Online Puja Services

శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా?

3.147.63.135
శ్రీరామునకు శబరి ఎంగిలి విందు వాల్మీకమేనా? 
 
శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని. శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు. ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది.

రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి ,రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత మాగురువులు చెప్పినప్పటినుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది.రాముని కోసం ఎంతో కాలం గా సంపాదించి. భద్ర పరచిన ఫల,మూలాదులను ఆయనకు అర్పించింది.

“ మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభే
తవార్ధే పురుషవ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్. “ వా.3-74.17
అని మాత్రమే వాల్మీకం. 
 
 
దీన్ని వ్యాఖ్యానిస్తూ గోవిందరాజీయం లో -
“ వన్య శబ్దేన ఫలమూలాదికముచ్యతే.” 
{ చతుర్వ్యాఖ్య. పు. 1276 .}
 
దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచిపండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి.  ఇది వాల్మీకం. అంటే” ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకం లో లేదు.

కాని” శబరి “పేరు తో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు. మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది. పద్మపురాణం లో మనకు ఈ  విందు ప్రస్తావన కన్పిస్తోంది.
 
” ప్రత్యుద్గమ్య ప్రణమ్యాథ నివేశ్య కుశవిష్టరే
పాదప్రక్షాళనం కృత్వా తత్తోయం పాపనాశనం 
 
ఫలాని చ సుపక్వాని మూలాని మధురాని చ
స్వయమాసాద్య మాధుర్యం పరీక్ష్య పరిభక్ష్య చ
పశ్చాన్నివేదయామాస రాఘవాభ్యాం దృఢవ్రతా”
 
పద్మపురాణ భాగంలో” పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది.కాని దీనిలో కూడ శబరి తాను తిన్నపండునే రామున కిచ్చినట్లు ఎక్కడాలేదు.
 
రాముడు చిత్రకూటానికి వచ్చినప్పటినుండి, రాముడు తన ఆశ్రమానికి వస్తాడనే గురువుల మాట మీద ప్రత్యయం తో అప్పటి నుండే కందమూలాలను, నిలవఉండే ఫలాలను, సంచితం-అంటే, ఏరి కోయించి సంపాదించి భద్ర పరచింది. ఇప్పుడు రాముడు వచ్చిన తరువాత వానిని బయటకు తీసి పరీక్షించి, జాతికొక దాన్ని తిని, చెడిపోలేదు అని నిర్ధారణ చేసుకొని రామునికి సమర్పించిందనేది లక్ష్యార్ధం.

శ్రీరాముని శ్రియ:పతి గా నెరింగి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవితకాలాన్ని పొడిగించుకుంటున్న మహాతపస్విని శబరి. అట్టి మహానుభావునకు తాను అర్పించే విందులో మాధుర్యం కొఱవడితే ఓర్వలేక, అపచార భయం చేత ,భక్త్యతి శయం చేత శబరి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండ వచ్చు.వృద్ధ, జ్ఞానవైరాగ్య సంపన్న,గురుశుశ్రూషా పరాయణ అయిన శబరి లో పరమభక్తి పరాకాష్ఠకు చేరి , గోదాదేవి తాను ధరించిన మాలలను భగవంతునికి సమర్పించినట్లు, విదురుని విందు లో శ్రీ కృష్ణునకు అరటిపండు ఒలిచి పండు పారవేసి తొక్కుఅందించినట్లు, పండ్లను రుచి చూచి స్వామికి సమర్పించిందని భావించిన జానపదులు “శబరి విందు’’ను మధురాతి మధురంగా గానం చేసుకుంటున్నారు .
 
భక్తునికి ఇష్టమైన దాన్ని ఎంతకష్టమైనా భరించడానికి భగవంతుడు సిద్ధంగా ఉంటాడన్నవిషయం బాణాసురుని ఇంటికి కాపలా కాయడం దగ్గరనుండి మానవుడిగా జన్మించి బాధలు పడడం వరకు ఎన్నో విషయాల్లో ఋజువవు తూనే ఉంది..శబరి శ్రీ రామచంద్రునకే విందునందించిన పరమ భక్తురాలు. కాని శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరిఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన..

- శేషావధాని, కంచి మఠం 

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya