గురువాయుపురం ప్రత్యేకత
కృష్ణం వందే జగద్గురుం॥
గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం॥
ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ నామరూప భేదములను బట్టి శక్తి ప్రకటనలో ప్రత్యేకత ఉంటుంది. సనాతన ధర్మమైన భారతదేశంలో అద్భుతమైన ఆరోగ్య క్షేత్రం ఒకటి ఉన్నది. దానినే గురువాయుపురం అంటారు. గురువు, వాయువు కలిసి ఈ సముద్రతీరంలో పరశురాముడు చూపించిన చోటులో విష్ణువిగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. గురువాయుపుర క్షేత్రంలో ఉన్న దైవం గనుక గురువాయురప్ప అంటారు. ‘అప్ప’ అంటే పూజ్యుడైన పెద్దవాడు, ప్రభువు. ఆయన సాక్షాత్ కృష్ణుడు.
#మొట్టమొదట బ్రహ్మదేవుడు శంఖచక్రగదాపద్మములు ధరించిన బాల కృష్ణుని పూజించేవాడు. సుతపుడు అనే ప్రజాపతికి ఆ మూర్తిని ఇచ్చాడు. సుతపుడు అనే ప్రజాపతి తపఃఫలంగా విష్ణువు అతనికి పుత్రుడుగా కలిగాడు. ఆయన పేరు పృష్ణిగర్భుడు. అటుతర్వాత ఆ మూర్తిని అదితీకశ్యపులు ఆరాధన చేశారు. అప్పుడు విష్ణువు వామనుడిగా కలిగాడు. అదే స్వరూపం తరువాత యదువంశంలో ప్రవేశించి దేవకీ వసుదేవులు ఆరాధన చేశారు. అప్పుడు విష్ణువు కృష్ణుడిగా కలిగాడు. దేవకీవసుదేవులు చివరివరకూ పూజిస్తూ కృష్ణ నిర్యాణం తర్వాత సముద్రగర్భంలోకి వెళ్ళిపోయింది. కృష్ణుని ఆజ్ఞమేరకు గురువు, వాయువు కలిసి ఆ దివ్య విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ పరశురామ క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు.
తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుదాయుధం
శ్రీవత్స లక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోదసౌభగం!!
అంటూ కృష్ణుడు జన్మించినప్పుడు అద్భుతమైన శ్లోకాన్ని వ్యాసదేవుడు భాగవతంలో చెప్పారు. అదే స్వరూపం గురువాయురప్ప అసలు మూర్తి.
రుద్రుడు ఆ చోటును ఆలయ ప్రతిష్ఠాపనకోసం ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ గురువాయురప్ప క్షేత్రానికి సమీపంలోనే శివాలయం కూడా ఉంటుంది.
నవగ్రహాలకీ, అవతారానికీ సంబంధముంది. సూర్యగ్రహానికి రామచంద్రమూర్తి, కుజ గ్రహానికి నృసింహ స్వరూపం ఇలా ఒక్కొక్క అవతారానికీ ఒక్కొక్క గ్రహానికి సంబంధముంది అంటే అవతార కథ వినడం వల్ల ఆ గ్రహదోషం పోతుంది. అది విశేషమైన అంశం.
భగవత్ కథ విషయపరిజ్ఞానం కోసమో, భక్తిగా గానం చేసుకోవడం కోసమో కాకుండా భక్తిగా గానం చేసుకుంటూ ఉంటే అది మన బ్రతుకును బాగు చేస్తూ ఉంటుంది. అది భగవత్ కధకు ఉన్న గొప్ప వైభవం.
భగవత్ కథను ఎల్లవేళలా వినడం, పారాయణ చేయడం, మననం చేసుకోవడం, విన్న కథల వైభవాన్ని కీర్తన చేసుకుంటే అది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఆ కారణం చేతనే భగవత్ కథా శ్రవణం అనేది భారతీయ సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన అంశం అయింది.
అజ్ఞాత్వా తే మహత్త్వం యదిహ నిగదితం విశ్వనాథ క్షమేథాః
స్తోత్రం చైతత్సహస్రోత్తరమధికతరం త్వత్ప్రసాదాయ భూయాత్ ।
ద్వేధా నారాయణీయం శ్రుతిషు చ జనుషా స్తుత్యతావర్ణనేన
స్ఫీతం లీలావతారైరిదమిహ కురుతామాయురారోగ్యసౌఖ్యమ్ ॥ ౧౦౦-౧౧॥
సాన్ద్రానన్దావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ ।
అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హన్త భాగ్యం జనానామ్ ॥ ౧-౧॥
ఏవం దుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్
తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ ।
ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై
నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః ॥ ౧-౨॥
తరుణామ్బుదసున్దరస్తదా త్వం నను ధన్వన్తరిరుత్థితోఽమ్బురాశేః ।
అమృతం కలశే వహన్కరాభ్యామ్ అఖిలార్తిం హర మారుతాలయేశ ॥ ౨౮-౧౦॥ - ఈ శ్లోకం
పారాయణగా చేసుకోవడం చాలా మంచిది. ఇందులో ధన్వంతరి స్వరూపం ఉన్నది. ధన్వంతరి అంటేనే బాధించే వాటిని తొలగించువాడు అని అర్థం.
-
శ్రీకాంత్ చేవూరి