Online Puja Services

శుక్రాచార్యుడు కూతురినే శపించిన కచుడు

18.219.8.51
రాక్షస గురువు ఎవరు? 
 
మృతసంజీవిని విద్యని దేవతలు ఎలా తెలుసుకోగలిగారు? 
 
శుక్రాచార్యుడు కూతురిని  కచుడు ఎందుకు శపించాడు? 
 
పురాణాల ప్రకారం క్షిరసాగరమధనం జరుగక ముందు ఇది జరిగినది అని  చెబుతారు.
 
ఒక రాక్షస గురువుకి మృతసంజీవిని విద్య తెలియడంతో దేవతలు రాక్షసులను సoహరించినప్పటికీ ఆ విద్యతో ఆ గురువు వారిని మరల బ్రతికించేవాడు. మరి ఆ రాక్షస గురువు ఎవరు?
 
ఇంకెవరు? రాక్షస గురువు శుక్రాచార్యుడు. అయితే దేవతలు, రాక్షసులు  మధ్య అనేక యుద్ధాలు జరిగాయి.  అందులో రాక్షసులు, దేవతలు చనిపోతుండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను తిరిగి మళ్ళి బ్రతికించేవాడు. కానీ దేవతలకు ఆ విద్య తెలియకపోవడంతో వారు చనిపోతూ ఉండేవారు.
 
ఇక అప్పుడు దేవతలు శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి ఆ విద్యని తెలుసుకొని రాగల సమర్థుడు ఎవరు అని ఆలోచిస్తుండగా బృహస్పతి కుమారుడైన కచుని దగ్గరికి వెళ్లి ఎలా అయినా ఆ విద్యని పొందాలని ప్రార్ధించగా,
 
అప్పుడు కచుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్లి గురుదేవ అని సాష్టంగా నమస్కారం చేసి శిష్యుడు గా స్వీకరించమని వేడుకొనగా, నీవంటి అర్హుడని శిష్యుడిగా స్వీకరించడం నాకు సంతోషంగా ఉందంటూ తన శిష్య బృందంలో చేర్చుకుంటాడు.
 
ఇలా ప్రియ శిష్యుడిగా ఉంటున్న కచుడ్ని చూసి శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని అతనితో ప్రేమలో పడుతుంది. అయితే రోజు రోజుకి కచుడి మీద శుక్రాచార్యుడు ఇష్టం చూపించడం తట్టుకోలేని రాక్షసులు కచుడిని సంహరించగా అప్పుడు శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో చూసి అతడిని మరల బ్రతికిస్తాడు.
 
 ఇలా ఎన్ని సార్లు సంహరించిన మరల బ్రతికిస్తున్నాడని ఆ రాక్షసులు కచుడిని సంహరించి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి ఇస్తారు.
 
ఆ తరువాత జరిగిన దానిని తెలుసుకున్న శుక్రాచార్యుడు కచుడు బ్రతకాలంటే నేను మరణించాలి, నేను కూడా బ్రతకాలంటే మృతసంజీవిని విద్య కచుడికి నేర్పించాలని ముందుగా కడుపులో ఉన్న కచుడికి విద్య నేర్పించగా అతడు కడుపును చీల్చుకుంటూ వచ్చి ఆ విద్యతో మరణించిన తన గురువుని మళ్ళి బ్రతికిస్తాడు.
 
తను వచ్చిన కార్యం ముగిసిందని తలచి కచుడు గురువు దగ్గర సెలవు తీసుకొని దేవలోకానికి బయలుదేరుతుండగా దేవయాని తన మనసులో మాట చెప్పి వివాహం చేసుకోమని ప్రార్ధించగా దానికి కచుడు గురువు కూతురు నీవు నాకు సోదరి లాంటిదానివి ఇది తగదు అని చెప్పి వెళ్లిపోతుంటే, ఆగ్రహించిన ఆమె నీవు గెలుచుకున్న విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది అని శపిస్తుంది.
 
నేను నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడకుండా పోయిన పర్వాలేదు నేను నేర్పించినవారికి ఉపయోగపడుతుంది, ఇంతటి కఠినాత్మురాలైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అంటూ తిరిగి శాపాన్ని పెడతాడు.
 
ఇలా మృతసంజీవిని విద్య నేర్చుకున్న కచుడు తిరిగి స్వర్గానికి వచ్చి దేవతలకు ఆ విద్య నేర్పించాడని పురాణం.
 
- L. రాజేశ్వర్ 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya