే. ఆ చోళరాజు కాంబోడియా రాకుమారుణ్ణి తన అల్లుడిగా చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అతన్ని భారతదేశానికి పిలిపించి పెళ్ళి జరిపించాడు. ఆ రాజ దంపతులుతో పాటు చాలామంది రాజపురోహితులు, చలికత్తెలు, పరిచారకులు, సేవకులు కూడా రాకుమారుని రాజ్యానికి వెళ్ళారు.

అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత పురోహితులు భారతదేశానికి తిరిగొచ్చారు. ఆ చరిత్రకారుడు ఈ వివాహం గురించి ప్రతి చిన్న విషయాన్ని పొందుపరిచాడు. అందులో పురోహితులు కాంబోడియా వెళ్ళినప్పుడు గాని మళ్ళా ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు కాని ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు ఎక్కడా రాయలేదు”

“ఈరోజుల్లో అమెరికా వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది?” అని అడిగారు

కళ్యాణరామన్ : “దాదాపు పద్దెనిమిది గంటలు. లందన్ లో దిగితే 24 గంటలు పడుతుంది పెరియవ”

మహాస్వామి : “అది అసలు విషయం. మన శాస్త్రాలలో ఏమి చెప్పారంటే, ఎవరైనా వరుసగా మూడు రోజులపాటు నిత్యకర్మానుష్టానము (రోజూ చేసే సంధ్యాఅవందనం, సమిధాదానం, అహ్నిహోత్రం) చెయ్యకపోతే వారు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆరోజుల్లొ ప్రతిఒక్కరూ రోజూ నిత్యకర్మ చేసేవాళ్ళు. చెయ్యడానికి ఎప్పుడు కుదరదు అంటే సముద్రమార్గంలో ప్రయాణిస్తే.

ఎందుకంటే స్నానానికి శుద్ధజలం దొరకదు కాబట్టి. అందుకే సముద్రం దాటితే, మూడు రోజులు నిత్యకర్మ మానేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బహుశా ఆ పురోహితులు రెండు రోజులలో కాంబోడియా చేరుకుని ఉంటారు మరియు శ్రీరాముడు కొన్ని గంటలలో అయోధ్య చేరుకుని ఉంటారు. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకోలేదు” అని మహాస్వామి వారు మాకు జ్ఞానబోధ చేసారు.

ఇది ఇప్పటికి అన్వయిస్తే ఎంతోమంది కొన్ని వందల సార్లు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంటుంది మూడురోజులపాటు సంధ్యావందనం చేయనందుకు. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి విదేశాలు వెళ్ళిన వారు మాత్రమే అర్హులు కారు. వరుసగా మూడు రోజులు సంధ్యావందనం మానేసిన వారందరూ చేసుకోవలసిందే ప్రాయశ్చిత్తం.

ఇది శాస్త్ర ఇతిహాసాలపై స్వామివారికి ఉన్న పట్టుని చూపించే చక్కటి ఉదాహరణ. చెప్తున్న విషయానికి చిన్న చిన్న ఉదాహరణలతో పామరులకు సైతం అర్థం అయ్యేలాగా చెప్పడం వారికే చల్లుతుంది. నా మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. రామేశ్వరం వెళ్ళకపోవడంవల్ల నాకు పాపం లేదు. కాని ఈనాటి ఈ సంఘటన వల్ల జీవితాంతం ఒక్కరోజు కూడా సంధ్యావందనం గాయత్రి మానకూడదు అన్న నా సంకల్పం ఇంకా బలపడింది.

మహాస్వామి వారు ఇంకా ఇలా చెప్పారు.

ఇంకా కొందరు చెప్తారు మనం ఇంకొక ద్వీపానికి వెళ్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని. ఆఫ్రికా ద్వీపమా?

కళ్యాణరామన్ : అవును

మహాస్వామి : “కాదు. ఆఫ్రికా, ఆసియా మరియు ఐరోపా ఒకే భూభాగం లోనివి. కేవలం వందేళ్ళ క్రితం ఆంగ్లేయులు సుయజ్ కెనాల్ తవ్వగా అది పేరుకు ద్వీపం అయ్యింది.

నిజానికి ఒకప్పుడు ఆస్ట్రేలియ, ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా ఒకే పెద్ద భూభాగం. కొన్ని లక్షల సంవత్సరాలలో సముద్రము మధ్యలో రావడం ఆ భూపలకలు దూరం జరిగాయి. అందువల్ల అవి ప్రత్యేక ఖండాలు అయ్యాయి”

ఇది వారికున్న భౌగోళిక, చారిత్రక, భూగర్భ శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. పరమాచార్య స్వామివారు అన్ని శాస్త్రాల్లోను ప్రావీణ్యులు.

చివరగా నైజీరియా నుండి వచ్చిన పెద్దమనిషి కాని, కళ్యాణరామన్ కాని ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు మూడు రోజుల లోపే ప్రయాణం చేశారు.

కాని మూడు రోజులకంటే ఎక్కువ సంధ్యావందనం వదిలినవారు మాత్రం తప్పక ప్రాయశ్చిత్తం చేసుకుని తోరవలసిందే. ఎట్టి పరిస్థితిలోను నిత్యకర్మను పాటించి తీరవలసిందే.

ఇది సాక్షాత్ ఈశ్వర వాక్కు

--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore