Online Puja Services

శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఇంట్లో ఉండి తీరాలి

18.119.122.140
ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము
 
శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు. ఉండి తీరాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు.
 
కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం.
 
పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ.
 
రాముడు అకారానికి ప్రతినిధి, 
యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!. 
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ.
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ.
 
అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది.
 
రాముడికి ఒక్కడికే రెండు పేర్లు ఉంటాయి. వీర రాఘవ, విజయ రాఘవ. ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. రాముడు ఆర్తత్రాణపరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం. చెడు చేసేవారు ఇంట్లోకి రాలేరు.
 
కానీ పూజకు సంబంధించినంత వరకు పంచాయతనంలో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని పెట్టుకుని చేయాలి అన్న కోరిక విష్ణువుయందు సమన్వయం చేసుకోవాలి. వేంకటేశ్వరుడు ఉన్నాడు మూర్తిలో. రామచంద్రమూర్తియే వేంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు ఆయన చేతిలో దశావతారాలూ చూశాడు. అన్నీ వేంకటేశ్వర స్వామివారే. అయినప్పుడు వేంకటేశ్వరుడే రామచంద్రమూర్తి.
 
మనస్సుతో చూడగలిగినటువంటి శక్తికి ఎదిగి ఉంటే హనుమ ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లు సీతారామలక్ష్మణులు అక్కడ ఉన్నట్లు భావన చేసి వేంకటేశ్వరుడి పాదాల దగ్గర రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నట్లు పూజ చేయడం ఉత్కృష్టమైనటువంటి పూజ.
 
కాదంటే దానికి మార్గం ఏమిటంటే తూర్పు గోడకు పెట్టకుండా దక్షిణానికి తిరిగి మీరు నమస్కారం చేయవలసిన అవసరం రాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని ఉంచుకొని ఆ మూర్తి వంక చూసి తులసీ దళాన్ని వేంకటేశ్వరుని పాదాల దగ్గర వేస్తూ ఉండవచ్చు. మీరు ఎవరిని అనుకుని వేస్తారో ఆయనకే పడుతోంది అని భావన చేస్తే చాలు..
 
సుప్రభాతంలో ’అవనీ తనయా కమనీయకరం’ అని సీతమ్మ తల్లి భర్తగా రామచంద్రమూర్తిగానే వేంకటేశ్వరుడికి. అసలు సుప్రభాతం ప్రారంభం ’కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్!!’
 
రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు. ఆ శ్లోకంతో ప్రారంభం. ఆ రాముడే వేంకటేశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నాడు. ఇప్పటికీ ఆనందనిలయ విమానంలో స్వామివారి ప్రక్కన ఉన్న వేదిక మీద రామచంద్రమూర్తి యొక్క మూర్తి ఉంది. త్రిభంగి స్వరూపంగా కోదండం పట్టుకొని ఉంటాడు. ఊరేగింపుకు బయటికి వస్తూ ఉంటాడు. కాబట్టి వేంకటేశ్వరుడే రాముడు. చూడగలిగి పూజ చేస్తే మంచిది. కాదు మాంసనేత్రంతో కూడా అలా చూసి చేయాలని ఉంది అంటారా తప్పు అనను.
 
పట్టాభిషేకమూర్తిని ఒక చోట పెట్టుకోండి. ఆయన వంక చూస్తూ ఈయన పాదాలమీద తులసీదళం వేయండి. సంప్రదాయానికీ భంగం రాదు. మనస్సులో కోరిక తీరడానికీ ఇబ్బంది రాదు. అలా పూజామందిరాన్ని నిర్వహించుకోండి.
 
(సేకరణ)
- Nateshwar Kotte 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore