పిల్లల నుంచి బాల్యం దూరం చేస్తున్న పెద్దలు
మనుషులు-మనుషులుగా..
నేను చుట్టూ గోడకట్టిన కాలనీలో (గేటెడ్ కమ్యూనిటీ) నివాసం ఉంటున్నాను. చేరి నెల రోజులయ్యింది. బయటకు పోవడానికీ, లోపలికి రావడానికి ఒక్కటే గేటు ఉంది. గేటు మూస్తూ తెరుస్తూ గేటు దగ్గర ఒక కాపలాదారుడు ఉన్నాడు. ఆ గేటు పక్కన ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకొమ్మ ఒకటి ఇంటి ప్రహరీ గోడ దాటి కాలనీ రోడ్డు మీదికి వచ్చింది. ఆ కొమ్మకు రెండు మామిడి పిందెలు పుట్టాయి. ఆ కొమ్మకింద ఒక ఎర్రటి రబ్బరుబంతి ఉంది.
నేను రోజూ ఆ దారిన పోతూ ఆ బంతిని, మామిడి పిందెలను గమనిస్తూ ఉండేవాడిని. పది రోజులు గడిచాయి. ఆ మామాడి పిందెలు పెద్దవవుతూ ఉన్నాయి. ఆ బంతి కదలకుండా అక్కడే వుంది. రెండు నెలలు గడిచాయి. కాయలు బాగా బరువెక్కి కొమ్మ వంగింది. ఆ బంతి అటూ ఇటూ కదలకుండా అక్కడే ఉంది. నాకు ఆ దృశ్యాన్ని చూసి నప్పుడల్లా అసహజంగానూ, అసహనంగానూ ఉండేది. మరోవైపు ఆశ్చర్యమూ కల్గింది.
ఈ కాలనీలో ఇంత నిజాయితీగా మనుషులున్నారా? బంతిని ఆ కాయల్ని ముట్టుకోనీయకుండా పిల్లల్ని నిజాయితీపరులుగా పెంచుతున్నారా? అసలు ఆ కాలనీలో ఒకరూ, ఇద్దరూ తప్ప పిల్లలు ఎప్పుడూ సందడిచేస్తూ కనిపించడం లేదు ఎందుకని?
ఆ ఇంటికి రెండిళ్ల ఇవతల ఒక ఇంటిముందు అరుగు ఉంది. ఆ అరుగు మీద ఎప్పుడూ తెల్లటి బట్టలు ధరించిన ఒక వృద్దుడు కూర్చుని ఉంటాడు. ఎల్లప్పుడూ అతను చేతిలో ఒక పుస్తకం వుంటుంది. ఒక రోజు ఆ వృద్దుడిని పలకరించాను. “ఏమండీ ఈ కాలనీలో దొంగతనాలు జరగవనుకొంటాను” అని అన్నాను.
“అలా.అని. ఎందుకనుకొంటున్నారు?” ఎదురు ప్రశ్నించాడు.
“అదిగో ఆ బంతిని రెండు నెలలుగా ఏ పిల్లవాడు తీయలేదు. ఆ మామిడికాయలను ఎవరూ తుంచలేదు."
“దానికి మీరు సంతోషిస్తున్నారా? ”
“సంతోషించడం లేదు. కాని విచిత్రంగా ఉంది. పిల్లలు కూడా ఒకరూ ఇద్దరూ తప్ప ఎవరూ కనిపించడంలేదు”.
“మీరు సంతోషించినట్లు చెప్పి ఉంటే నేను బాధపడి ఉండే వాడిని. మీరు వాటిని గమనిస్తూ. ఉండడం, వాటిగురించి ఆలోచిస్తూ ఉండడం మంచి విషయం. అవి రెండూ ఇంతకాలం అక్కడ ఉండడం చాలా విచారించదగ్గ విషయం. పిల్లలు బాల్యాన్ని కోల్పోయారు. ఇది కాలనీ వాసుల నీతి నిజాయితీలకు సంబంధించిన విషయం గాదు. ఇక్కడున్నవాళ్లు ఎక్కువమంది వ్యాపారస్థులు, ప్రభుత్వ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు వీళ్లంతా పిల్లలకు ఏ నీతులు చెబుతారు. వీరి జీవితాలు చూస్తూ పిల్లలు వీరినుండి ఏమి నేర్చుకుంటారు.
పిల్లలు ఉదయం లేస్తూనే ట్యూషన్లకెళ్తారు. ట్యూషన్ల తర్వాత బడికి వెళ్తారు. బడినుండి రాగానే మళ్లీ ట్యూషన్, సెలవు రోజుల్లో జిమ్ములు, స్విమ్మింగ్లు, డ్యాన్సు క్లాసులు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే టీవీ, సెల్ ఫోన్లు ఉన్నాయి గదా! వారికంటూ స్వంత ఆలోచనలు ఇష్టాయిష్టాలు ఎక్కడున్నాయి? మీకు తెలుసా ఒకప్పుడు పిల్లలు నడవడానికి ముందు మోకాళ్లతో దోగాడేవాళ్ల, మోకాళ్లదగ్గర చర్మం నల్లగా గట్టిపడి ఉండేది. ఇప్పుడు దోగాడనీయడం లేదు. నేరుగా నడిపించడమే. కిందపడనీయడం లేదు. పడి లేచి నడవడంలో వున్న అనుభూతిని పొందనీయడం లేదు. అసలు పిల్లల్ని పదేళ్ల వరకు వాళ్లు తినే ఆహారాన్ని కూడా వాళ్ల చేతుల్తో తిననీయడం లేదు. వాళ్లకంటూ స్వంత ఆటలు స్వంత అభిప్రాయాలు ఏమీ లేవు.
ఊరినుంచి నేనొచ్చి మూడు నెలలయింది. మనవళ్లతో మనవ రాళ్లతో ఆడుకోవాలని ఉండదా? కొడుక్కి ఒక కూతురూ ఒక కొడుకు. ఐదేళ్లలోపు పిల్లలు. కార్లో ఎక్కడం కాన్వెంట్లకు వెళ్లడం - సాయంకాలం కార్లో నుండి దిగడం బాత్ రూంకో బెడ్ రూంకో వెళ్లడం. ఏదైనా తీరికవుంటే టీవీ ముందు కూర్చోవడం - నాతో మాట్లాడానికి టైం ఎక్కడుంది. ఇక నాకు పుస్తకాలే స్నేహితు లయ్యారు.
Quote of the day
I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…
__________Rabindranath Tagore