శివుడు శాంతస్వరూపుడు
శివుడు రౌద్రంగానే ఉంటాడు అని శాస్త్రంలో ఎక్కడా లేదు.
"శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం" - శివుడు శాంతస్వరూపుడు. శాంతం ఆయన తత్త్వం.
శివ అనేశబ్దానికి శాంతం అని ఒక అర్థం. నిర్వికాయ పరంజ్యోతియే శివుడు. పరమేశ్వరునికి రెండు విధాలైన స్వరూపాలున్నాయని శాస్త్రం చెబుతోంది.
"ఘోరాన్యా ఘోరాన్యా రుద్రస్య పరమాత్మనః ద్వే తనూ తస్య దేవశ్య" అని మహాభారతోక్తి. ఘోరము, అఘోరము అను రెండు స్వరూపములు. తీవ్రమై బాధకరమైఉన్నవి ఘోరములు, శాంతమై ప్రసన్నమై ఉన్నవి అఘోరములు. శక్తి ఎప్పుడూ రెండు విధములుగా వ్యక్తమవుతుంది. రెంటివల్లా ప్రయోజనం ఉన్నది. ప్రతి దేవతకూ ఈలక్షణాలు ఉంటాయి.
ఉదాహరణకు ప్రచండమైన సూర్యుడు రౌద్రంగా, తీవ్రంగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోయినప్పటికీ అది కూడా కావాలి జగతికి. జలం ప్రసన్నంగా ఉండి మన ప్రాణాలు నిలుపుతుంది. అదే జలం ఉప్పెనయై, వరదయై వచ్చినప్పుడు ఘోరంగా రౌద్రంగా కనపడుతుంది. కనుక పంచభూతములలో కూడా రౌద్ర, సౌమ్య లక్షణములు రెండూ ఉంటాయి. శక్తి సౌమ్య రౌద్రములుగా వ్యాపించి ఉంటుంది ప్రపంచమంతా. ఆశక్తి పరమేశ్వరునిది. రౌద్రభావాన్ని చెప్పినప్పుడు రుద్రుడుగాను, సౌమ్య భావం చెప్పినప్పుడు శివునిగాను అంటున్నాం.
అసలు రుద్ర అనే పదానికి అర్థం "రుజాం ద్రావయతీతి రుద్రః" అనీ "రుర్దుఃఖం దుఃఖ హేతుర్వా తద్ ద్రావయత యః ప్రభుః రుద్ర ఇత్యుచ్యతే సద్భిః- రుత్ అనగా దుఃఖము లేదా దుఃఖానికి హేతువు. సర్వ కారణ కారణుడగు శివుడు దానిని పారద్రోలును గనుక రుద్రుడు అనబడును
- K. మునిబాలసుబ్రహ్మణ్యం