పాపానికి తండ్రి లోభం !
అతడు కాశీలో చదువుకున్న పండితుడు. ఒకనాడు అతడి భార్య ప్రశ్నించింది " ఏమండీ! పాపానికి తండ్రి ఎవరు? " అని. ఇతడు పుస్తకపు పురుగు మాత్రమే. చదువుకొన్న గ్రంధాలలో సమాధానం లభించలేదు. భార్య ముందు మౌని అయినాడు.
ఒకరోజు బజారుకు కాయగూరల కోసం బయలుదేరగా దారిలో ఒక స్త్రీ ఎదురైనది. ఆడవారే తనభార్య ప్రశ్నకు సరియైన సమాధానం ఇవ్వగలరని భావించి ఆమెను జవాబు అడిగాడు
ఆమె ఒక వేశ్య. ఆమె " మీ ప్రశ్నకు జవాబు నేను చెప్పగలను. అమావాస్య ముందు రోజు మా ఇంటికి దయజేయండి" అన్నది.
ఆరాతీయగా ఈమె వేశ్య అని పండితునకు తెలిసినది. అయినను ఆమె చెప్పిన రోజు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె సాదరంగా ఆహ్వానించి ఒక వంద రూపాయలు ఇచ్చి "రేపు మా ఇంటికి విందుకు రండి" అన్నది. వెంటనే పండితుడు "నష్టమేముంది? అలాగే తప్పక వస్తాం!" అన్నాడు. మరురోజు మళ్లీ అక్కడ హాజరయ్యాడు. లోపలకు తీసుకువెళ్లి ఇంకొక వంద రూపాయలు చేతికిచ్చి నమస్కరించి --
" చూడండి! పక్వపదార్థములు మీరు ఎరిగినవే! పచ్చి పదార్థము ప్రతివారిచేతికీ దొరకదు. పచ్చి వంట నేను తయారుచేసి వడ్డిస్తాను. తమరు తీసుకొనండి" అన్నది.
అలాగే అన్నాడు పండితుడు. కాస్సేపటికి ఆ వేశ్య వంట వడ్డిస్తూ మరొక వంద రూపాయలు ఆయనకు సమర్పిస్తూ
"అయ్యా! నా చేతివంట తమరు తీసుకుంటున్నారు. కనుక నా చేతితో ముద్ద పెడతాను, అనుగ్రహించండి" అన్నది.
సరే నని సిద్ధపడ్డాడు పండితుడు. ఆమె ముద్ధ నోటిముందు పెట్టినది.
అతడు తీసుకోవడానికి నోరు తెరిచాడు. ఆమె లేచి గట్టిగా ఒక లెంపకాయ కొట్టి ఇలా అన్నది.
"ఇంకా మీకు జ్ఞానం కలుగలేదా!
జాగ్రత్త! నా ఇంట అన్నం తిన్నారంటే మీరు ధర్మభ్రష్టులవుతారు.
మీ లాంటి పండితుణ్ని నేను ధర్మభ్రష్టుణ్ని చేయాలనుకోవడం లేదు. రూపాయలు ముందుంచిన కొద్దీ మీరు పతన
మవుతున్నారు. పాపానికి తండ్రి ఎవరో మీకింకా అర్థం కాలేదా? అని గద్దించి పండితుణ్ని బయటకు గెంటి
వేసినది.
*పాపానికి తండ్రి "లోభము*
అరిషడ్వర్గాలన్నీ మహాబలంగా లొంగదీసుకుంటాయి. అదేమాయ.
మనీషి అన్న పదంలోనే మాయ దాగుంది
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త
తనికెళ్ళ శేష వెంకటాద్రి నమస్కారములతో....
- లక్ష్మి మాణిక్యాంబ