Online Puja Services

శారదాదేవి వివేకానందుడికి పెట్టిన పరీక్ష

18.221.183.34
రామకృష్ణ పరమహంస సమాధి ఐన తరువాత వివేకానందుడు అమెరికా వెళ్ళి భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్య ప్రపంచానికి విప్పి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకు మాతృ సమానురాలయిన రామకృష్ణ పరమహంస భార్య ఐన శారదాదేవి ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళాడు. ఆమె యింట్లో వంట చేస్తూ వుంది. వివేకానందుడు ఆమెకు నమస్కరించి ‘అమ్మా! నేను అమెరికా వెళుతున్నాను. భారతీయ ధర్మాన్ని పాశ్చాత్య ప్రపంచానికి చాటి చెప్పడానికి వెళుతున్నాను. మన ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని తెలుపడానికి ఈ ప్రయాణం పెట్టుకున్నాను. యింత పవిత్ర కార్యాన్ని నిర్వర్తించే ముందు మాతృమూర్తి ఐన మీ ఆశీర్వచనం నాకు అనివార్యం. మీరు నన్ను ఆశీర్వదించందే నా యాత్రకు సంపూర్ణత, సమగ్రత చేకూరదు’ అన్నాడు.
 
శారదాదేవి వంట పనిలో వుంది. వివేకానందుడు చెప్పినవన్నీ విన్నది. వెంటనే స్పందించలేదు.
 
వివేకానందుడు ఆశ్చర్యపోయాడు. నేనేం తప్పు చేశాను? అనుకున్నాడు. శారదాదేవి కాసేపటికి ‘నేను ఆ విషయం గురించి కొంత ఆలోచించి కానీ చెప్పలేను’ అంది.
 
వివేకానందుడు విస్తుపోయాడు. ఆశీర్వదించడానికి ఆలోచించడమా?’ అనుకున్నాడు. పరిస్థితి చిత్రంగా వుంది. వింతగా అనిపించింది.
 
శారదాదేవి వంట పనిలో వుంటూనే వివేకానందుణ్ణి గమనించింది. కాసేపటికి ‘నాయనా! కూరగాయలు తరగాలి. అక్కడ వున్న కత్తిని కాస్త అందివ్వు అంది.
 
వివేకానందుడు కత్తినిచ్చాడు. ఆమె కత్తి తీసుకుని చిరునవ్వుతో ‘నాయనా! నిన్ను హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. నీవల్ల అందరికీ మేలు జరుగుతుంది. నీ ప్రయాణం విజయవంతమవుతుంది. వెళ్ళిరా’ అంది.
 
వివేకానందుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! నీ ఆశీర్వాదానికి, ఈ కత్తికి వున్న సంబంధమేమిటి?’ అన్నాడు.
 
శారదాదేవి ‘వుంది నాయనా! నేను కత్తిని అడిగినపుడు నువ్వెలా యిస్తావో పరిశీలించాను. కత్తి పిడిని పట్టుకుని యిస్తావా? లేదా కత్తి కొనను పట్టుకుని పిడిని నావేపు పెట్టి అందిస్తావా? అని గమనించాను.
 
కత్తి కొనను నీ చేతిలో పట్టుకుని పిడిని నాకు అందించావు. దాన్ని బట్టి నీ తత్వం గ్రహించాను.
 
నీలో అనురాగముంది, అధికారం లేదు, ఆత్మరక్షణ లేదు, ప్రతీకారం లేదు. నువ్వు కత్తి కొనను పట్టుకొన్నావు. దానివల్ల నీ వేలు తెగే వీలుంది. కానీ దాన్ని నువ్వు లక్ష్యపెట్టలేదు. నీ కన్నా నా భద్రతే నువ్వు ముఖ్యంగా భావించావు. యిది చిన్ని విషయమే కావచ్చు. కానీ ఇది నీ మనస్తత్వాన్ని తెలుపుతోంది. నీకు అంతా మేలే జరుగుతుంది.
 
ఇతరుల మేలు కోరేవాడు ఆత్మరక్షణ గురించి ఆలోచించడు’ అంది. వివేకానందుడు శారదామాత పాదాల్ని స్పర్శించాడు.
 
- కిరణ్ కుమార్ నిడుమోలు 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore