మంత్రం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి
ఉపనిషత్తులు మంత్ర రూపంలో ఉంటాయి. ఏదైనా ఒక విషయం బాగా అర్థం కావాలి అన్నా, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అన్నా మూడు విషయాలు అవసరం అని పెద్దలు చెబుతారు.
*మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం* ||
మొదట మంత్రం మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, ఈ మంత్రం మనకు రక్షకం అని అనిపించాలి. తరువాత మంత్ర ప్రతిపాద్య దేవత ఉంటుంది, ఆ దేవతపై విశ్వాసం కావాలి. నీవు కోరినవి తీర్చడానికి, నీకు ఏవి అనిష్టమో వాటిని దూరం చేయడానికి ఆ దేవతకు శక్తి ఉన్నదని విశ్వాసం ఉండాలి. మంత్రాన్ని అనుగ్రహించిన గురువుపై విశ్వాసం ఉండాలి. అసలు మంత్రం అంటే మన్-త్ర మననం చేయు వాడిని కాపాడునది కనుక దాన్ని మంత్రం అంటారు. ఎవరెవరు దేన్ని తలిస్తే రక్షణ పొందుతారో దాన్ని మంత్రం అంటారు. రక్షణ అంటే ఏమిటి ? ఇష్టప్రాపణం అనిష్ట నివారణం రెండు చేస్తే అది రక్షణ. విభీషణుడు వచ్చి రామచంద్రుడిని రక్షించమని కోరాడు. మరి రక్షణ ఎలా పొందాడు ? విభీషనుడికి ఇష్టం లేనిది రావణాసురుడి పొందు. ఇష్టమైనది రామచంద్రుడి ఆశ్రయం. ఇవి రెండూ పొందాడు. రక్షణ అంటే కావల్సింది ఇవ్వడం ఇష్టం లేనిది దూరం చేయడం. కష్టం ఉండకూడదు అని అనుకుంటాం, ఇష్టమైనది కావాలని అనుకుంటాం. మనలో తొలగాల్సినవి చాలా ఉంటాయి. అజ్ఞానం తొలగాలి. వ్యాదులు తొలగాలి. శత్రువులు ఉండకూడదు. కావల్సినవి ఎన్నో ఉంటాయి. జ్ఞానం, సంపద, కీర్తి, బంధువులు ఇలా ఎన్నో. ఈ రెంటినీ చేయగలిగేది మంత్రం. మంత్రం ఎలా ఇవ్వగలదు ? మంత్రం అనేది మనం తలిచేది, ఇచ్చేది మంత్ర ప్రతిపాద్య దేవత. ఇంత విశాల ప్రకృతిని నడిపే దేవతా విశేషాలు ఎన్నో ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు ఇలా ఎన్నో. వరుణ, వాయు, అగ్ని అని ఇలా పేర్లు పెట్టుకొని ఉన్నాం. మనం చూసే నీరు వరణుడని కాదు, అవి వరణుడి దేహంలో ఒక భాగం. ఆ నీటి ద్వారా ఆ దేవతను ఆరాధన చేయవచ్చు. అట్లానే వాయు, అగ్ని, యమ ఇలా దేవతల పేర్లు, వారి వల్ల మనం బ్రతుకుతున్నాం.
దేవాం భావయతానేన తేదేవా భావయంతువః |
పరస్పరం భావయంతః శ్రేయం పరమ వాప్స్యతః ||
ఇలా దేవతలు మనచుట్టూ ఉన్నారు, వారికోసం ఏదైనా చేయి, తిరిగి వారు నీకోసం ఏదైనా చేస్తారు. ఇలాగా కాక వారు ఇచ్చేది తింటూ తిరిగి వారికి ఇవ్వని వారిని చోరులు అంటారు. "తేతు అఘం గుంజతే పాపాః" పాపాన్ని వండుకొని తినే వాళ్ళు సుమా! ఆయా దేవతలని ఆరాధించాలి అంటే వారి పేరుతో కదా పిలుస్తాం. నామం అంటే వంచునది అని అర్థం. ఈ దేవతల్ని నియమించే పరంబ్రహ్మ తత్వం ఒకటుంది, ఇదిగో ఇదంతా నా విరాట్ రూపం అని చూపాడు పరమాత్మ. అట్లా అందరి సహకారం పొందాలంటే ఆ పరంబ్రహ్మ తత్వాన్ని పిలవాలి. పిలవాలి అంటే పేరు కావాలి. ఆ పేర్లకే మంత్రాలు అని పిలుస్తాం. కావాలంటే వరుణ దేవతని ప్రసన్నం చేసుకోవాలంటే వరుణ మంత్రాలు ఉన్నాయి. ఒక్కో దేవతకీ మంత్రాలు ఉన్నాయి. అదే కాక పరమాతమే ప్రసన్నం చేసుకొనే మంత్రాలూ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆయా దేవతను ఆరాధన చేస్తాం. మనకు మొదట శరీరం బాగుండాలి. శరీరం అంటే ఇది పంచభూతాలతో తయారయ్యింది. మట్టి, నీరు, అగ్ని, వాయువు మరియూ ఆకాశం. ఒక్కో భాగం తగ్గిపోతే తిరిగి ఆభాగాన్ని అందిస్తే శరీరం ఆరోగ్యంగా ఉన్నది అని అర్థం. మట్టి భాగం తగ్గితే అప్పుడు ఆకలి వేస్తుంది. అప్పుడు మట్టినుండి ఏర్పడే అన్నం, కూరగాయలు ఇలా ఇస్తుంటాం. నీల్లు తగ్గిపోతే దాహం వేస్తుంది. నీరు త్రాగితే దాహం తీరుతుంది. ఇలా మనకు కావల్సినవి ఇవ్వడానికి దేవతా విశేషాలు ఎన్నో ఉన్నాయి, ఇచ్చిన దానితో పని ఆచరించు. అలా బ్రతకాలి. ఇది మొదటి మెట్టు.
ఇట్లాంటి దేవతలు ఎందరు ? ముక్కోటి దేవతలు అనో, ముప్పైమూడు కోట్ల దేవతలనో చెప్పేవారు. కానీ మరి ఇప్పుడో ? మనుషులకు తెలివి ఎక్కువైంది! ఎంత మంది ఉంటే అంత దేవతలు. కొత్త కొత్త దేవతల్ని పుట్టిస్తున్నారు! కొంతమంది మనుషులే దేవతలు అయిపోతున్నారు. ఈ విషయం ప్రక్కన పెట్టి, దేవతలందరినీ ఆరాధించడం అనేది సాధ్యమేనా ? వారి లెక్కనే తెలియటం లేదు. సర్వ దేవతలని నడిపించే పరం బ్రహ్మ తత్వాన్ని గుర్తించి ఆరాధన చేస్తే అందరికీ తృప్తి లభిస్తుంది. దేవతలంతా పరమాత్మ యొక్క దేహంలోని భాగాలు. మనం చెట్టుకి నీరుపోయాలంటే పువ్వులకీ, ఆకులకీ పోస్తామా ? వేరుకి పోస్తాం. అట్లానే ఇందరి దేవతలను అనుకూలం అయ్యేట్టు ఆ మూలదేవత చేస్తుంది. అట్లా నీకు ఇష్టమైనవి ఇచ్చి, అనిష్టాలని దూరం చేస్తుంది. అట్లా రక్షణ ఏర్పడుతుంది.
ఇట్లా మంత్రం, మంత్రప్రతిపాద్య దేవత, మంత్రాన్ని ఇచ్చే గురువు ఈ మూడింటి యందు సమాన ప్రతిపత్తి ఉంటే మంత్రం ఫలిస్తుంది.