స్వస్తిః ప్రజాభ్యః - ఈ శాంతి మంత్రం విశ్వ శ్రేయస్సు కోసం
స్వస్తిః ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు!
విశ్వ శ్రేయస్సును కాంక్షించే శాంతి మంత్రమిది. ‘స్వస్తిః’ అంటే క్షేమం, శుభం. మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం అనుకుంటే.. క్షేమం (భౌతిక జీవితం), శుభం (ఆధ్యాత్మిక జీవితం) రెండు పట్టాలు. రెంటి మధ్య సమదూరంతో పాటుగా సమన్వయం సాధిస్తేనే రైలు గమ్యాన్ని చేరుతుంది. అలా రెంటినీ సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరడమే జీవిత పరమార్థం. ఈ రెంటిలో దేన్ని విస్మరించినా ప్రయాణం అర్ధాంతరంగా ముగుస్తుంది. కాబట్టి ఈ రెండూ (క్షేమం, శుభం).. ‘ప్రజాభ్యః’ అంటే ప్రజలకు లభించును గాక. ‘పరిపాలయంతాం’.. అంటే విశ్వ విశ్వాంతరాల్లో ఉన్న జీవులందరికీ క్షేమాన్ని, శుభాన్ని అందించి భగవంతుడు పరిపాలించుగాక అని అర్థం.
‘న్యాయేన’.. స్వధర్మమును తప్పకుండా ఉండడం న్యాయం. ఏ విధమైన బయటి ప్రలోభాలకూ, భయాలకూ లోనుగాకుండా అంతరంగ ప్రబోధాన్ని అనుసరించి నడుచుకోవడం స్వధర్మం అవుతుంది. దాన్ని అనుసరించడం న్యాయం. ‘మార్గం’ అంటే త్రోవ, అన్వేషణ. మన జీవితానికి ఏది భద్రతనిస్తుందో దాన్ని నిరంతరం అన్వేషించడం మార్గం. ‘భద్రత’ అనేది.. ఆరోగ్యం, సంపద, గౌరవం ఈ మూడింటి సమష్టి తత్త్వం. ఇతరుల సర్వాంగీన వికాసంలో మన ఆనందాన్ని, వికాసాన్ని చూపేదే భద్రత. ఇది ఇతరుల అస్తిత్వాన్ని, వారి సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తుంది. ఈ మార్గాన్ని ప్రజలు, పాలకులు అన్వేషించాలి. నిజానికి.. ‘‘ప్రజల జీవితం కోసం రాజ్యం ఉనికిలోకి వచ్చింది. ప్రజలకు మంచి జీవితాన్ని ప్రసాదించడం కోసమే దాని మనుగడ కొనసాగుతుంది’’ అంటాడు అరిస్టాటిల్. రాజ్యాన్ని నడిపించేది పాలకులు. కాబట్టి ప్రజలకు పాలకులకు కూడా స్వస్తి.
‘గోవులు’.. ధనానికి, సంపదకు, భౌతిక ప్రగతికి ప్రతీకలు కాగా, ‘బ్రాహ్మణులు’ జ్ఞానానికి, మార్గదర్శనకు ప్రతీకలు. గోబ్రాహ్మణులకు శుభం కలిగితే వ్యవస్థ సుఖసంతోషాలతో ముందుకు సాగుతుంది. జ్ఞానం వల్ల మంచి చెడులు అవగతమవుతాయి. సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది. కొత్త ఆవిష్కరణలు వెలుగు చూస్తాయి. సంపద వినియోగంలో స్పష్టత వస్తుంది. గోవులలో, జ్ఞానంలో ప్రఛ్చన్నంగా ఉండి నడిపించేది శ్రామిక శక్తి, వ్యాపార నిర్వహణ. వీటి వల్లనే సంపద సృష్టింపబడుతుంది. వీటిని సమన్వయం చేసుకోవడం ద్వారా సమాజం వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. అర్హత, అవసరం ప్రాతిపదికగా ఎవరికి కావలసినవి వారికి అందడం వల్ల పరపీడన, స్వార్థచింతన లాంటివి సమసిపోతాయి. సనాతన ధర్మం ఈ అభ్యుదయకారకమైన స్వస్తి వచనాన్ని నిరంతరం సూచనగా ఇవ్వడం ద్వారా చైతన్యం కలిగిన సమాజానికి చేతనత్వం కలిగించే ప్రయత్నం చేసింది, చేస్తోంది.
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి